శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥ 47
శ్రేయాన్, స్వధర్మః, విగుణః, పరధర్మాత్, సు అనుష్ఠితాత్,
స్వభావనియతమ్, కర్మ, కుర్వన్, న, ఆప్నోతి, కిల్బిషమ్.
విగుణః (అపి) = అసంపూర్ణంగా, అంగహీనంగా అనుష్ఠితమైన; స్వధర్మః = స్వీయ వర్ణాశ్రమధర్మం; సు అనుష్ఠితాత్ = చక్కగా ఆచరింపబడిన; పరధర్మాత్ = పరధర్మం కంటే; శ్రేయాన్ = శ్రేష్ఠం; స్వభావ నియతమ్ = స్వభావజాతమైన; కర్మ = కార్యాన్ని; కుర్వన్ = చేస్తున్నప్పటికీ; కిల్బిషమ్ = పాపాన్ని; న ఆప్నోతి = పొందడు.
తా ॥ చక్కగా ఆచరింపబడిన పరధర్మం కంటే తన వర్ణం, ఆశ్రమం విధించే ధర్మం అంగహీనంగా అనుష్ఠించబడినా శ్రేష్ఠమే అవుతోంది. ఎందుకంటే, స్వభావజాతమైన కర్మలను ఆచరించేవాడు పాపాన్ని పొందడు. (కనుక, బంధు వధాది దోషాలతో కూడినదే అయినా, నీ ధర్మమైన యుద్ధం పరధర్మమైన భిక్షాటనం కంటే శ్రేష్ఠమే అవుతోంది.)