త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ॥ 3
త్యాజ్యమ్, దోషవత్, ఇతి, ఏకే, కర్మ, ప్రాహుః, మనీషిణః,
యజ్ఞ దాన తపః కర్మ, న, త్యాజ్యమ్, ఇతి, చ, అపరే.
ఏకే = కొందరు; మనీషిణః = పండితులు (సాంఖ్యులు); కర్మ = కర్మ; దోషవత్ = దోషయుక్తం (బంధకారణం); ఇతి = కనుక; త్యాజ్యమ్ = త్యజింపదగినది; (అని) ప్రాహుః = అన్నారు; అపరేచ = మరికొందరు (మీమాంసకులు); యజ్ఞ–దాన–తపః–కర్మ = యజ్ఞ దాన తపోరూప కర్మ; న త్యాజ్యమ్ = త్యజింపరానిది; ఇతి = అని (అన్నారు);
తా ॥ (అజ్ఞాని అయిన వాడు ఒనర్చే ఫలత్యాగమే త్యాగం; కర్మత్యాగం త్యాగం కాదు. ఈ విషయాన్నే దృఢపరుస్తున్నాడు-) సాంఖ్యులు కర్మే బంధకారణం, కాబట్టి కర్మనంతా పరిత్యజించాలి అని చెబుతున్నారు. కాని మీమాంసకులు యజ్ఞ దాన తపోరూపమైన కర్మను త్యజించడం అనుచితం అని అంటున్నారు.