రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ॥ 27
రాగీ, కర్మఫలప్రేప్సుః, లుబ్ధః, హింసాత్మకః, అశుచిః,
హర్షశోక అన్వితః, కర్తా, రాజసః, పరికీర్తితః.
రాగీ = నిషిద్ధాలను కోరేవాడూ; కర్మఫలప్రేప్సుః = కర్మఫలాకాంక్షీ; లుబ్ధః = పరద్రవ్యాసక్తుడు (స్వధన దానాసమర్థుడూ); హింసాత్మకః = పరులను పీడించే స్వభావం కలవాడూ; అశుచిః = అపవిత్రుడూ; హర్ష శోక అన్వితః = ఇష్టప్రాప్తికి సంతోషాన్ని, ఇష్టవియోగానికి దుఃఖాన్ని పొందేవాడూ అయిన; కర్తా = కర్త; రాజసః = రాజసికుడని; పరికీర్తితః = చెప్పబడుతున్నాడు;
తా ॥ వాసనాకులచిత్తుడూ, కర్మఫలాకాంక్షీ, పరద్రవ్యాసక్తుడూ, స్వధన దానాసమర్థుడూ, పరులను పీడించే స్వభావం కలవాడూ, అపవిత్రుడూ, ఇష్టప్రాప్తికి హర్షాన్ని, అనిష్టప్రాప్తికి శోకాన్నీ పొందే కర్త రాజసికుడు.