సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ॥ 20
సర్వభూతేషు, యేన, ఏకమ్, భావమ్, అవ్యయమ్, ఈక్షతే,
అవిభక్తమ్, విభక్తేషు, తత్, జ్ఞానమ్, విద్ధి, సాత్త్వికమ్.
యేన =దేనిచేత (ఏ జ్ఞానం చేత); విభక్తేషు = విభిన్నములైన; సర్వభూతేషు = సమస్తప్రాణులయందూ; అవిభక్తమ్ = అభిన్న భావంతో వెలయుచున్న; ఏకమ్ = అద్వితీయమూ; అవ్యయమ్ = అక్షయమూ అయిన; భావమ్ = ఆత్మవస్తువును; (నరః = మనుష్యుడు;) ఈక్షతే = దర్శిస్తున్నాడో; తత్ = ఆ; జ్ఞానమ్ = అద్వైతాత్మ దర్శనరూపమైన జ్ఞానం; సాత్త్వికమ్ = సాత్త్వికమని; విద్ధి = గ్రహించు.
తా ॥ (జ్ఞానంలో సాత్త్వికాది భేదాలు తెల్పబడుతున్నాయి-) అవ్యక్తం నుండి స్థావరాల వరకూ గల భూతాలన్నిటి యందూ అద్వితీయమూ, అవిభక్తమూ, అక్షయమూ అయిన ఆత్మవస్తువు ఏ జ్ఞానం చేత చూడబడుతుందో, ఆ అద్వైతాత్మ దర్శన–జ్ఞానాన్ని సాత్త్వికమని గ్రహించు.