జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ॥ 18
జ్ఞానమ్, జ్ఞేయమ్, పరిజ్ఞాతా, త్రివిధా, కర్మచోదనా,
కరణమ్, కర్మ, కర్తా, ఇతి, త్రివిధః, కర్మసంగ్రహః.
కర్మచోదనా = కర్మప్రేరకమైనది; జ్ఞానమ్ = జ్ఞానం; జ్ఞేయమ్ = తెలిసికోదగినది; పరిజ్ఞాతా = తెలుసుకునేవాడు; (అని) త్రివిధాః = మూడు విధాలు; కర్మసంగ్రహః = కర్మకు ఆశ్రయం; కరణమ్ = ఇంద్రియం; కర్మ = క్రియ; కర్తా = చేసేవాడు; ఇతి = అని; త్రివిధః = మూడు విధాలు.
తా ॥ (పూర్వశ్లోకార్థాన్ని వివరించడానికి కర్మ ప్రవృత్తి హేతువులు, కర్మాశ్రయాలు, కర్మఫలాలూ గుణాత్మకాలవడం వల్ల నిర్గుణాత్మకు వీటితో సంబంధం లేదనే అభిప్రాయంతో కర్మచోదనను, కర్మాశ్రయాన్ని ముందుగా తెలుపుతున్నాడు-) జ్ఞానం (ఇష్ట సాధన విషయమైన జ్ఞానం), జ్ఞేయం (ఇష్ట సాధనకు సంబంధించిన కర్మ), జ్ఞాత (తెలుసుకోబడే వాడు) – ఈ మూడూ కర్మ ప్రవృత్తి హేతువులు. కరణం(ఇంద్రియాలు), కర్మ, కర్త అనేవి కర్మాచరణానికి మూలాలు. (కర్మ ప్రయోజనాలైన గ్రహణ-త్యాగాల అవసరం పూర్ణమైన ఆత్మకు లేదు. కాబట్టి కర్మ అక్కరలేదు, ఆత్మ నిష్క్రియం.)