అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్చేష్టాః దైవం చైవాత్ర పంచమమ్ ॥ 14
అధిష్ఠానమ్, తథా, కర్తా, కరణమ్, చ, పృథక్ విధమ్,
వివిధాః, చ, పృథక్, చేష్టాః, దైవమ్, చ, ఏవ, అత్ర, పంచమమ్.
అధిష్ఠానమ్ = శరీరం; తథా = మరియు; కర్తా = అహంకారం; పృథక్ విధం చ = వివిధ వ్యాపార యుక్తమైన; కరణమ్ = మనోబుద్ధులతో కూడిన ఇంద్రియదశకాన్ని; వివిధాః చ = నానా విధాలైన; పృథక్ చేష్టాః = ప్రాణాదుల విభిన్న కార్యాలను; అత్ర = వీటి యందు; పంచమమ్ = ఐదవది అయిన; దైవమ్ ఏవ చ = ఇంద్రియాదుల అధిష్ఠాతలైన ఆదిత్యాది దేవతలును.
తా ॥ శరీరం, అహంకారం, మనోబుద్ధులతో కూడిన ఇంద్రియాలు, ప్రాణాదుల వివిధ కార్యాలు, చక్షురాది ఇంద్రియాలకు అధిష్ఠాతలైన ఆదిత్యాది దేవతలు (=అంతర్యామి) – అనే ఈ ఐదూ సమస్త కర్మలకూ కారణాలు.