న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ॥ 10
న, ద్వేష్టి, అకుశలమ్, కర్మ, కుశలే, న, అనుషజ్జతే,
త్యాగీ, సత్త్వసమావిష్టః, మేధావీ, ఛిన్నసంశయః.
సత్త్వ సమావిష్టః = సత్త్వగుణవిశిష్టుడూ; ఛిన్న సంశయః = అవిద్యాకృతములైన సంశయాలు లేనివాడూ; మేధావీ = ఆత్మజ్ఞానీ; త్యాగీ = ఆసక్తిని, ఫలాన్ని త్యజించినవాడూ అయిన వ్యక్తి; అకుశలమ్ = అశుభమూ, కామ్యమూ అయిన; కర్మ = కర్మను; న ద్వేష్టి = ద్వేషించడు; కుశలే = శుభమైన నిత్యకర్మలో; న అనుషజ్జతే = ఆసక్తుడు కాడు.
తా ॥ (గౌణసన్న్యాస ఫలమైన ముఖ్యసన్న్యాసం సూచించబడుతోంది 🙂 ఆసక్తిని, ఫలాలను త్యజించి నిష్కామ కర్మానుష్ఠానం ఒనర్చేవాడు, సత్త్వగుణ యుక్తుడై ఆత్మజ్ఞానాన్ని పొంది, అవిద్యాకృతాలైన సంశయాలన్నింటి నుండీ ముక్తుడైనప్పుడు, కామ్యకర్మలను సంసార కారణాలను ద్వేషించడు, మోక్షకారణాలని నిత్యకర్మలపై ప్రీతినిగొనడు.* (నైష్కర్మ్య లక్షణమైన జ్ఞాననిష్ఠలో ఉంటాడు;) ఇదియే పూర్వోక్తమైన కర్మయోగ ఫలం. (గీత : 5-13 చూ.)