యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ॥ 4
యజంతే, సాత్త్వికాః, దేవాన్, యక్షరక్షాంసి, రాజసాః,
ప్రేతాన్, భూతగణాన్, చ, అన్యే, యజంతే, తామసాః, జనాః.
సాత్త్వికాః = సాత్త్వికులు; దేవాన్ = దేవతలను; యజంతే = పూజిస్తున్నారు; రాజసాః = రాజసికులు; యక్ష రక్షాంసి = యక్షులను, రాక్షసులను (పూజిస్తున్నారు); అన్యే = ఇతరులైన; తామసాః జనాః = తామసికులు; ప్రేతాన్ = ప్రేతాలను; భూతగణాన్ చ = భూతాలను; యజంతే = పూజిస్తున్నారు;
తా ॥ సాత్త్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూతప్రేతాలను పూజిస్తున్నారు. (పూజా విధిని అనుసరించి పూజ చేసేవారి స్వభావాన్ని గ్రహించవచ్చు.)
వ్యాఖ్య:-
ఎవరిలో ఏ గుణం (సత్త్వ, రజో, తమో గుణాలలో) ఎక్కువగా ఉంటుందో, వారి స్వభావం, ప్రవర్తన, తినే ఆహారం, మాట్లాడే మాటలు, వారి పద్ధతులు, వారు చదివే పుస్తకాలు, వారు పూజించే దేవుళ్లు — ఇవన్నీ ఆ గుణానికి తగినట్లుగానే ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతకుముందే 14వ అధ్యాయంలో వివరించారు. ఇప్పుడు ఆ విషయం మనసులో ఇంకా బాగా స్థిరపడాలనే ఉద్దేశంతో మళ్ళీ చెబుతున్నారు.
మనసులో ఉన్న సంస్కారాన్ని బట్టి మనుషులు ఎంచుకునే దేవుళ్లు మారిపోతారు:
- సాత్వికులు (మంచివారు):
- వీరు ‘దేవతలను’ పూజిస్తారు.
- శాంతి, ధర్మం, లోక కళ్యాణం కోరుకుంటారు కాబట్టి, సాత్విక స్వభావం ఉన్న దైవ రూపాలను ఆరాధిస్తారు.
- రాజసికులు (కోరికలు ఉన్నవారు):
- వీరు ‘యక్షులను, రాక్షసులను’ పూజిస్తారు.
- ఎందుకు? వీరికి కావాల్సింది మోక్షం కాదు.. బలం, అధికారం, డబ్బు, శత్రువుల మీద విజయం. అవి తొందరగా ఇచ్చేది ఉగ్ర రూపాలు (రాక్షస స్వభావం ఉన్నక్తులు) కాబట్టి వారిని పూజిస్తారు.
- తామసికులు (అజ్ఞానులు):
- వీరు ‘భూతాలను, ప్రేతగణాలను’ (చనిపోయిన వారి ఆత్మలను, క్షుద్ర శక్తులను) పూజిస్తారు.
- వీరి బుద్ధి చీకటిలో ఉంటుంది కాబట్టి, స్మశానాలకు సంబంధించిన, భయంకరమైన క్షుద్ర పూజల వైపు ఆకర్షితులవుతారు.
ఈత చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కల్లు అనే అనుకుంటారు. అలాగే, మన గుణం మారనంత వరకు మనం చేసే పూజ కూడా ఆ గుణానికి తగ్గట్టే ఉంటుంది. అందుకే సాత్విక గుణాన్ని పెంచుకుని, సాత్విక పూజ వైపు మళ్లాలని దీని అర్థం.