అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ॥ 28
అశ్రద్ధయా, హుతమ్, దత్తమ్, తపః, తప్తమ్, కృతమ్, చ, యత్,
అసత్, ఇతి, ఉచ్యతే, పార్థ, న, చ, తత్, ప్రేత్య, నో, ఇహ.
అశ్రద్ధయా = అశ్రద్ధతో; హుతమ్ = అనుష్ఠితమైన యజ్ఞం; దత్తమ్ = ఒసగబడిన దానం; తప్తమ్ = చేయబడిన; తపః = తపస్సు; యత్ చ = మరియు ఇంకా ఏది; కృతమ్ = ఒనర్చబడిందో (అదంతా;) అసత్ ఇతి = అసత్తు అని; ఉచ్యతే = చెప్పబడుతోంది; పార్థ = అర్జునా; తత్ = అది; న చ ప్రేత్య = (వైగుణ్యమవడం వల్ల) మరణానంతరం గాని; న ఇహ = (అయశస్కరం అవడం వల్ల) ఇహంలో కూడా (ఫలప్రదం కాదు).
తా ॥ (కర్మలనన్నింటినీ శ్రద్ధతో ఒనర్చవలెననడానికి గాను, అశ్రద్ధను నిందిస్తున్నాడు:) పార్థా! అశ్రద్ధాపూర్వకంగా అనుష్ఠించబడిన యజ్ఞ దాన తపములూ, తదితరములైన క్రియలు కూడా ‘అసత్’ అని చెప్పబడుతున్నాయి, అవి (వైగుణ్య యుక్తాలవడం చేత) పరలోకంలో (అయశస్కరం అవడం చేత) ఇహలోకంలో కూడా నిష్ఫలాలవుతున్నాయి.