అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే ।
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ॥ 22
అదేశకాలే, యత్, దానమ్, అపాత్రేభ్యః, చ, దీయతే,
అసత్కృతమ్, అవజ్ఞాతమ్, తత్, తామసమ్, ఉదాహృతమ్.
అదేశకాలే = అపవిత్రస్థానాలలో (అశౌచాది స్థితులలో); అపాత్రేభ్యః చ = అనుపయుక్తులైన వారికి అపాత్రులైనవారికి; అసత్కృతమ్ = పాదప్రక్షాళన, ప్రియవచనాది సత్కారం లేక; అవజ్ఞాతమ్ = తిరస్కార భావంతో; యత్ దానమ్ = ఏ దానం; దీయతే = ఒసగబడుతోందో; తత్ = ఆ దానం; తామసమ్ = తామసం అని; ఉదాహృతమ్ = చెప్పబడింది.
తా ॥ అపవిత్రస్థానాలలో గాని, అశౌచాది స్థితులలో గాని, అయోగ్యులకు గాని, పాదప్రక్షాళన ప్రియవచనాది సత్కారాలను ఒనర్చకుండా తిరస్కార భావంతో చేసే దానాన్ని తామసికం అంటారు.