యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ॥ 21
యత్, తు, ప్రత్యుపకార అర్థమ్, ఫలమ్, ఉద్దిశ్య, వా, పునః,
దీయతే, చ, పరిక్లిష్టమ్, తత్, దానమ్, రాజసమ్, స్మృతమ్.
తు = కాని; యత్ = ఏ దానం; ప్రత్యుపకార అర్థమ్ = ప్రత్యుపకారాన్ని పొందడానికో; వా = లేక; ఫలం చ = ఆముష్మిక ఫలాన్ని; ఉద్దిశ్య = పొందగోరి గాని; పునః = మరియు; పరిక్లిష్టమ్ = మనః క్లేశంతో; దీయతే = ఒసగబడుతున్నదో; తత్ దానమ్ = ఆ దానం; రాజసమ్ = రాజసికం అని; స్మృతమ్ = తలంపబడింది.
తా ॥ ప్రత్యుపకారాన్ని ఆశించి గాని, లేక ఆముష్మిక ఫలాన్ని అభిలషించి గాని, లేక అనిచ్ఛాపూర్వకంగా గాని ఇయ్యబడే దానాన్ని రాజసికం అంటారు.
వ్యాఖ్య:-
తిరిగి ఏదైనా ఆశించి చేసే దానం ఉత్తమమైనది కాదని చెబుతున్నారు. ప్రతిఫలం ఆశించి చేసే దానం బజారులో చేసే వ్యాపారం లాంటిదే అవుతుంది. ఇలాంటి ‘ఇచ్చి పుచ్చుకునే’ పద్ధతి అంత గొప్పది కాదు; అది ‘రాజస దానం’ అవుతుంది. అలాగే, భవిష్యత్తులో లేదా స్వర్గంలో ఏదో పుణ్యం వస్తుందని ఆశపడి చేసే దానం కూడా శ్రేష్ఠమైనది కాదు. ఏ కోరికలూ లేకుండా, కేవలం భగవంతుని ప్రీతి కోసం చేసే దానమే అత్యుత్తమమైనది.
‘పరిక్లిష్టమ్’ – అంటే అయిష్టంగా ఇవ్వడం. కొందరు దానం చేసేటప్పుడు “అయ్యో! నా డబ్బు లేదా వస్తువు పోతోందే” అని మనసులో బాధపడుతుంటారు. మరికొందరు ఇతరుల బలవంతం మీద దానం చేస్తారు. అలా బాధపడుతూ చేసే దానం మంచి పద్ధతి కాదు, దానివల్ల మంచి ఫలితం కూడా రాదు.
దానం చేయడం నా కర్తవ్యం, నా ధర్మం అని భావించి, ఇష్టపూర్వకంగా, ఆనందంగా ఇవ్వడమే ‘సాత్త్విక దానం’. మిగతావన్నీ రాజస లేదా తామస దానాలే అవుతాయి. అందుకే తెలివైనవారు ఎప్పుడూ సాత్త్విక దానాన్నే ఆచరించాలి.