దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ॥ 20
దాతవ్యమ్, ఇతి, యత్, దానమ్, దీయతే, అనుపకారిణే,
దేశే, కాలే, చ, పాత్రే, చ, తత్, దానమ్, సాత్త్వికమ్, స్మృతమ్.
దేశే = తీర్థాది యోగ్యస్థానము; కాలే చ = పుణ్య కాలాలలో; పాత్రే చ = విద్యా తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు; (పాత్రత గలవారికి) దాతవ్యమ్ = దానమివ్వడం కర్తవ్యం; ఇతి = అనే భావంతో; అనుపకారిణే = ప్రత్యుపకారం ఆశించకుండా; యత్ దానమ్ = ఏ దానం; దీయతే = ఇవ్వబడుతోందో; తత్ దానమ్ = ఆ దానం; సాత్త్వికమ్ = సాత్త్వికం అని; స్మృతమ్ = తలంపబడింది;
తా ॥ (దానభేదాలు వివరింపబడుతున్నాయి 🙂 ‘దానం ఇవ్వడం కర్తవ్యం’ అనే భావంతో, ప్రత్యుపకారాన్ని ఆశించకుండా కురుక్షేత్రాది పుణ్యప్రదేశాలలో, గ్రహణాది పుణ్యకాలాల్లో విద్యా తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు అర్పించబడే దానాన్ని సాత్త్వికం అంటారు.
వ్యాఖ్య:-
‘దాతవ్యమితి’ – అంటే దానం చేయడం మన బాధ్యత అని భావించి దానం చేయాలి. అంతేగానీ, ఎవరిదో మెప్పు కోసమో, ప్రతిఫలాన్ని ఆశించో చేయకూడదు. ఎవరైనా “నువ్వు ఎందుకు దానం చేస్తున్నావు?” అని అడిగితే, “ఇది నా ధర్మం. దానం చేయడం నా విధి, అందుకే చేస్తున్నాను” అని మాత్రమే సమాధానం చెప్పాలి. నిజానికి త్యాగం చేయడం లేదా దానం చేయడం వల్ల మనకే మేలు జరుగుతుంది. ఒకరికి ఉపకారం చేసినా, దానివల్ల వచ్చే పుణ్యం మనకే దక్కుతుంది కాబట్టి, అది మనకు మనం చేసుకునే మేలే అవుతుంది. కాబట్టి దానం చేసేవారు తాము ఎవరినో ఉద్ధరించామని అనుకోవడం కంటే, ఆ దానం ద్వారా తమని తామే ఉద్ధరించుకుంటున్నామని భావించడం ఉత్తమం.
‘అనుపకారిణే’ – అని చెప్పడం ద్వారా, తిరిగి ఉపకారం చేయలేని వారికి, పేదవారికి, అసమర్థులకు, వికలాంగులకు, దరిద్రనారాయణులకు చేసే దానమే గొప్పదని అర్థమవుతోంది. అలాగే, శక్తి ఉన్నవారికి లేదా తిరిగి సాయం చేయగలిగే సమర్థులకు దానం చేయడం అంత గొప్ప విషయం కాదని కూడా ఈ పదం సూచిస్తోంది.
‘దేశే’ – అంటే పుణ్యక్షేత్రాల్లో, తీర్థయాత్రల్లో, పవిత్రమైన ఆశ్రమాల్లో లేదా దైవభావన ఉన్న పవిత్ర ప్రదేశాల్లో అని అర్థం.
‘కాలే’ – అంటే గ్రహణం, సంక్రాంతి లేదా ఏదైనా పుణ్యకార్యం జరిగే పవిత్ర సమయాల్లో అని అర్థం.
‘పాత్రే’ – అంటే అర్హత ఉన్నవాడికి, తగినవాడికి అని అర్థం. అందుకే “పాత్రత ఎరిగి దానం చేయాలి” అని పెద్దలు చెబుతారు. అనర్హుడికి (అపాత్రుడికి) దానం చేస్తే దాతకు సరైన ఫలితం దక్కదని భావం.