అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ॥ 12
అభిసంధాయ, తు, ఫలమ్, దంభార్థమ్, అపి, చ, ఏవ, యత్,
ఇజ్యతే, భరతశ్రేష్ఠ, తమ్, యజ్ఞమ్, విద్ధి, రాజసమ్.
తు = కాని; ఫలమ్ = స్వర్గాది ఫలాన్ని; అభిసంధాయ = అపేక్షించి; దంభార్థం అపి చ ఏవ = తన మహత్త్వ ప్రకటన కొరకే; యత్ = ఏ యజ్ఞం; ఇజ్యతే = ఒనర్చబడుతుందో; భరతశ్రేష్ఠ = అర్జునా; తమ్ = ఆ; యజ్ఞమ్ = యజ్ఞాన్ని; రాజసమ్ = రాజసికమని; విద్ధి = గ్రహించు.
తా ॥ అర్జునా! ఫలకాంక్షతోనూ, తన మహత్త్వాన్ని ప్రకటించుకోవడానికి ఒనర్చబడే యజ్ఞం రాజసమని గ్రహించు.
వ్యాఖ్య:-
ఫలాన్ని ఆశించి చేసే పనిచేత మనసు ఎప్పుడూ శుద్ధి చెందదు. మనసు శుద్ధం కానంతవరకు ఆత్మతత్వం మనకి అనుభవంలోకి రాదు. అందుకే ఫలాభిలాషతో చేసే కర్మను “రాజస కర్మ” అని అంటారు, అది త్యజించదగినదని చెప్పబడింది. అలాగే, పేరు, ఖ్యాతి, వేషం లేదా డంబం (గర్వం) కొరకు చేసే పనులు కూడా రాజస కర్మలు అని ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి అలాంటి కర్మలను ఎవరూ అనుసరించకూడదు.