శ్రీ భగవానువాచ :
ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥ 1
ఊర్ధ్వమూలమ్, అధః శాఖమ్, అశ్వత్థమ్, ప్రాహుః, అవ్యయమ్,
ఛందాంసి, యస్య, పర్ణాని, యః, తమ్, వేద, సః, వేదవిత్.
(వేదపురాణాది శాస్త్రాలు) ఊర్ధ్వమూలమ్ = వేళ్ళు పైనగలది (అవ్యక్తమైన మాయా శక్తితో కూడిన బ్రహ్మమే మూలంగా గలదీ); అధః శాఖమ్ = క్రింద కొమ్మలు గలది (మహదహంకార తన్మాత్రాదులు అనే శాఖలు క్రిందుగా గలదీ అయిన, ఆ); అవ్యయమ్ = అనాది; అశ్వత్థమ్ = క్షణికమైన సంసారాన్ని (మాయా వృక్షమని); ప్రాహుః = చెబుతున్నాయి; ఛందాంసి = కర్మకాండ రూపమైన వేదసమూహాలు; యస్య = దేనికి; పర్ణాని = పత్రాలో; తమ్ = దానిని (సమూలమైన సంసార వృక్షాన్ని); యః = ఎవడు; వేద = తెలుసుకుంటాడో; సః = అతడు; వేదవిత్ = వేదజ్ఞుడు.
తా ॥ [పూర్వాధ్యాయాంతంలో ‘ఎవడు ఐకాంతిక భక్తితో నన్ను సేవిస్తాడో’ (14-27) ఇత్యాది, పరమేశ్వరుని ఏకాంత భక్తితో ఉపాసించే వారికి, తత్ప్రసాదలబ్ధ జ్ఞానంతో బ్రహ్మభావం కలుగుతుంది అని చెప్పబడింది – ఈ భక్తి గాని జ్ఞానం గాని అవిరక్తునికి కలుగవు; కనుక, వైరాగ్యపూర్వమైన జ్ఞానాన్ని ఉపదేశింపదలచి, సంసారరూపమైన వృక్షాన్ని రూపకాలంకారంలో వర్ణిస్తూ-] శ్రీభగవానుడు పలికెను: ఈ సంసార వృక్షానికి, మూలం (కారణం)* ఊర్ధ్వంలో ఉంది; దీని శాఖలు (హిరణ్యగర్భుడు మొదలైన వారు)* క్రిందుగా ఉన్నాయి. కర్మకాండ రూపమైన వేదాలు దీని పత్రాలు.* అనాదియూ,* క్షణికమూ అయిన ఈ సంసారం వేదశాస్త్ర పురాణాలలో మాయామయ వృక్షం అని చెప్పబడి ఉంది.* ఇట్టి సంసారవృక్షాన్ని తెలుసుకున్నవాడే వేదజ్ఞుడు.