యస్మాత్ క్షరమతీతోఽహం అక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 18
యస్మాత్, క్షరమ్, అతీతః, అహమ్, అక్షరాత్, అపి, చ, ఉత్తమః,
అతః, అస్మి, లోకే, వేదే, చ, ప్రథితః, పురుషోత్తమః.
యస్మాత్ = ఎందువల్ల; అహమ్ = నేను; క్షరమ్ అతీతః = క్షరానికి (అశ్వత్థమనబడే సంసార మాయావృక్షానికి) అతీతుణ్ణో; అక్షరాత్ అపి చ = అక్షరం కంటే, సంసార బీజభూతమైన శక్తికంటే కూడా; ఉత్తమః = శ్రేష్ఠుడనో; అతః = అందువల్ల; లోకే = లోకంలోనూ; వేదే చ = వేదంలోనూ; పురుషోత్తమః = పురుషోత్తముడని; ప్రథితః = ప్రసిద్ధుణ్ణి; అస్మి = అయ్యాను.
తా ॥ నేను క్షర అక్షర ములు రెండింటికీ కూడా అతీతుణ్ణి (ప్రపంచాతీతుణ్ణి) అవడం వల్ల వేదాలు, లోకాలూ నన్ను పురుషోత్తముడు అంటున్నాయి.
“అస్తి నాస్తి మధ్య స్థితి”
శ్రీరామకృష్ణులు (‘మ’ తో, నవ్వుతూ): ఇతడు అక్కడకు (బుద్ధగయ) వెళ్ళాడు.
‘మ’ (నరేంద్రుడితో): బుద్ధుడి సిద్ధాంతాలు ఏమిటి?
నరేంద్రుడు: తపస్సు ద్వారా ఆయన సాక్షాత్కరించుకొన్న విషయాలను మాటలలో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా లోకులు ఆయన్ను నాస్తికుడన్నారు.
శ్రీరామకృష్ణులు (సైగలు చేస్తూ): నాస్తికుడెందుకు? ఆయన నాస్తికుడు కాదు. తన ఆంతరంగిక అనుభవాలను మాటలలో వ్యక్తం చేయలేకపోయాడు. బుద్ధుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? బోధస్వరూపాన్ని ధ్యానిస్తూ అట్లే అయిపోవడం, బోధస్వరూపంగా అయిపోవడం.
నరేంద్రుడు: అవునండీ. బుద్ధులలో మూడు తరగతుల వారున్నారు – బుద్ధుడు, అర్హతుడు, బోధిసత్త్వుడు.
శ్రీరామకృష్ణులు: ఇది కూడా భగవంతుని లీలయే – ఇది ఒక నూతన లీల. బుద్ధుణ్ణి నాస్తికుడని ఎందుకు అనాలి? స్వరూపం యొక్క బోధ ఎక్కడైతే ఉంటుందో అది అస్తి, నాస్తిలకు మధ్య ఉన్నటువంటి స్థితి.
నరేంద్రుడు (‘మ’ తో): ఆ స్థితిలో పరస్పర విరుద్ధాలు కలుసుకొంటాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే శీతల జలం తయారవుతుంది. మళ్ళీ అదే హైడ్రోజన్, ఆక్సిజన్లను ఆక్సో–హైడ్రోజన్ బ్లో పైప్‌లో వాడతారు. ఆ స్థితిలో కర్మలు, కర్మత్యాగం రెండూ సాధ్యమే; అంటే అప్పుడు నిష్కామకర్మ సాధ్యం అవుతుంది. “ఇంద్రియ సుఖాలలో నిమగ్నమైవున్న ప్రాపంచిక వ్యక్తులు సర్వం అస్తియే అంటారు. కాని మాయావాదులు నాస్తి, అంటే ‘ఉన్నది ఏమీ లేదు’ అంటారు. బుద్ధుని స్థితి ఈ అస్తి, నాస్తులకు అతీతమైనది.”
శ్రీరామకృష్ణులు: ఈ అస్తి, నాస్తి అనేవి ప్రకృతి యొక్క గుణాలు. అయితే, సత్యం ఈ రెంటికీ అతీతం.
భక్తులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. (మూలం: శ్రీరామకృష్ణ కథామృతం)
—–
జగత్తు, అహంకారం – కుండలు, సూర్యుడు దృష్టాంతం
శ్రీరామకృష్ణులు (‘మ’, తదితరులతో): బ్రహ్మజ్ఞానం అంత సులువుగా లభిస్తుందా ఏమిటి? మనస్సు నశించకుండా అది సాధ్యం కాదు. గురువు శిష్యుడితో ‘నువ్వు నీ మనస్సును నా కివ్వు. నేను నీకు జ్ఞానం ప్రసాదిస్తాను’ అన్నాడు. నాంగ్టా ‘మనస్సును విచ్చలవిడిగా తిరుగనీయవద్దు’ అనేవాడు.
“ఈ స్థితిలో కేవలం భగవత్ప్రసంగాలు, భక్తుల సాంగత్యం మాత్రమే రుచిస్తాయి.
(రామ్‌తో) “నువ్వు డాక్టరువు కదా! ఔషధం రక్తంలో కలసి దానితో ఏకమైనప్పుడే కదా ఔషధం పనిచేస్తుంది. అదే విధంగా ఆ స్థితిలో బ్రహ్మజ్ఞాని లోపలా వెలుపలా భగవంతుణ్ణి దర్శిస్తాడు; భగవంతుడే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మలుగా అయివున్నట్లు దర్శిస్తాడు.”
‘మ’ (స్వగతం): విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, జీర్ణించు కోవడం.
శ్రీరామకృష్ణులు: మనస్సు నశించగానే బ్రహ్మజ్ఞాన స్థితి కలుగుతుంది. మనస్సు నశించినప్పుడే ‘నేను’, ‘నేను’ అంటూ ఉండే ‘అహం’ నశించిపోతుంది. ఈ స్థితి భక్తిమార్గం ద్వారానూ కలుగుతుంది, జ్ఞానమార్గం అంటే విచారణామార్గం ద్వారా కూడా కలుగుతుంది. జ్ఞానమార్గగాములు ‘నేతి, నేతి’ అంటే ‘ఇదంతా మాయ, స్వప్నం లాటిది’ అంటూ విచారణ చేస్తారు. ఈ జగత్తును ‘నేతి, నేతి’ అంటూ జగత్తును మాయగా తృణీకరిస్తారు. జగత్తు మాయమైనప్పుడు మిగిలేది జీవులే, అంటే ‘అహంకారాలే’.
“అహంకారాన్ని ఒక కుండతో పోల్చవచ్చు. నీటితో నిండి ఉన్న కుండలు పది ఉన్నాయనుకుందాం. వాటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. అప్పుడు మనకు ఎందరు సూర్యులు కానవస్తారు?”
ఒక భక్తుడు: పది బింబాలు కనిపిస్తాయి. అసలు సూర్యుడు ఉండనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: సరే, వాటిలో ఒక కుండను పగులగొడితే ఎందరు సూర్యులు కనిపిస్తారు?
భక్తుడు: తొమ్మిది; యథార్థ సూర్యుడు ఒకడు ఉండనే ఉన్నాడు.
శ్రీరామకృష్ణులు: సరే, తొమ్మిది కుండలనూ పగులగొడితే ఎందరు సూర్యులను చూడవచ్చు.
భక్తుడు: ఒక సూర్యబింబం, ఒక యథార్థ సూర్యుడు.
శ్రీరామకృష్ణులు (గిరీశ్‌తో): ఆఖరి కుండను కూడా పగలగొడితే ఏం మిగులుతుంది?
గిరీశ్: ఆ యథార్థమైన సూర్యు డొక్కడేనండి.
శ్రీరామకృష్ణులు: అది కాదు. అప్పుడు ఏదైతే ఉంటుందో దానిని నోటితో చెప్పజాలం. ఏదైతే ఉందో అదే ఉంది. ప్రతిబింబ సూర్యుడు లేకుంటే యథార్థ సూర్యుడు ఉన్నట్లు ఎలా తెలుసుకోగలవు? సమాధి స్థితిని పొందిన తరువాత ‘అహం’ తత్త్వం నాశనమవుతుంది. సమాధి స్థితి నుండి క్రిందకు దిగివచ్చిన వ్యక్తి అక్కడ ఏం చూశాడో నోటితో చెప్పజాలడు. (మూలం: శ్రీరామకృష్ణ కథామృతం)
Related Articles:
- ఓ అర్జునా! సూర్యుని రూపంలో నేను వేడిని ఇస్తున్నాను. సముద్రములనుండి నీటిని గ్రహించి, వర్షరూపమున మఱల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలమును) గూడ నేనే. (BG 9.19)
- అర్జునా! దేనిని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందో దానిని చెబుతాను. ఆ ఆదిరహితమైన పరబ్రహ్మం సత్–ప్రత్యయానికీ, అసత్–ప్రత్యయానికీ కూడా అగోచరం; సత్–శబ్దానికీ, అసత్–శబ్దానికీ కూడా అలక్ష్యం. ఏలయన, ఇంద్రియ గోచరాలైన వస్తువులన్నీ సత్-అసత్ అని చెప్పజాలనివి, కాని బ్రహ్మం ఇంద్రియ గోచరం కాదు. (BG 13.13)