అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥ 14
అహమ్, వైశ్వానరః, భూత్వా, ప్రాణినామ్, దేహమ్, ఆశ్రితః,
ప్రాణ అపాన సమాయుక్తః, పచామి, అన్నమ్, చతుర్విధమ్.
అహమ్ = నేను; వైశ్వానరః భూత్వా = జఠరాగ్నినై; ప్రాణినామ్ = జీవుల; దేహమ్ = శరీరాన్ని; ఆశ్రితః = ఆశ్రయించి; ప్రాణ అపాన సమాయుక్తః = ప్రాణాపాన వాయువులతో కూడి; చతుర్విధమ్ = భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములనే నాలుగు విధాలైన; అన్నమ్ = అన్నాన్ని; పచామి = పచనం చేస్తున్నాను.
తా ॥ నేను జఠరాగ్ని రూపంలో ప్రాణుల దేహాన్ని సమాశ్రయించి ప్రాణ అపాన వాయువులతో కూడి, వారు భుజించే భక్ష్య, భోజ్య లేహ్య, చోష్యములనే* చతుర్విధ ఆహారాలను పచనం చేస్తున్నాను. (బృహదారణ్యకోపనిషత్తు 7-9-1 చూ:)
గోలాప్–మా స్వీయ అనుభవాన్ని ఇలా వర్ణించారు: ఒక రోజు శ్రీరామకృష్ణులు దివ్యోన్మత్త స్థితిలో ఉన్నప్పుడు ఆయన కోసం ఆమె హల్వా తెచ్చింది. ఆయన హల్వా నోట్లో వేసుకోగానే సర్పం వంటి ప్రాణి ఏదో ఆయన గొంతులోనుండి ఠక్కున హల్వాను కబళించి వేసినట్లు ఆమె చూసింది. సర్పాకృతిలోని కుండలినికి ఆయన ఆహారం నివేదిస్తున్నట్లు ఆమెకు తోచింది. ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. తరువాత గురుదేవులు ఆమెను, “సరే, ఎవరు తింటున్నారో చెప్పగలవా? నేనా లేక మరెవరోనా?” అని అడిగారు. అందుకు ఆమె, “ఒక సర్పం మీ గొంతులో కూర్చుని ఆహారాన్ని కబళించి వేస్తున్నట్లుంది” అని జవాబిచ్చింది. ఆ జవాబు విని ఆనందం వ్యక్తం చేస్తున్న ధోరణిలో, “సరిగ్గా చెప్పావు. దాన్ని చూసి నువ్వు తరించావు” అన్నారు నవ్వుతూ.
గురుదేవుల గొంతులో సర్పాకృతిలో ఉన్న కుండలిని ఆహారం స్వీకరించడం నిస్తారిణీదేవి కూడా చూసింది. గురుదేవులకు సందేష్ అనే తీపి తినుబండారం అంటే చాలా ఇష్టం. ఒకసారి గురుదేవులు కూర్చుని ఉన్నప్పుడు చేతులు జోడించుకొని ఆమె ఆయనకు ఎదురుగా కూర్చుంది. అప్పుడు ఆయన ఇలా అడిగారు: “నీకు ఏం కావాలి? నీ చేత్తో నాకు తినిపించగోరుతున్నావా? సరే అలాగే.” గురుదేవుల నోట్ల ఒక సందేష్ పెట్టగానే ఏదో విచిత్రశక్తి ఠక్కున దానిని కబళించివేయడం ఆమె చూసింది. దాంతో ఆమె భయపడింది. (మూలం: సర్వ దేవదేవీ స్వరూపుడు శ్రీరామకృష్ణ)