సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ॥ 9
సత్త్వమ్, సుఖే, సంజయతి, రజః, కర్మణి, భారత,
జ్ఞానమ్, ఆవృత్య, తు, తమః, ప్రమాదే, సంజయతి, ఉత.
భారత = అర్జునా; సత్త్వమ్ = సత్త్వగుణం (జీవుణ్ణి); సుఖే = సుఖంలో; సంజయతి = తగుల్కొల్పును; రజః = రజోగుణం; కర్మణి = కర్మలో (తగుల్కొల్పుతుంది); తు = కాని; ఉత = మరి; తమః = తమోగుణం; జ్ఞానమ్ = జ్ఞానాన్ని; ఆవృత్య = ఆవరించి; ప్రమాదే = అనవధానత యందు; సంజయతి = చిక్కించును.
తా ॥ (గుణాల యొక్క విశేష సామర్థ్యం చెప్పబడుతోంది) అర్జునా! సత్త్వగుణం, దుఃఖశోకాది కారణాలు ఉన్నప్పటికీ, జీవునికి సుఖాన్ని చేకూర్చు తోంది. ఇదేవిధంగా దుఃఖశోకాలు ఉన్నప్పటికీ, రజోగుణం కర్మలను ఆచరించేలా చేస్తోంది. తమోగుణం, మహాత్ముల వద్ద విన్న సత్యోపదేశాన్ని (జ్ఞానాన్ని) మరుగు పరిచి, విస్మృతి కలుగజేస్తోంది.
వ్యాఖ్య:–
గుణాలు – ఆత్మపై పొరలు:
ఇంతకుముందు చెప్పిన విషయమే మనకు ఇంకా బాగా అర్థం కావడం కోసం (గట్టిగా నాటుకోవడం కోసం) మళ్ళీ చెబుతున్నారు.
- సత్త్వగుణం: ప్రాపంచిక సుఖాల వైపు లాగుతుంది.
- రజోగుణం: రకరకాల పనుల (కర్మల) వైపు లాగుతుంది.
- తమోగుణం: నిద్ర, ఏమరుపాటు వైపు లాగుతుంది.
శ్రీరామకృష్ణుల ఉదాహరణ:
ఈ మూడు గుణాలు మన ఆత్మను ఎలా కప్పేస్తాయో చెప్పడానికి శ్రీరామకృష్ణ పరమహంస ఒక చక్కని ఉదాహరణ చెప్పారు:
- జీవుడిని సత్త్వగుణం ఆవరించడం అంటే… దీపం మీద గాజు చిమ్నీ పెట్టినట్లు. (వెలుగు బయటకు వస్తుంది, కానీ అడ్డంకి ఉంటుంది).
- జీవుడిని రజోగుణం ఆవరించడం అంటే… దీపం మీద అలకని గంప (చిల్లుల గంప/బుట్ట) బోర్లించినట్లు. (వెలుగు సరిగా రాదు).
- జీవుడిని తమోగుణం ఆవరించడం అంటే… దీపం మీద కుండ బోర్లించినట్లు. (వెలుగు పూర్తిగా ఆగిపోయి చీకటిగా ఉంటుంది).
మూడూ అడ్డంకులే:
ఈ మూడు కూడా జ్ఞానదీపాన్ని (ఆత్మను) ఏదో ఒక రకంగా కప్పేసేవే. అందుకే ఈ మూడింటినీ దాటితేనే మనం నిజమైన ఆత్మ స్థానాన్ని చేరుకోగలం.
భగవంతుడి ఆశ్చర్యం (‘ఉత’):
నిజానికి జీవుడు నిత్య నిర్మలుడు (ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేవాడు). అలాంటి జీవుడు, ఈ గుణాలకు లొంగిపోయి ఇలా ప్రవర్తించడం చూసి భగవంతుడికి కూడా ఆశ్చర్యం వేస్తోందట. శ్లోకంలో వాడిన ‘ఉత’ అనే పదానికి ‘ఆశ్చర్యం’ అని అర్థం. “అరె! ఇంత గొప్ప ఆత్మ, ఇలా మాయలో పడిపోయిందేమిటి?” అని భగవంతుడు ఆశ్చర్యపోతున్నట్లు భావించవచ్చు.
శ్రీరామకృష్ణులు: అది సరే, గర్వం, అహంకారం అనేది జ్ఞానంచే కలుగుతాయా లేక అజ్ఞానం చేతనా? అహంకారం తమోగుణం, అది అజ్ఞాన జనితం. అహంకారమనే ఈ తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం. ‘నేను’ అనేది మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం. ఈ దేహం, ఈ ఐశ్వర్యం ఏదీ శాశ్వతం కాదు. ఒక తాగుబోతు దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు, ‘అమ్మా, నువ్వు ఎంతగా అలంకరించుకున్నా, రెండు మూడు రోజులు తరువాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారవేస్తారు’ అన్నాడు. (అందరూ నవ్వారు) అందుకే అందరికీ చెబుతున్నాను. జడ్జిగా ఉన్నా సరే, మరెవరిగా ఉన్నాసరే, అన్నీ మూన్నాళ్ళ ముచ్చటే. కాబట్టి గర్వం, అహంకారం వదలిపెట్టి వేయాలి.
సత్వరజస్తమో గుణాలు వేర్వేరు స్వభావాలు గలవి. అహంకారం, నిద్ర, మితిమీరి తినటం, కామం, క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావుల లక్షణాలు. రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాలలో పాల్గొంటారు; వారి దుస్తులు మెరుస్తూ, ఆడంబరంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా, పటాటోపంగా ఉంటుంది. ముంగిటి గదిలో క్వీన్ చిత్తరువు వ్రేలాడుతూ ఉంటుంది. పూజా సమయంలో పట్టుపీతాంబరాలు ధరిస్తారు. మెళ్ళో రుద్రాక్షమాల ఉంటుంది. ఆ మాల మధ్యమధ్య బంగారు రుద్రాక్ష మణులు గ్రుచ్చబడి ఉంటాయి. ఎవరైనా పూజాగృహాన్ని చూడవస్తే, తామే పిలుచుకుపోయి అన్నీ చూపిస్తారు; ‘ఇదుగో, ఈ వైపు రండి, ఇంకా ఉంది. తెల్ల చలువరాతితో చేసిన, పాలరాతితో చేసిన గచ్చు ఉంది, మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది’ అంటూ వివరిస్తారు. పలువురు చూసేట్లు దానధర్మాలు చేస్తారు.
“సత్త్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు. దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు. కడుపుకు సరిపడేటంత మేరకే సంపాదిస్తారు. పరులను ముఖస్తుతి చేసి ధనం గడించాలనుకోరు. ఇంటిని మరమ్మత్తు చేసుకోరు, పిల్లల దుస్తుల గురించి కలత చెందరు. పేరు ప్రతిష్ఠలను అపేక్షించరు. భగవత్ చింతన, దానం, ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి. ఎవరికీ ఏదీ తెలిసిరాదు. దోమతెరలో ధ్యానం చేస్తారు; ‘రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు! అందుకే ఉదయం ఇంతసేపటిదాకా నిద్రిస్తున్నాడు’ అని ఇతరులు అనుకుంటారు. సత్త్వగుణం అనేది మెట్లలో చివరి మెట్టు లాంటిది, తరువాతిది డాబాయే. సత్త్వగుణం గడించాక ఇక భగవద్దర్శనానికి జాప్యం ఉండదు. మరి కాస్త పురోగమిస్తే ఆయన్ను పొందవచ్చు. అందరూ సమానులే అని చెప్పారే! చూడండి ఎన్ని రకాల మనుష్యులు ఉన్నారో! (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)