తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ॥ 8
తమః, తు, అజ్ఞానజమ్, విద్ధి, మోహనమ్, సర్వదేహినామ్,
ప్రమాద ఆలస్య నిద్రాభిః, తత్, నిబధ్నాతి, భారత.
భారత = అర్జునా; తు = కాని; తమః = తమోగుణం; అజ్ఞానజమ్ = ఆవరణశక్తి ప్రధానమైన ప్రకృతి అంశం నుండి కలిగింది; సర్వదేహినామ్ = శరీరాన్ని ధరించిన వారందరికీ; మోహనమ్ = మోహాన్ని కలిగించేది; విద్ధి = (అని) గ్రహించు; తత్ = అది (తమోగుణం); ప్రమాద ఆలస్య నిద్రాభిః = మరపు, సోమరితనం, నిద్ర – వీటిచే (ఆత్మను); నిబధ్నాతి = బంధిస్తోంది.
తా ॥ (తమోగుణ లక్షణం, అది బంధించే రీతి తెలుపబడుతున్నాయి) భారతా! తమోగుణం ఆవరణశక్తి ప్రధానమైన ప్రకృతి అంశం నుండి ఉత్పన్నమై, దేహధారులందరికీ మోహాన్ని కలిగిస్తోంది – అని గ్రహించు. ఇది మరపు, మత్తు, నిద్ర మొదలైన వాటిచేత ఆత్మను శరీరంలో బంధించేదిగా ఉంది.