బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ॥ 27
బ్రహ్మణః, హి, ప్రతిష్ఠా, అహమ్, అమృతస్య, అవ్యయస్య, చ,
శాశ్వతస్య, చ, ధర్మస్య, సుఖస్య, ఐకాంతికస్య, చ.
హి = ఏలయన; అహమ్ = నేను; అవ్యయస్య = వికారరహితమూ; అమృతస్య = వినాశరహితమూ; శాశ్వతస్య = నిత్యమూ; ధర్మస్య చ = జ్ఞానయోగ ధర్మప్రాప్యమూ; ఐకాంతికస్య సుఖస్య చ = అవ్యభిచార సుఖస్వరూపమూ అయిన; బ్రహ్మణః = బ్రహ్మానికి; ప్రతిష్ఠా = ఆశ్రయుణ్ణి.
మరొక అన్వయం :
హి అహం అవ్యయస్య అమృతస్య చ బ్రహ్మణః ప్రతిష్ఠా ।
శాశ్వతస్య ధర్మస్య చ, ఐకాంతికస్య సుఖస్య చ (ప్రతిష్ఠా) ॥
తా ॥ (నన్ను సేవిస్తే గుణాలను అతిక్రమించడానికి కారణం ఏమంటావా) నేను బ్రహ్మం యొక్క ప్రతిష్ఠను – ఘనీభూతమైన బ్రహ్మప్రతిమను. (ఘనీభూతమైన ప్రకాశమే సూర్యమండలమైనట్లుగా) నిత్యమైన మోక్షానికి, తత్సాధనమైన సనాతన ధర్మానికి, (తత్ఫలమైన) అఖండ సుఖానికి నేనే ఆశ్రయుణ్ణి కాబట్టి నా భక్తులు బ్రహ్మ భావాన్ని పొందుతారు. (శ్రీమద్భాగవతమ్. 11-13-19 చూ) 27 [లేక] నేను (ప్రత్యగాత్మను) అవ్యయమూ, అమృతమూ, సనాతనమూ, అఖండ సుఖస్వరూపమూ అయిన బ్రహ్మానికి (పరమాత్మకు) ఆశ్రయుణ్ణి* (అంటే సమ్యక్–జ్ఞానం చేత ప్రత్యగాత్మ* పరమాత్మగా నిశ్చయింపబడుతోంది; ఇదే బ్రహ్మత్వ లాభం). ఎందుకంటే, ఏ బ్రహ్మశక్తి* భక్తానుగ్రహాది ప్రయోజనాలను అనుసరించి ప్రవర్తిల్లుతోందో, అది కూడా నేనే. [లేక] నేను (నిర్వికల్పక బ్రహ్మాన్ని* ) అమృతమూ, అవ్యయమూ అయిన సవికల్పక* బ్రహ్మానికి ఆశ్రయమూ; మరియు, జ్ఞాననిష్ఠ అనే సనాతన ధర్మానికీ, తత్ఫలమైన అఖండ సుఖానికీ ఆశ్రయమును.