లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ॥ 12
లోభః, ప్రవృత్తిః, ఆరంభః, కర్మణామ్, అశమః, స్పృహా,
రజసి, ఏతాని, జాయంతే, వివృద్ధే, భరత ఋషభ.
భరత ఋషభః = భరతశ్రేష్ఠా; రజసి = రజోగుణం; వివృద్ధే = వృద్ధి పొందినప్పుడు; లోభః ప్రవృత్తిః = లోభాన్నీ, పూనికనూ; కర్మణామ్ ఆరంభః = పనులను మొదలుపెట్టడమూ; అశమః = అశాంతి; స్పృహా = కర్మకాంక్ష; ఏతాని = ఇవి; జాయంతే = పుడుతున్నాయి;
తా ॥ అర్జునా! ధనం పెక్కురీతులలో లభిస్తున్నప్పటికీ ఇంకా కావాలనే అభిలాష (లోభం) ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేయడం (ప్రవృత్తి), పెద్దవైన మేడలను మిద్దెలను కట్టుకునే ప్రయత్నాలు (కర్మలను ఆరంభించడం), ‘ఈ పనిని ముగించి ఆ పనిని మొదలుపెడతాను’ – ఇటువంటి సంకల్ప వికల్పాలు శాంతింపకుండడం (అశాంతి), ఏ వస్తువునైనా చూసిన వెంటనే కోరడం (స్పృహ), అనేవి రజోగుణం వృద్ధి చెందితే కలుగుతున్నాయి; ఈ చిహ్నాలు ఉన్న యెడల రజోగుణం ప్రబలమైంది అని గ్రహించు.