మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ।
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ॥
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ॥
మహాభూతాని, అహంకారః, బుద్ధిః, అవ్యక్తమ్, ఏవ, చ,
ఇంద్రియాణి, దశ, ఏకమ్, చ, పంచ, చ, ఇంద్రియ గోచరాః.
ఇచ్ఛా, ద్వేషః, సుఖమ్, దుఃఖమ్, సంఘాతః, చేతనా, ధృతిః,
ఏతత్, క్షేత్రమ్, సమాసేన, సవికారమ్, ఉదాహృతమ్.
మహాభూతాని = పంచతన్మాత్రలు (పంచసూక్ష్మ భూతాలు); అహంకారః = మహాభూతాలకు కారణం (అహం ప్రత్యయం ద్వారా లక్షితం) బుద్ధిః = అహంకార కారణం (అధ్యవసాయాత్మికమైన బుద్ధి); అవ్యక్త ఏవ చ = బుద్ధికి కారణమైన మూలప్రకృతి (అవ్యాకృతమైన ఈశ్వరశక్తి); దశ ఇంద్రియాణి = కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ పంచకాలు; ఏకం చ = ఒక్కటియైన మనస్సు; పంచఇంద్రియ గోచరాః చ = ఇంద్రియ విషయాలైన శబ్దాదులు ఐదూ; ఇచ్ఛా = సుఖ స్పృహ; ద్వేషః = అనిష్ట–ద్వేషమూ; సుఖమ్ = సుఖమూ; దుఃఖమ్ = దుఃఖమూ; సంఘాతః = దేహేంద్రియ సమూహము; చేతనా = దానియందు అభివ్యక్తమైన బుద్ధి; ధృతిః = ధైర్యమూ అయిన; సవికారమ్ = వికారాలతో కూడిన; ఏతత్ = ఈ; క్షేత్రమ్ = క్షేత్రం (శరీరం); సమాసేన = సంగ్రహంగా; ఉదాహృతం = చెప్పబడింది.
తా ॥ (క్షేత్రస్వరూపం వర్ణించబడుతోంది 🙂 పంచ సూక్ష్మభూతాలు, మహాభూతాలకు కారణమైన అహంకారం, అహంకార కారణమైన బుద్ధి, బుద్ధికి కారణమైన మూలప్రకృతి (అవ్యాకృత బ్రహ్మశక్తి), దశేంద్రియాలు, మనస్సు, ఇంద్రియ విషయాలనే స్థూలభూతాలు* (శబ్దాదులు); ఇచ్ఛా, ద్వేషం, దుఃఖాలు, సంఘాతం (శరీరం), దానియందు తోచే చేతన, ధృతి కలసి* క్షేత్రం అని అనబడుతున్నాయి. మహదాది (ఇంద్రియాది) వికారాలతో కూడిన క్షేత్రతత్త్వం సంగ్రహంగా చెప్పబడింది. (గీత : 7-4, 14 చూ.)