ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ॥
ఋషిభిః, బహుధా, గీతమ్, ఛందోభిః, వివిధైః, పృథక్,
బ్రహ్మసూత్రపదైః, చ, ఏవ, హేతుమద్భిః, వినిశ్చితైః.
(క్షేత్ర–క్షేత్రజ్ఞుల మాహాత్మ్యం) ఋషిభిః = ఋషులచే; వివిధైః ఛందోభిః = విభిన్నమైన వేదమంత్రాలతో; పృథక్ = వేరుగా; బహుధా = పెక్కురీతులుగా; గీతమ్ = కొనియాడబడినదీ; వినిశ్చితైః = సంశయరహితాలైన; హేతుమద్భిః = హేతువులతో కూడిన; బ్రహ్మస్రూత్ర పదైః ఏవ చ = బ్రహ్మసూచకాలైన ఉపనిషద్వాక్యాలతోనూ (వర్ణించబడింది).
తా ॥ (నీవు సంగ్రహంగా చెబుతున్నది, ఏ మహాత్ముల వాక్యసారం? అని అంటావా:) ఈ క్షేత్రక్షేత్రజ్ఞుల మాహాత్మ్యం (వసిష్ఠాది) ఋషులచే (యోగశాస్త్రాల ధ్యాన, ధారణాది విషయమైన వైరాజాది రూపాలలో) నానా ప్రకారాలుగా నిరూపితమైంది. అసందిగ్ధములైన (ఉపక్రమ ఉపసంహారాలతో ఏకవాక్యతను కూర్చుకున్న) యుక్తులతో* , నిత్యనైమిత్తిక కామ్యకర్మాది విషయకములైన వేదమంత్రాలతో వివిధ దేవతా రూపంలోనూ, బ్రహ్మసూత్ర* -పదముల* చేతా వ్యాఖ్యానించబడింది.