తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ ।
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ॥
తత్, క్షేత్రమ్, యత్, చ, యాదృక్, చ, యత్ వికారి, యతః, చ, యత్,
సః, చ, యః, యత్ ప్రభావః, చ, తత్, సమాసేన, మే, శృణు.
తత్ క్షేత్రం = ఆ క్షేత్రం; యత్ చ = ఏదియో; యాదృక్ చ = ఎటువంటిదో; యత్ వికారి = ఎటువంటి వికారాలతో కూడిందో; యతః చ = దేని నుండి; యత్ = ఏ రీతిగా ఉత్పన్నమైందో; సః చ యః = ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో; యత్ ప్రభావః చ = ఎటువంటి మహిమ గలవాడో; తత్ = దానిని; సమాసేన = సంగ్రహంగా; మే = నా నుండి; శృణు = విను.
తా ॥ (చతుర్వింశతి భేదాలతో ఒప్పుతున్న ప్రకృతియే ‘క్షేత్రం’ అని అభిప్రాయమైనా, శరీరంగా మారిన దానియందే అహంభావ రూపంలో అవివేక స్ఫూర్తి అవుతోంది కాబట్టి, శరీరమే క్షేత్రమనబడింది. వివేకజ్ఞానం కొరకు దానినే వర్ణిస్తున్నాడు 🙂 నేను పేర్కొన్న క్షేత్రం ఏ జడత్వ దృశ్యత్వాది స్వభావాలు కలిగి, ఎటువంటి ఇచ్ఛాది ధర్మాలతో కూడి, ఏ ఇంద్రియ వికారాలకు లోనై ఉందో; మరియు, ఏ ప్రకృతి-పురుష సంయోగం వల్ల కలిగి, ఏ స్థావరజంగమాది భేదాలతో ఒప్పుతోందో చెబుతున్నాను; మరియు, క్షేత్రజ్ఞుని స్వరూపాన్ని, అతని అచింత్య యోగైశ్వర్యప్రభావాన్ని కూడా సంగ్రహంగా వివరిస్తాను, విను.