ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ॥
ఉపద్రష్టా, అనుమంతా, చ, భర్తా, భోక్తా, మహేశ్వరః,
పరమాత్మా, ఇతి, చ, అపి, ఉక్తః, దేహే, అస్మిన్, పురుషః, పరః.
అస్మిన్ = ఈ; దేహే = శరీరంలో; పురుషః = పరమపురుషుడు; పరః = స్వత్రంతుడు; ఉపద్రష్టా = సాక్షి; అనుమంతా చ = అనుమోదకుడు (అనుగ్రాహకుడు); భర్తా = పాలకుడు; భోక్తా = అనుభవించేవాడు; మహేశ్వరః = పరమేశ్వరుడు; పరమాత్మా చ = పరమాత్మ, ఇతి అపి = అనియూ; ఉక్తః = చెప్పబడును.
తా ॥ (ఇలా, అవివేకం వల్లే పురుషునికి సంసారం, వాస్తవానికి-) అతడు ప్రకృతి కార్యమైన ఈ శరీరంలో వెలయుచున్నప్పటికీ స్వతంత్రుడు – గుణాలతో కట్టువడడు. ఏలయన అతడు సాక్షి, అనుగ్రాహకుడు, భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని (శ్రుతిచే) చెప్పబడుతున్నాడు. (గీత : 13-2; 15-18)
వ్యాఖ్య:-
‘ఉపద్రష్టా’ – యజ్ఞంలో ‘ఉపద్రష్ట’ అనేవాడు కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు. అలాగే ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ ‘పరః’ – అంటే శరీరానికంటే వేరుగా, అతీతంగా ఉంటూ దేహానికి, ఇంద్రియాలకు సాక్షిగా మాత్రమే ఉంటుంది. కాబట్టి జీవుడు తాను నిజానికి ఆ పరమాత్మ స్వరూపుడినే తప్ప, శరీరం లేదా ఇంద్రియాలు కాదని గట్టిగా భావించాలి.
‘మహేశ్వరః, పరమాత్మా, దేహేఽస్మిన్’ – అని చెప్పడం వల్ల జగన్నాథుడైన పరమేశ్వరుడు, ఆ పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నాడని స్పష్టమవుతోంది. ఇలా భగవంతుడు జీవుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ప్రయత్నిస్తే సులభంగా పొందవచ్చు. ఆయన కోసం ఎక్కడెక్కడికో దూరాలకు వెళ్ళి కష్టపడి వెతకాల్సిన పనిలేదు. అంతేకాక మనల్ని శిక్షించేవాడు, శాసించేవాడు (ఈశ్వరుడు) పక్కనే ఉన్నాడు కాబట్టి, పాపాలు చేసేవారు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి తప్పుడు పనులూ చేయకుండా ఉండాలి.
‘పరః’ – అని చెప్పడం వల్ల ఆత్మకు దేహంతో గానీ, ఇతర ఉపాధులతో గానీ సంబంధం లేదని, అది వీటన్నింటికీ వేరుగా, అతీతంగా ఉందని తెలుస్తోంది. ‘పరఃపురుషః’ అంటే పరమపురుషుడు లేదా పరమాత్మ అని కూడా అర్థం చెప్పవచ్చు.