పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ॥
పురుషః, ప్రకృతిస్థః, హి, భుంక్తే, ప్రకృతిజాన్, గుణాన్,
కారణమ్, గుణసంగః, అస్య, సత్ అసత్ యోని జన్మసు.
హి = ఏమన; పురుషః = భోక్త (జీవుడు); ప్రకృతిస్థః = ప్రకృతి యందు వెలయుచు; ప్రకృతి జాన్ గుణాన్ = సుఖ, దుఃఖ, మోహ రూపాలైన ప్రకృతిజాత గుణాలను; భుంక్తే = అనుభవిస్తాడు; అస్య = ఈ జీవుని; సత్ అసత్ యోనిజన్మసు = దేవతాది సత్ జన్మలు, పశ్వాది అసత్ జన్మలు, ఉభయ విధమైన మనుష్య జన్మకూ; గుణ సంగః = గుణముల ఆసక్తియే; కారణమ్ = హేతువు.
తా ॥ భోక్త అయిన పురుషుడు ప్రకృతి యందు వెలయుచూ* సుఖ, దుఃఖ, మోహ ఆకారాలలో అభివ్యక్తాలైన గుణసమూహాలను అనుభవిస్తున్నాడు. ఈ గుణాసక్తియే జీవుణ్ణి దేవ, మనుష్య, పశు జన్మలను గ్రహించేలా చేస్తోంది. (గీత : 14-18 చూ:)