అర్జున ఉవాచ :
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ।
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ॥
ప్రకృతిమ్, పురుషమ్, చ, ఏవ, క్షేత్రమ్, క్షేత్రజ్ఞమ్, ఏవ, చ,
ఏతత్, వేదితుమ్, ఇచ్ఛామి, జ్ఞానమ్, జ్ఞేయమ్, చ, కేశవ.
కేశవ = కృష్ణా; ప్రకృతిమ్ = ప్రకృతిని; పురుషం చ = పురుషుణ్ణి; క్షేత్రమ్ = క్షేత్రాన్ని; క్షేత్రజ్ఞం ఏవ చ = క్షేత్రజ్ఞుణ్ణి; జ్ఞానమ్ = జ్ఞానాన్ని; జ్ఞేయమ్ ఏవ చ = జ్ఞేయాన్ని; ఏతత్ = దీనిని (ఎల్ల); వేదితుమ్ = తెలుసుకోవాలని; ఇచ్ఛామి = కోరుతున్నాను;
తా ॥ అర్జునుడు పలికెను: కేశవా! ప్రకృతి పురుషులు, క్షేత్రక్షేత్రజ్ఞులు, జ్ఞానజ్ఞేయాలు – అనే విషయాలను తెలుసుకో కోరుతున్నాను.
వ్యాఖ్యా:-
ఇప్పటివరకు దేవుని సగుణ రూపం (ఆకారం, గుణాలు ఉన్న దేవుడు) గురించి బాగా విన్న అర్జునుడికి, ఇప్పుడు నిర్గుణ బ్రహ్మం (రూపం లేని పరమాత్మ తత్వం) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అందుకే దాని గురించి శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు.
భగవద్గీతలోని మొదటి ఆరు అధ్యాయాలను ‘కర్మ షట్కం’ అని, తర్వాతి ఆరు అధ్యాయాలను ‘భక్తి షట్కం’ అని, చివరి ఆరు అధ్యాయాలను (అంటే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు) ‘జ్ఞాన షట్కం’ అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు జ్ఞానానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. జ్ఞాన మార్గాన్ని అనుసరించే వారికి ఈ అధ్యాయం (13వ అధ్యాయం) చాలా ముఖ్యమైనది.