యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః ।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ॥ 6
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ ।
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ ॥ 7
యే, తు, సర్వాణి, కర్మాణి, మయి, సన్న్యస్య, మత్పరాః,
అనన్యేన, ఏవ, యోగేన, మామ్, ధ్యాయంతః, ఉపాసతే.
తేషామ్, అహమ్, సముద్ధర్తా, మృత్యుసంసారసాగరాత్,
భవామి, న చిరాత్, పార్థ, మయి, ఆవేశిత చేతసామ్.
పార్థ = అర్జునా; తు = కాని; యే = ఎవరు; కర్మాణి = కర్మలను; సర్వాణి = అన్నింటినీ; మయి = నా యందు; సన్న్యస్య = అర్పించి; మత్పరాః = నాయందాసక్తితో; అనన్యేన = ఐకాంతికమైన; యోగేన ఏవ = భక్తియోగంతో; మామ్ = నన్ను; ధ్యాయంతః = ధ్యానిస్తూ; ఉపాసతే = ఉపాసిస్తున్నారో; తేషామ్ = అటువంటి; మయి ఆవేశిత చేతసామ్ = నాయందు ఆవిష్ఠమైన చిత్తం గలవారిని; మృత్యు సంసార సాగరాత్ = జనన మరణరూపమైన సంసార సముద్రం నుండి; న చిరాత్ = శీఘ్రంగానే; అహమ్ = నేను; సముద్ధర్తా భవామి = ఉద్ధరించేవాణ్ణి అవుతాను;
తా ॥ (కాని, నా భక్తులు నా ప్రసాదంతో అనాయాసంగానే సిద్ధిని పొందుతున్నారు.) పార్థా ! ఎవరు సమస్తకర్మలనూ నాకు అర్పించి, నా యందు ఆసక్తితో, ఐకాంతికమైన భక్తియోగంతో నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారో, నా యందు ఆవిష్ట–చిత్తులైన అటువంటి వారిని శీఘ్రంగానే జననమరణరూపమైన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తున్నాను.