అర్జున ఉవాచ :
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ॥ 1
ఏవమ్, సతతయుక్తాః, యే, భక్తాః, త్వామ్, పర్యుపాసతే,
యే, చ, అపి, అక్షరమ్, అవ్యక్తమ్, తేషామ్, కే, యోగవిత్తమాః.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; ఏవమ్ = ఈ విధంగా (సర్వకర్మార్పణం చేస్తూ); సతత యుక్తాః = నిరంతర నిష్ఠులవుతూ; యే భక్తాః = ఏ భక్తులు; త్వామ్ = నిన్ను(విశ్వరూపుని); పర్యుపాసతే = ధ్యానిస్తున్నారో; యే చ అపి = మరియు (ఎవరు); అవ్యక్తమ్ = నిర్గుణము (నిర్విశేషమైన); అక్షరమ్ = బ్రహ్మాన్ని (ధ్యానిస్తున్నారో); తేషామ్ = వీరిలో; యోగవిత్తమాః = యోగజ్ఞశ్రేష్ఠులు; కే = ఎవరు?;
తా ॥ [పూర్వాధ్యాయాంతంలో “నా కొరకు కర్మలను ఆచరించేవాడూ” (11-55) అనే శ్లోకంలోనూ, “కౌంతేయా! ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రవచించు” (9-31) అనే శ్లోకంలోనూ భక్తినిష్ఠుని శ్రేష్ఠత్వం చెప్పబడింది. ఇదేవిధంగా, “ఈ నలుగురు భక్తులలో నిత్యయుక్తుడూ, ఏకనిష్ఠుడూ అయిన జ్ఞానియే శ్రేష్ఠుడు” (7-17) అనే శ్లోకంలోనూ, “ఈ బ్రహ్మజ్ఞానమనే తెప్ప చేత ధర్మాధర్మాల నన్నిటిని దాటినవాడవు కాగలవు” (4-36) అనే శ్లోకంలోనూ జ్ఞాననిష్ఠ ప్రశంసించబడింది. ఇటువంటివే అయిన పెక్కు శ్లోకాలు భక్తినిష్ఠను, జ్ఞాననిష్ఠను ప్రశంసిస్తున్నాయి. వీటి ప్రాముఖ్యతకు సంబంధించిన ఇతర విశేషాలను తెలుసుకో గోరుతూ-] అర్జునుడు పలికెను: ఈ విధంగా సర్వ కర్మార్పణం చేస్తూ నిరంతరనిష్ఠులై విశ్వరూపాన్ని (సగుణ బ్రహ్మం) ఉపాసించే భక్తుల విశేషమేమి? మరియు, సమస్త వాసనలను కర్మలనూ పరిత్యజించి సర్వోపాధి రహితమూ, ఇంద్రియాతీతమూ అయిన అక్షర బ్రహ్మాన్ని (నిర్గుణ బ్రహ్మం) ఉపాసించే వారి వైశిష్ట్యమేమిటి? ఈ ఇరువురిలో శ్రేష్ఠుడైన యోగి ఎవరు ?