నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ।
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ 53
న, అహమ్, వేదైః, న, తపసా, న, దానేన, న, చ, ఇజ్యయా,
శక్యః, ఏవం విధః, ద్రష్టుమ్, దృష్టవాన్, అసి, మామ్, యథా.
యథా = ఏ రూపంలో; మామ్ = నన్ను; దృష్టవాన్ అసి = చూసావో; ఏవం విధః = ఈ రూపంలో; అహమ్ = నేను; వేదైః = వేదాలచేత గాని; తపసా = తపస్సుచేత గాని; దానేన = దానంతో గాని; ఇజ్యయా చ = యజ్ఞంచేత గాని; ద్రష్టుమ్ = చూడ; న శక్యః = సాధ్యుణ్ణి కాను.
తా ॥ నీకు లభించిన ఈ విశ్వరూప దర్శనం, తపో దాన వేద యజ్ఞాల* వలన కూడా సాధ్యం కాదు.
వ్యాఖ్య: –
48వ శ్లోకంలో చెప్పిన విషయాలనే ఇక్కడ మళ్లీ గుర్తుచేస్తున్నారు. వేదాలు చదవడం, తపస్సు, దానం, యజ్ఞాలు చేయడం వంటివి ఎంత పవిత్రమైన పనులైనా సరే… వాటికి స్వచ్ఛమైన భక్తి, దేవుడిపై గట్టి నమ్మకం తోడైతేనే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. (48వ శ్లోకం వివరణ చూడండి). ఇదే విషయం తర్వాతి శ్లోకంలో కూడా వస్తుంది