శ్రీభగవానువాచ :
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ ।
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ॥ 47
మయా, ప్రసన్నేన, తవ అర్జున, ఇదమ్, రూపమ్, పరమ్, దర్శితమ్, ఆత్మయోగాత్,
తేజోమయమ్, విశ్వమ్, అనంతమ్, ఆద్యమ్, యత్, మే, త్వత్ అన్యేన, న, దృష్ట పూర్వమ్.
అర్జున = అర్జునా; ప్రసన్నేన = ప్రసన్నుడనగు; మయా = నాచే; ఆత్మయోగాత్ = యోగమాయా సామర్థ్యం వల్ల, స్వీయ ఈశ్వర శక్తి వల్ల; తవ = నీకు; ఇదమ్ = ఈ; తేజోమయమ్ = తేజః పూర్ణాన్ని; విశ్వమ్ = సర్వవ్యాపకమూ; అనంతమ్ = అంతరహితమూ; ఆద్యం = ఆది భూతమూ; పరమ్ = ఉత్తమమూ అయిన; మే రూపమ్ = నా విశ్వరూపం; దర్శితమ్ = చూపించబడింది; యత్ = ఏ (ఈ నా రూపం); త్వత్ అన్యేన = నీవుగాక మరి ఇతరులచే; న దృష్ట పూర్వమ్ = ఇంతవరకూ చూడబడలేదు.
తా ॥ శ్రీభగవానుడు పలికెను: అర్జునా! నేను ప్రసన్నుడనై నీకు, నా యోగశక్తి ప్రభావంతో తేజఃపూర్ణమూ, అనంతమూ, ఆద్యమూ అయిన విశ్వరూపాన్ని చూపించాను – నీవు గాక ఇతరులెవ్వరూ కూడా పూర్వం ఈ రూపాన్ని చూడలేదు.