అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ॥ 45
అదృష్టపూర్వమ్, హృషితః, అస్మి, దృష్ట్వా, భయేన, చ, ప్రవ్యథితమ్, మనః, మే,
తత్, ఏవ, మే, దర్శయ, దేవ రూపమ్, ప్రసీద, దేవేశ, జగన్నివాస.
దేవ = దేవా; అదృష్టపూర్వం = పూర్వం చూడని (విశ్వరూపాన్ని); దృష్ట్వా = చూసి; హృషితః = సంతుష్టుణ్ణి; అస్మి = అయ్యాను; భయేన చ = మరియు, భయంతో; మే = నా; మనః = మనస్సు; ప్రవ్యథితమ్ = బాధితమైనది; దేవేశ = దేవేశా; జగన్నివాస = జగన్నివాసా; తత్ రూపం ఏవ = పూర్వరూపంతో; మే = నాకు; దర్శయ = దర్శనమిచ్చి; ప్రసీద = ప్రసన్నుడవు కమ్ము.
తా ॥ దేవా! నేనుగాని, ఇతరులు గాని ఇంతకుమునుపు చూడని విశ్వ రూపాన్ని గాంచి, ఆనందాన్ని పొందాను; నా మనస్సు భయ వ్యాకులితమవుతోంది. దేవేశా! జగన్నివాసా! ఆ నీ పూర్వరూపాన్నే దర్శింపజేసి, ప్రసన్నుడవు కమ్ము!
వ్యాఖ్య:-
అద్భుతమైన విశ్వరూపాన్ని చూడటం వల్ల అర్జునుడికి సంతోషం కలిగింది, కానీ అందులోని భయంకరమైన దృశ్యాలను చూసి భయంతో వణుకు పుట్టింది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, శాంతమైన రూపాన్ని (సౌమ్య రూపాన్ని) చూపించమని భగవంతుడిని కోరుతున్నాడు.
‘ప్రసీద దేవేశ జగన్నివాస’ – అర్జునుడు ఇదే మాటను ఈ అధ్యాయంలోని 25వ శ్లోకంలో కూడా చెప్పాడు. ‘ఓ దేవాదిదేవా! లోకానికి ఆధారమైనవాడా! నాపై దయ చూపించు! నన్ను అనుగ్రహించు!’ అని దానికి అర్థం.
‘దేవ’, ‘రూపం’ అనే రెండు పదాలను కలిపి ‘దేవరూపం’ అంటారు. అంటే ‘నాలుగు చేతులు ఉన్న ఆ దైవ (విష్ణు) రూపాన్ని చూపించు’ అని కొందరు దీనికి అర్థం చెప్పారు.