ఏవమేతద్యథాత్థ త్వం ఆత్మానాం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ ॥ 3
ఏవమ్, ఏతత్, యథా, ఆత్థ, త్వమ్, ఆత్మానమ్, పరమేశ్వర,
ద్రష్టుమ్, ఇచ్ఛామి, తే, రూపమ్, ఐశ్వరమ్, పురుషోత్తమ.
పరమేశ్వర = శ్రీకృష్ణా; యథా = ఏ రీతిగా; త్వమ్ = నీవు; ఆత్మానమ్ = ఆత్మ తత్త్వాన్ని; ఆత్థ = చెప్పావో; ఏతత్ = అది; ఏవమ్ = అట్లే; (అని విశ్వసిస్తున్నాను, సందేహం లేదు; అయినా) పురుషోత్తమ = పురుష శ్రేష్ఠా; తే = నీ; ఐశ్వరమ్ = జ్ఞానైశ్వర్య శక్తిబల వీర్యాది సంపన్నమైన (ఈశ్వరసంబంధమైన); రూపమ్ = రూపాన్ని; ద్రష్టుమ్ = చూడ; ఇచ్ఛామి = కోరుతున్నాను;
తా ॥ పరమేశ్వరా! నీవు ఏ ఆత్మతత్త్వాన్ని బోధించావో అది యథార్థం (అని విశ్వసిస్తున్నాను, సందేహం లేదు, అయినా) పురుషోత్తమా! జ్ఞానైశ్వర్యశక్తి బల వీర్యాది సంపన్నమైన నీ ఈశ్వరీయ రూపాన్ని సాక్షాత్కరింప జేయమని కోరుతున్నాను.