వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంకః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥ 39
వాయుః, యమః, అగ్నిః, వరుణః, శశాంకః, ప్రజాపతిః, త్వమ్, ప్రపితామహః, చ,
నమః, నమః, తే, అస్తు, సహస్రకృత్వః, పునః, చ, భూయః, అపి, నమః, నమః, తే.
త్వమ్ = నీవు; వాయుః = వాయుదేవుడవు; యమః = యముడవు; అగ్నిః = అగ్ని దేవుడవు; వరుణః = వరుణుడవు; శశాంకః = చంద్రుడవు; ప్రజాపతిః = కశ్యపాది ప్రజాపతి రూపంలో లోకపితవు; ప్రపితామహః చ = బ్రహ్మకు కూడా జనకుడవు; తే = నీకు; సహస్ర కృత్వః = వేల సార్లు; నమః అస్తు = నమస్కరిస్తాను; పునశ్చ = మళ్ళీ; నమః = నమస్కారం; భూయః అపి = తిరిగి మళ్ళీ; తే = నీకు; నమః నమః = నమస్కారాలు.
తా ॥ నీవు వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి రూపంలో లోకానికి తండ్రివి (ప్రజాపతులకు తండ్రి, లోకపితామహుడూ అయిన బ్రహ్మవు). బ్రహ్మకు జనకుడైన ప్రపితామహుడవు కూడా నీవే. నీకు నమోవాక సహస్రములు. పదే పదే నీకు నమస్సులు, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కరిస్తున్నాను.