శ్రీభగవానువాచ :
కాలోఽస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ 32
కాలః, అస్మి, లోకక్షయకృత్, ప్రవృద్ధః, లోకాన్, సమాహర్తుమ్, ఇహ, ప్రవృత్తః,
ఋతే, అపి, త్వామ్, న, భవిష్యంతి, సర్వే, యే, అవస్థితాః, ప్రత్యనీకేషు, యోధాః.
లోక క్షయ కృత్ = లోకసంహారకుడనై; ప్రవృద్ధః = విజృంభించిన; కాలః = కాలుడను; అస్మి = (నేను) అయి ఉన్నాను; లోకాన్ = ప్రాణులను; సమాహర్తుమ్ = సంహరింప; ఇహ = ఇప్పుడు; ప్రవృత్తః = మొదలిడితిని; త్వాం ఋతే అపి = నీవు లేకున్నా; ప్రత్యనీకేషు = శత్రుపక్షంలోని; యే = ఏ; యోధాః = వీరులు; అవస్థితాః = ఉన్నారో; సర్వే = వారందరూ; న భవిష్యంతి = ఉండరు.
తా ॥ శ్రీ భగవంతుడు పలికెను: నేను లోక సంహారార్థం విజృంభించిన కాలుణ్ణి, ఇప్పుడు ప్రాణుల సంహరింపదలచాను, నీవు యుద్ధం చేయక పోయినా, శత్రుపక్షంలోని వీరులు జీవించరు.