లేలిహ్యసే గ్రసమానస్సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ॥ 30
లేలిహ్యసే, గ్రసమానః, సమంతాత్, లోకాన్, సమగ్రాన్, వదనైః, జ్వలద్భిః,
తేజోభిః, ఆపూర్య, జగత్, సమగ్రమ్, భాసః, తవ, ఉగ్రాః, ప్రతపంతి, విష్ణో.
జ్వలద్భిః = దీప్యమానమైన; వదనైః = ముఖాలతో; లోకాన్ = ఈ వీరులను; సమగ్రాన్ = అందరినీ; గ్రసమానః = మ్రింగుతూ; సమంతాత్ = అన్నియెడల; లేలిహ్యసే = ఆస్వాదిస్తున్నావు; విష్ణో = భగవంతుడా; తవ = నీ; ఉగ్రాః = తీవ్రమైన; భాసః = ప్రభలు; తేజోభిః = కాంతులతో; ఆపూర్య = నిండి; సమగ్రం జగత్ = జగత్తు నంతటిని; ప్రతపంతి = తపింపజేయుచున్నవి.
తా ॥ భగవంతుడా! దీప్యమానమైన వదనసమూహాలతో ఈ వీరుల నందరినీ మ్రింగుతూ, అన్నివైపులకూ నాలుకలను చాపుతూ ఆస్వాదిస్తున్నావు. తీవ్రమైన నీ ప్రభలు కాంతులతో నిండి జగత్తునంతటినీ తపింపజేస్తున్నాయి.