ద్యావాపృథివ్యోరిదమంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ॥ 20
ద్యావాపృథివ్యోః, ఇదమ్, అంతరమ్, హి, వ్యాప్తమ్, త్వయా, ఏకేన, దిశః, చ, సర్వాః,
దృష్ట్వా, అద్భుతమ్, రూపమ్, ఉగ్రమ్, తవ, ఇదమ్, లోకత్రయమ్, ప్రవ్యథితమ్, మహాత్మన్.
మహాత్మన్ = మహాత్మా; ద్యావా పృథివ్యోః = భూమి ఆకాశముల; ఇదమ్ = ఈ అన్తరమ్ = మధ్య ప్రదేశం; త్వయా = నీ; ఏకేన హి = ఒక్కని చేతనే; వ్యాప్తమ్ = వ్యాపింపబడి ఉంది; దిశః = దిక్కులు; సర్వాః చ = అన్ని కూడా; (వ్యాప్తా = వ్యాపింపబడి ఉన్నవి;) తవ = నీ; ఇదమ్ = ఈ; అద్భుతమ్ = ఆశ్చర్యకరమూ (అదృష్ట పూర్వమూ); ఉగ్రమ్ = భయంకరము అయిన; రూపమ్ = విశ్వరూపాన్ని; దృష్ట్వా = చూసి; లోక త్రయమ్ = మూల్లోకాలు; ప్రవ్యథితమ్ = భయపడుతున్నాయి.
తా ॥ మహాత్మా! భూనభోంతరాలు, సకలదిశలు నీచే నిండింపబడి, అద్భుతమూ, ఉగ్రమూ అయి ఉన్న ఈ నీ విశ్వరూపాన్ని గాంచి ముల్లోకాలు భయపడుతున్నాయి. – ఇలా నేను గాంచుతున్నాను.