అనాదిమధ్యాంతమనంతవీర్యం
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ ।
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ॥ 19
అనాది మధ్య అంతమ్, అనంత వీర్యమ్, అనంతబాహుమ్, శశిసూర్య నేత్రమ్,
పశ్యామి, త్వామ్, దీప్తహుతాశ వక్త్రమ్, స్వతేజసా, విశ్వమ్, ఇదమ్, తపంతమ్.
అనాది మధ్య అంతమ్ = ఆదిమధ్యాంత రహితునిగా; అనంత వీర్యమ్ = అఖండ శక్తిశాలిగా; అనంత బాహుమ్ = అసంఖ్య హస్త విశిష్టునిగా; శశి సూర్య నేత్రం = చంద్రసూర్య నయనునిగా; దీప్త హుతాశ వక్త్రం = ప్రజ్వలితాగ్ని తుల్య ముఖవిశిష్టునిగా; స్వ తేజసా = స్వీయప్రభ చేత; ఇదమ్ = ఈ; విశ్వమ్ = జగత్తును; తపంతమ్ = తపింపజేయువానిగా; త్వామ్ = నిన్ను; పశ్యామి = చూస్తున్నాను.
తా ॥ నీవు ఆది-మధ్య-అంత రహితుడవు, అఖండ శక్తిశాలివి, అసంఖ్యాక బాహు విశిష్టుడవు; చంద్రసూర్యులు నీ నేత్రాలు, నీ ముఖమండలాన ప్రదీప్తాగ్ని జ్యోతి దీపిల్లుతోంది. నీ తేజంతో జగత్తునంతటిని తపింపజేస్తున్నావు – ఈ విధంగా నేను చూస్తున్నాను.