మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 6
మహర్షయః, సప్త, పూర్వే, చత్వారః, మనవః, తథా,
మద్భావాః, మానసాః, జాతాః, యేషామ్, లోకే, ఇమాః, ప్రజాః.
మహర్షయః సప్త = భృగ్వాది మహర్షులు ఏడుగురూ; పూర్వే = పూర్వకాలం వారైన; చత్వారః = సనకాది మహర్షులు నలుగురూ; తథా = మరియు; మనవః = స్వాయంభువాది మనువులు పదునల్గురూ; మద్భావాః = మద్గత చిత్తులు (నా ప్రభవాన్ని కలిగినవారు); మానసాః జాతాః = హిరణ్యగర్భ (బ్రహ్మ) రూపుడనైన నా సంకల్పంతో పుట్టినవారు; లోకే = ఈ జగత్తులో; ఏషామ్ = వీరి నుండియే; ఇమాః = ఈ; ప్రజాః = స్థావరజంగమాత్మక సంతతి (కలిగింది);
తా ॥ భృగువు మున్నగు సప్తర్షులూ , వారికంటే పూర్వపువారైన సనకాది నలుగురు ఋషులూ* ; స్వాయంభువాది చతుర్దశ మనువులూ ; [హిరణ్యగర్భ (బ్రహ్మ) రూపుడనైన] నా సంకల్పం నుండే ఉద్భవించారు; వారు నా మానస పుత్రులు. మద్గతచిత్తులవడం వల్ల నా ప్రభావంతో ఒప్పుతున్నారు. వీరి నుండే, ఈ జగత్తులో స్థావరజంగమాత్మకమైన సంతతి కలిగింది.