యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోఽంశసంభవమ్ ॥ 41
యత్, యత్, విభూతిమత్, సత్త్వమ్, శ్రీమత్, ఊర్జితమ్, ఏవ, వా,
తత్, తత్, ఏవ, అవగచ్ఛ, త్వమ్, మమ, తేజః అంశ సంభవమ్.
విభూతి మత్ = ఐశ్వర్యయుక్తమూ; శ్రీ మత్ = లక్ష్మీయుక్తమూ; ఊర్జితం ఏవ వా = ఏదో ఒక విధమైన శ్రేష్ఠతతో ఒప్పారేది (ఉత్సాహయుతమూ, బలయుతమూ అయిన); యత్ యత్ = ఏ యే; సత్త్వమ్ = వస్తువు, ప్రాణి కలదో; తత్ తత్ ఏవ = ఆ యా వస్తుజాతమంతా; మమ = నా; తేజః అంశ సంభవమ్ = శక్తి అంశం నుండి కలిగినదిగా; త్వమ్ = నీవు; అవగచ్ఛ = గ్రహించు.
తా ॥ (మరల గ్రహింపగోరే అర్జునునికి అన్యవిధంగా సమస్త విభూతుల విషయాన్ని చెబుతున్నాడు-) ఐశ్వర్యయుక్తమూ, శ్రీమంతమూ, సర్వశ్రేష్ఠమూ అయిన వస్తువు ఏదైనా కానిమ్ము, అది నా శక్తి అంశం నుండి కలిగినది అని నీవు గ్రహించు.
వ్యాఖ్య:-
ఎక్కడైతే గొప్ప జ్ఞానం, ధర్మం, మనసులో స్వచ్ఛత (లోపలా, బయటా శుద్ధి), మోక్షం పొందాలనే గట్టి కోరిక (ఉత్సాహం) ఉంటాయో… అక్కడ సాక్షాత్తు దేవుడు వెలుగుతూ ఉంటాడని మనం గ్రహించాలి. ఈ పవిత్రమైన గుణాలన్నీ దేవుడి తేజస్సులోని ఒక చిన్న భాగం (అంశ) వల్లనే కలుగుతున్నాయి. దీన్ని బట్టి దేవుడి శక్తి ఎంత అనంతమైనదో, అందులో ఒక చిన్న భాగం వల్లనే జీవులలో ఇంతటి గొప్ప గుణాలు పుడుతున్నాయని అర్థమవుతోంది. కాబట్టి మనుషులందరూ ఆయా మంచి గుణాలకు తమ హృదయంలో చోటివ్వాలి. ఆ గుణాలను పెంచుకోవడం ద్వారానే దేవుడి సాన్నిధ్యాన్ని అనుభవించాలి. అంతేకాదు, పైన చెప్పిన ఆ మంచి గుణాలు ఏ వ్యక్తిలో ఉంటాయో… అతడు ఏ జాతివాడైనా సరే, సాక్షాత్తు దేవుడిలాగే పూజించదగినవాడు, గౌరవించదగినవాడు అవుతాడు.
ఉపన్యాయమూర్తి: స్వామీ! ఆయన కృప ఒకరికి ఎక్కువగాను, మరొకరికి తక్కువగాను కలుగుతుందా? అలా ఐతే ఆయన పక్షపాతి అనే నిందకు గురికాడా?
శ్రీరామకృష్ణులు: అదేం మాట? వెలుగును ఇస్తున్నాయన్న కారణంగా చంద్రుడు, మిణుగురు పురుగు రెండూ ఒక్కటైపోతాయా ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నే విద్యాసాగర్ కూడా ఒకసారి నన్ను – ‘మహాశయా! భగవంతుడు కొందరికి అధిక శక్తినీ, కొందరికి తక్కువ శక్తినీ ప్రసాదించి ఉన్నాడా?’ అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను: ‘భగవంతుడు విభురూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడో చీమలో కూడా అలాగే ఉన్నాడు. కాని శక్తి అభివ్యక్తీకరణలో వ్యత్యాసం ఉంది. అందరూ సమానులే అయిన పక్షంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే పేరు విని మేమెందుకు మిమ్మల్ని చూడగోరి వచ్చాం? మీ కేమిటి రెండు కొమ్ములు మొలిచాయా? కాదు కదా, మీరు దయాళువు, పండితులు. ఇటువంటి సద్గుణాలు ఇతరులలో కంటే మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఇంత ఖ్యాతి. మీరు చూసే ఉంటారు – ఒంటరిగా నిలబడి నూరుమందిని ఓడించేవాడూ ఉన్నాడు, కేవలం ఒక వ్యక్తిని చూసినంత మాత్రానే భయపడి పారిపోయేవాడూఉన్నాడు.’
“శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం లేకుంటే లోకులు కేశవ్‌ను ఇంతగా ఎందుకు గౌరవిస్తారు?
“పాండిత్యంలోగాని, సంగీతంలోకాని, లెక్చర్లోగాని, లేక మరిదేన్లోగాని ఎవరినైనా పలువురు గౌరవిస్తూ ఉంటే ఆతడిలో భగవంతుని విశేష శక్తి ఉందని నిశ్చయంగా తెలుసుకో అని గీత తెలుపుతోంది.”
బ్రహ్మసమాజ భక్తుడు (ఉపన్యాయమూర్తితో): ఆయన చెబుతూ ఉన్నదాన్ని ఒప్పుకోండి!
శ్రీరామకృష్ణులు (భక్తుని చూసి): ఏం మనిషివయ్యా నువ్వు! చెబుతూ ఉన్న దాన్లో విశ్వాసం కలుగకుండా దాన్ని అట్లే ఆమోదించాలా? అది కాపట్యం! నువ్వొక దొంగ నాణెమని తెలుస్తోంది.
బ్రహ్మసమాజ భక్తుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. (మూలం: శ్రీ రామకృష్ణ కథామృతం)