దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38
దండః, దమయతామ్, అస్మి, నీతిః, అస్మి, జిగీషతామ్,
మౌనమ్, చ, ఏవ, అస్మి, గుహ్యానామ్, జ్ఞానమ్, జ్ఞానవతామ్, అహమ్.
అహమ్ = నేను; దమయతామ్ = దమనమొనర్చేవారి (దండించేవారి); దండః = దండ నీతిని; అస్మి = అయి ఉన్నాను; జిగీషతామ్ = జయింపగోరే వారి; నీతిః = రాజనీతిని; అస్మి = అయి ఉన్నాను; గుహ్యానామ్ = గోప్య విషయాలకు సంబంధించిన; మౌనం ఏవ చ = మౌనం కూడా (నేనే); జ్ఞానవతామ్ = జ్ఞానుల; జ్ఞానమ్ = తత్త్వ జ్ఞానాన్ని.
తా ॥ అసంయతులను శాసించి నియమించే వారి దండనీతి నా విభూతి అని గ్రహించు; జయింపగోరేవారి రాజనీతి నేనే. విషయాలను రహస్యంగా ఉంచే మౌనం కూడా నేనే. తత్త్వజ్ఞానుల యందు నా విభూతి జ్ఞానరూపంలో ప్రకాశిస్తోంది.
వ్యాఖ్య:-
‘నీతిరస్మి జిగీషతామ్’: గెలవాలనుకునే వారిలో ఉండే ‘నీతి’ని నేనే అని భగవంతుడి ఉద్దేశం. నీతితో కూడిన విజయమే నిజమైన విజయం. అవినీతితో పొందే గెలుపు అసలైన గెలుపు అనిపించుకోదు, అది ఓటమితో సమానమే. కాబట్టి కేవలం గెలవడం ముఖ్యం కాదు, నీతి తప్పకుండా గెలవడమే గొప్పదని ఈ మాట వల్ల తెలుస్తోంది.
‘మౌనం చైవాస్మి గుహ్యానామ్’: రహస్యమైన వాటిలో ‘మౌనాన్ని’ నేనే అని భగవంతుడు చెప్పారు. మౌనం అనేది భగవత్స్వరూపం. కాబట్టి సాధకులు నోటితో మాట్లాడకుండా ఉండే ‘వాక్-మౌనాన్ని’, మనసులో ఆలోచనలు లేకుండా ఉండే ‘మానసిక మౌనాన్ని’.. ఈ రెండింటిని అలవాటు చేసుకోవాలి.
‘జ్ఞానం జ్ఞానవతామహమ్’: జ్ఞానులలో ఉండే ‘జ్ఞానాన్ని’ నేనే అని అర్థం. జ్ఞానం సాక్షాత్తు దైవస్వరూపం కాబట్టి అది అన్నింటికంటే గొప్పది. అందుకే మనిషి తప్పకుండా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.