పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31
పవనః, పవతామ్, అస్మి, రామః, శస్త్రభృతామ్, అహమ్,
ఝషాణామ్, మకరః, చ, అస్మి, స్రోతసామ్, అస్మి, జాహ్నవీ.
అహమ్ = నేను; పవతామ్ = పవిత్రమొనర్చేవానిలో, (వేగవంతములగువానిలో); పవనః = వాయువును; శస్త్ర భృతామ్ = ఆయుధ ధారులలో; రామః = శ్రీరాముణ్ణి; అస్మి = అయి ఉన్నాను; ఝషాణామ్ = మత్స్యాదులలో; మకరః చ = మొసలి అనే మత్స్య జాతి విశేషాన్ని; అస్మి = అయి ఉన్నాను; స్రోతసామ్ = నదులలో; జాహ్నవీ = గంగను; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ పవిత్రమొనర్చే (వేగవంతములైన) వానిలో నేను వాయువును, ఆయుధధారులలో శ్రీరాముణ్ణి. మత్స్యాదులలో మొసలి అనే మత్స్యజాతి విశేషాన్ని. నదులలో గంగను.
వ్యాఖ్య:-
ఈ శ్లోకంలో చెప్పినట్లుగా… గంగానది సాక్షాత్తు దైవస్వరూపమే. అందుకే అది అత్యంత పవిత్రమైనదిగా, పాపాలను కడిగేసేదిగా పేరు పొందింది. “నేను రాముడిని” అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పడం వల్ల… రాముడు, కృష్ణుడు ఇద్దరూ ఒక్కటే (ఒకే దేవుడి రూపాలు) అని స్పష్టంగా తెలుస్తోంది.
పుణ్యనది…భాగీరథి!: పరమాత్ముడి ప్రత్యక్షస్వరూపమే భాగీరథి అయిన గంగానది. అలాంటి గంగాజలాన్ని బిందువంత సేవించినా మనం యమధర్మరాజు బారి నుంచి తప్పించుకుంటాం. ఈ భావన వెనుక పరమార్థం వేరు. గంగ జ్ఞానానికి చిహ్నం; అలాంటి జ్ఞానజలాన్ని సేవించిన వారికి ఈ లోకంతో బంధనం ఉండదు. బంధనం లేనప్పుడు మమకారాలు సడలిపోతాయి; మరుజన్మ భయాలు అడుగంటిపోతాయి. అలా ఆత్మ పరమాత్మలో లీనమైపోయాక యమధర్మరాజుతో పనే ఉండదు. అందుకే ‘….స్రోతసామస్మి జాహ్నవీ’ అంటూ నదులలో గంగ తన విభూతియేనని వెల్లడించాడు శ్రీకృష్ణభగవానుడు. అదే విధంగా పరమేశ్వరుడు గంగను జ్ఞానానికి గురుతుగా తలదాల్చుకున్నాడు. ఆ జ్ఞానంతో కామాన్ని జయించాడు; మన్మథుడినే మసి చేశాడు. అలా జ్ఞానాధీశుడైనవాడికి సర్వమూ స్వాధీనమవుతుందని స్వానుభవంతో మనకు తెలియజేశాడు. మొక్కుబడిగా గంగలో మునకవేసి మోక్షం లభిస్తుందని మురిసిపోకుండా ముందు ఎంతో కొంత పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించుకునేందుకు ప్రయత్నించాలి. సపరివారం మధ్య కూడ సర్వసంగపరిత్యాగిలా మనుగడ సాగించిన మహేశ్వరుడిలా సంసారవనంలో మసలుకోవాలి. అలాంటి జ్ఞాన జాహ్నవిలో మునకతో జన్మజన్మల పాపం హరించుకుపోతుంది. అందుకే శుకమహర్షి శ్రీమద్భాగవతంలో…
ఘనపాప తమః పతంగ కరుణాపాంగన్, గనదుత్తుంగ తరంగన్, జనపరనుత బహుళ పుణ్యసంగన్, గంగన్…
‘గంగానది పాపాలనే చీకట్లను సూర్యుని వలె పారదోలుతుందనీ, కరుణరసం ప్రసరించే కడగంటి చూపులు కలదనీ, పెద్దలయిన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు ఆలవాలమైంద’ నీ విస్పష్టం చేస్తాడు. (మూలం: భ్రాంతి నుండి భగవంతుని దిశగా… – శంకరాచార్య విరచిత ‘భజగోవింద’ స్తోత్రానికి వ్యాఖ్యానం by స్వామి జ్ఞానదానంద)