ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28
ఆయుధానామ్, అహమ్, వజ్రమ్, ధేనూనామ్, అస్మి, కామధుక్,
ప్రజనః, చ, అస్మి, కందర్పః, సర్పాణామ్, అస్మి, వాసుకిః.
ఆయుధానామ్ = ఆయుధాలలో; అహం = నేను; వజ్రం = (దధీచి వెన్నెముక వల్ల కలిగిన) వజ్రాయుధాన్ని; ధేనూనామ్ = గోవులలో; కామధుక్ = కామధేనువును; అస్మి = అయి ఉన్నాను (నేను); ప్రజనః = సంతానోత్పాదకుడైన; కందర్పః చ = మన్మథుడను కూడా; అస్మి = అయి ఉన్నాను; సర్పాణామ్ వాసుకిః = సర్పాలలో వాసుకి; అస్మి = అయి ఉన్నాను;
తా ॥ ఆయుధాలలో (దధీచి* వెన్నెముక వలన కలిగిన) వజ్రాయుధాన్ని నేను, గోవులలో కామధేనువును; సంతానోత్పాదకుడైన మన్మథుణ్ణి కూడా నేను (కాని, కేవలం సంభోగమాత్ర ప్రధానమైన కామం అశాస్త్రీయమవడం వల్ల, నా విభూతి కాదు.* ) సర్పాలలో వాటికి అధిపతియైన వాసుకి కూడా నేనే.
వ్యాఖ్య:-
“ప్రజనశ్చాస్మి కందర్పః” (మన్మథుడిని నేనే) అని చెప్పేటప్పుడు, ఆ మన్మథుడికి ‘ప్రజనః’ (సంతానాన్ని కలిగించేవాడు) అనే ప్రత్యేకతను జోడించారు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే… ఇది కేవలం ఆనందం కోసం ఉండే కోరిక కాదు. ధర్మానికి లోబడి, మంచి సంతానాన్ని కనడానికి కారణమయ్యే పవిత్రమైన కోరిక (కామం) మాత్రమే ఇక్కడ చెప్పబడింది. “ప్రాణులలో ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేనే” (ధర్మావిరుద్ధో…) అని 7వ అధ్యాయం 11వ శ్లోకంలో భగవంతుడు ఇంతకుముందే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.