రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ॥ 23
రుద్రాణామ్, శంకరః, చ, అస్మి, విత్తేశః, యక్షరక్షసామ్,
వసూనామ్, పావకః, చ, అస్మి, మేరుః, శిఖరిణామ్, అహమ్.
రుద్రాణామ్ చ = ఏకాదశ రుద్రులలో; శంకరః = శంకరుడను; అస్మి = అయి ఉన్నాను; యక్షరక్షసామ్ = యక్ష రాక్షసులలో; విత్తేశః = కుబేరుణ్ణి; వసూనాం చ = అష్ట వసువులలో; పావకః = అగ్నిని; అస్మి = అయి ఉన్నాను; శిఖరిణామ్ = శిఖరాలు గల కొండలలో; అహం = నేను; మేరుః = మేరువును.
తా ॥ ఏకాదశ రుద్రులలో* శంకరుణ్ణి, యక్షరాక్షసులలో కుబేరుణ్ణి, అష్ట వసువులలో* అగ్నిని, శిఖరాలు గల పర్వతాలలో మేరువును అయి ఉన్నాను.
వ్యాఖ్య: –
‘రుద్రులు’ – పదునొకండుగురు – (వీరినే ఏకాదశ రుద్రులందరు) – వారు (1) హరుడు (2) బహురూపుడు (3) త్య్రంబకుడు (4) అపరాజితుడు (5) వృషాకపి (6) శంభువు (7) కపర్ది (8) రైవతుడు (9) మృగవ్యాధుడు (10) శర్వుడు (11) కపాలి అను పేర్లు గలిగియున్నారు.
‘వసువులు’ – ఎనిమిదిమంది ( అష్టవసువులు) వారు (1) ధరుడు (2) ధ్రువుడు (3) సోముడు (4) అహుడు (5) అనిలుడు (6) అనలుడు (7) ప్రత్యూషుడు (8) ప్రభాసుడు.