విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తిమేఽమృతమ్ ॥ 18
విస్తరేణ, ఆత్మనః, యోగమ్, విభూతిమ్, చ, జనార్దన,
భూయః, కథయ, తృప్తిః, హి, శృణ్వతః, న, అస్తి, మే, అమృతమ్.
జనార్దన = కృష్ణా; ఆత్మనః = నీ; యోగమ్ = సర్వజ్ఞత్వాదికమైన ఐశ్వర్యాన్ని; విభూతిమ్ చ = వేరు వేరైన ధ్యేయ వస్తువులను; విస్తరేణ = వివరంగా; భూయః = మళ్ళీ; కథయ = చెప్పు; హి = ఏమన (నీ); అమృతమ్ = వాక్యామృతాన్ని; శృణ్వతః = వింటున్న; మే = నాకు; తృప్తిః = పరితృప్తి (చాలనే భావం); న అస్తి = లేదు (కలుగుట లేదు).
తా ॥ (చిత్తం బహ్మిర్ముఖమైనప్పటికీ విభూతిభేదాన్ని అనుసరించి ఆయా వస్తువులతో నిన్ను చింతింప వీలుగా, నీ విభూతులను విస్తరించి చెప్పు-) జనార్దనా! నీ యోగైశ్వర్యాన్ని, విభూతులను మళ్ళీ విస్తరించి చెప్పు; ఏయే వస్తువుల ననుసరించి నిన్ను ధ్యానించగలనో తెలియజెప్పు. నీ వాక్యామృతాన్ని వింటున్న నాకు తృప్తి అనేది కలగడం లేదు; ఇంకా వినవలెననే ఉంది.