స్వయమేవాత్మనాత్మానాం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥ 15
స్వయమ్, ఏవ, ఆత్మనా, ఆత్మానమ్, వేత్థ, త్వమ్, పురుష ఉత్తమ,
భూతభావన, భూత ఈశ, దేవదేవ, జగత్పతే.
పురుష ఉత్తమ = పురుషోత్తమా; భూత భావన = భూతోత్పాదకా; భూత-ఈశ = జీవ నియామకా; దేవ దేవ = ఆదిత్యాది దేవతలను ప్రకాశింపజేయువాడా; జగత్-పతే = విశ్వపాలకా; త్వమ్ = నీవు; స్వయం ఏవ = నీయంతట నీవే; ఆత్మనా = సాధనాంతర వ్యతీతంగా, (ఆత్మచేత); ఆత్మానమ్ = నిన్ను; వేత్థ = తెలిసికుంటున్నావు.
తా ॥ పురుషోత్తమా!* భూతభావనా! భూతేశా! దేవదేవా! జగత్పతీ! నిరతిశయ జ్ఞానైశ్వర్యబల శక్తివిశిష్టుడవైన నిన్ను నీవే సాధనాంతర వ్యతీతంగా ఎరుగగలవు, ఇతరులు ఎరుగజాలరు. (కుమార సంభవమ్. 2-10 చూ:)