1. తపస్సుచే పాపాలు ప్రక్షాళన చేసుకొన్నట్టి శాంతచిత్తులు, కోరి కలను అధిగమించినట్టి మోక్షాపేక్షితులకై ఈ ‘ఆత్మబోధ’ రచించబడినది.
2. మిగిలిన సాధనలకంటే జ్ఞానమార్గం సూటియైనది. అగ్నిలేనిదే వండడం సాధ్యపడదు. అట్లే జ్ఞానంలేనిదే మోక్షం సిద్ధించదు.
3. కర్మ మాయను నిర్మూలించలేదు. కర్మ దానికి భిన్నమైనది కాదు. చీకటిని తొలగించడానికి దీపమే కావలసివుంది. అట్లే జ్ఞానం మాత్రమే మాయను రూపుమాపగలదు.
4. అజ్ఞానం వలన ఆత్మ పరిమితమైనట్లు గోచరిస్తుంది అజ్ఞానం నశించగానే శుద్ధ ఆత్మ మేఘాలు తొలగగానే సూర్యుడు ప్రకాశించేటట్లు స్వయంగా ప్రకాశమానమౌతుంది.
5. అజ్ఞానకలుషమైనదానిని జ్ఞానసాధనమార్గం ద్వారా శుద్ధి చేయాలి. ఇండువుగింజ మలినమైన నీటిని శుద్ధిచేసి తనంతట క్రిందికి దిగిపోవునట్లు జ్ఞానం తన శుద్ధికార్యక్రమం పూర్తికాగానే లయమైపోతుంది.
6. మనం కలగంటున్నంత కాలం అది యథార్థంగానే కనిపి స్తుంది. అలాగే రాగద్వేషాదులతో కూడుకొన్న సంసార జీవితం, జ్ఞానో దయం కానంతవరకు యథార్థమైన దానిలా గోచరిస్తుంది. పారమార్థిక సత్తాలో ప్రవేశించిన వ్యక్తికి ప్రపంచం స్వప్నతుల్యమే.
7. ముత్యపు చిప్పలో తోచే వెండిలా అద్వయం సర్వాధిష్ఠానభూత మైన బ్రహ్మం తెలియబడనంత కాలం సృష్టి అంతా నిజమైన దానిలా కనపడుతుంది.
8. నీటిలోని బుడగలలా సృష్టిస్థితిలయాత్మకమైన ప్రపంచం ఉపా దాన కారణమూ, అఖీలాధారుడూ అయిన పరమేశ్వరునియందు భాసి స్తున్నది.
9. బంగారంతో చేయబడిన వివిధ రకాలైన ఆభరణాలలా శాశ్వ తమూ, సర్వవ్యాపకమూ, సత్ – చిత్ స్వాభావికమూ అయిన విష్ణువు నందు నామరూపాత్మకమైన సర్వం భాసిస్తూన్నది.
10. హృషీకేశుడు సర్వవ్యాపి అయినా ఉపాధి దోషం వలన వివిధా లుగా కనపడుతున్నాడు. ఉపాధి తొలగగానే ఘటాకాశం మహాకాశంలో కలిసేటట్లు ఒకే ఒక పరమాత్మ మాత్రమే మిగులుతాడు.
11. పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి, వాసనాదులు ఉండవు. కాని ఉపాధిదోషంవలన నీటికి రంగు మొదలగు వాటిని ఆరోపిస్తున్నాం.
12. మహాభూతముల పంచీకరణం వలన కర్మలనుబట్టి స్థూల శరీరం ఏర్పడుతుంది. సుఖదుఃఖాలు అనుభవించడానికి ఇది స్థానమని చెప్పబడుతోంది.
13. పంచ ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి దశేన్ద్రియాలతో సహా సూక్ష్మశరీరం అపంచీకృతమైనది. సుఖదుఃఖాదులు అనుభవించేది ఇదే.
14. అనాదిగా ఉండే అవిద్య నిర్వచింప వీలుకానిది. దీనినే కారణ శరీర మంటారు. మూడు ఉపాధులకు అన్యమైనది ఆత్మ.
15. నీలిరంగువస్త్రం సమీపంలో ఉన్న స్ఫటికం నీలంగా కనపడు తుంది. అటే పంచకోశాల సామీప్యం వల్ల శుద్ధాత్మ వికారం చెందినట్లు గోచరిస్తుంది.
16. దంచి నూకను బియ్యంనుండి వేరుచేసే రీతిలో యుక్తిచేతమథించి పంచకోశాలను శుద్ధాత్మనుండి వేరు చేయాలి.
17. పరిశుభ్రమైన అద్దంలో ప్రతిబింబం చక్కగా కనపడుతుంది. అదే రీతిలో ఆత్మ ఎల్లవేళల, అంతటా నిండి ఉన్నప్పటికీ పరిశుద్ధ మనస్కు లకే ప్రకాశమానమవుతుంది.
18. రాజు తన దర్బారులో జరిగే ఉత్సవ కార్యక్రమం చూస్తాడు. ఆతడులేనిదే ఉత్సవం ఉండదు. కాని ఆతడు ఉత్సవంలో భాగస్థుడు కాడు. అలాగే ఆత్మ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్వభావాలకు అతీతమూ విలక్షణమూ అయినది. ఆత్మసాక్షి చైతన్యం. ఆ విధంగా తెలుసుకోవాలి.
19. అవివేకికి ఆకాశంలో మేఘాలు కదలుతుంటే చంద్రుడు కదలు చున్నట్లు గోచరిస్తుంది. అదేవిధంగా అవివేకి ఇంద్రియాలు చేసే పనులను ఆత్మకు ఆపాదిస్తాడు.
20. సూర్యుని కాంతి వలన జనం పనులు చేసుకుంటారు. అట్లే ఆత్మచైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహం, ఇంద్రియం, మనసు, బుద్ధి వాటి వాటి పనులు చేస్తాయి.
21. ఆకాశానికి నీలత్వాన్ని ఆపాదించినట్లు దేహేన్ద్రియాల గుణా లను, పనులను అవివేకులు సచ్చిదాత్మకమైన ఆత్మకు ఆపాదిస్తారు.
22. కదలిక నీటిదైనా దానిని అందలి చంద్ర ప్రతిబింబమునకు ఆపాదిస్తాం. అలాగే కర్తృత్వాదులు ఉపాధియైన మనసుకు చెందినవే అయినా, అజ్ఞానం వలన వాటిని ఆత్మకు ఆపాదిస్తాం.
23. అనురాగం, కోరిక, సుఖం, దుఃఖం మొదలైనవి మనసుకు సంబంధించినవి. దీర్ఘనిద్రావస్థలో, అంటే సుషుప్తి అవస్థలో అవి లేవు. కనుక అవి ఆత్మకు సంబంధించినవి కావు.
24. సూర్యునికి ప్రకాశం, నీటికి చల్లదనం, అగ్నికి ఉష్ణం ఎలా స్వభా వమో అట్లే ఆత్మకు సత్, చిత్, ఆనంద, నిత్య, నిర్మలత్వం స్వభావాలు.
25. ఆత్మయందలి సత్, చిత్ అంశం, శుద్ధియందలి భావవృత్తి – రెంటిని కలిపి అవివేకి ‘నేను తెలిసికొన్నాను’ అనుకొంటాడు.
26. ఆత్మకు మార్పు లేదు. బుద్ధికి స్వతఃజ్ఞానం లేదు. జీవుడు భ్రమ వలన ‘నేను తెలిసికొనుచున్నాను’, ‘నేను చూస్తున్నాను’ అని అను కొంటున్నాడు.
27. తాడును చూసి, పాము అని భ్రమించి భయం చెందేట్లు, జీవ భావంవల్ల భయం కలుగుతోంది. నేను పరమాత్ముణ్ణి, జీవుణ్ణి కాను అనే నిశ్చయజ్ఞానం కల్గిన నాడు నిర్భయం కలుగుతుంది.
28. దీప కాంతి వలన ఘటాది వస్తువులు ప్రకాశమాన మవుతు న్నాయి. అట్లే జడప్రాయమైన బుద్ధి, ఇంద్రియాదులు స్వయంప్రకాశమా నాలు కావు, ఆత్మ చైతన్యంవల్లనే అవి ప్రకాశిస్తున్నాయి.
29. వెలుగుచున్న దీపాన్ని గుర్తించడానికి వేరొక దీపం అవసరం లేదు. జ్ఞానస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి మరే ఇతర జ్ఞానమూ అవసరం లేదు.
30. ‘ఇది కాదు, ఇది కాదు’ అని అన్ని ఉపాధులను తొలగించి, మహా వాక్యాలు ప్రతిపాదించిన జీవాత్మా, పరమాత్మల ఏకత్వాన్ని తెలుసుకోవాలి.
31. కారణ శరీరం వరకు గల శరీరాది దృశ్యాలు నీటిబుడగలలా క్షణికాలు. వీటికి విలక్షణమైన, నిర్మలమైన, బ్రహ్మ పదార్థాన్ని వివేకి తెలిసి కోవాలి.
32. నేను క్షణికమైన దేహం కాదు. నాకు పుట్టుక, వార్ధక్యం, నిస్సత్తువ, చావు వగైరాలు లేవు. నాకు ఇంద్రియాలు లేవు. కనుక నాకు శబ్దాది ఇంద్రియ విషయాలతో సంబంధంలేదు.
33. ‘నేను’ మనసును కాను. కనుక నాకు దుఃఖం, రాగద్వేషాలు, భయం ఇత్యాదులు లేవు. ఆత్మ ప్రాణవాయువు కాదు, మనసు కాదు, అది శుద్ధమైనదని వేదములు ఘోషిస్తున్నాయి.
34. ఆత్మ నిర్గుణం. కార్యాలు లేవు, వికల్పాలు లేవు. ఎట్టి మలినాలు కాని, వికారాలుకాని, ఆకారాలుకాని లేవు. అది శాశ్వతం, నిత్యశుద్ధం, బంధరహితం.
35. నేను ఆకాశంలా సర్వత్రావ్యాపించివున్నాను. నాకు మార్పులేదు. నేను పరిశుద్ధుణ్ణి. అంతటా, ఎల్లపుడు సమానుణ్ణి. నాకు సంగత్వం లేదు.మాలిన్యం లేదు, చలనం లేదు.
36. పరబ్రహ్మం నిత్యం, శుద్ధం బంధరహితం. అది ఏకం. విభజింపరానిది. అందు ద్వైతం లేదు. అది సత్యం, జ్ఞానం, అనంతం. అట్టి బ్రహ్మపదార్థాన్ని నేనే.
37. ఔషధం సేవించిన వ్యక్తి రోగం ఉపశమించేటట్లు సదా ‘నేనేబ్రహ్మాన్ని’ అనే ధ్యానౌషధం పుచ్చుకొన్న వ్యక్తికి అవిద్య, విక్షేపాది రోగాలునశిస్తాయి.
38. ఏకాంత ప్రదేశంలో కూర్చొని, కోరికలు జయించి, ఇంద్రియనిగ్రహం కలిగి, అనంతమూ ఏకమూ అయిన ఆత్మను ఒక్కదానినే ధ్యానిం చాలి.
39. యావత్తు దృశ్యప్రపంచాన్ని ఆత్మలో లయంచేసి, వివేకి ఆత్మ ధ్యానం చేస్తాడు. నిర్మలాకాశంలా అది సదా శుద్ధమైనది.
40. పరమాత్మను తెలిసినవాడు నామరూపాత్మకమైన దృశ్య ప్రపం చాన్ని విడిచి, పరిపూర్ణ చిదానంద స్వరూపుడుగా ఉండిపోతాడు.
41. తెలిసికొనువాడు, తెలియబడు వస్తువు, తెలిసే సాధన అనేవి ఆత్మలో లేవు. ఆత్మ చైతన్యస్వరూపం, ఆనందస్వరూపం అయి స్వయం ప్రకాశమానమై ఉన్నది.
42. ఈ విధంగా జీవాత్మ అనే సమిధలతో, ధ్యానమనే రాపిడి చేయగా జనించే జ్ఞానం అజ్ఞానమనే కట్టెలను దగ్ధంచేస్తుంది.
43. అరుణుడు చీకటిని తొలగించి రానున్న సూర్యోదయం సూచిస్తాడు. అలాగే జ్ఞానం అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి స్వయంప్రకాశమాన మైన ఆత్మసాక్షాత్కారాన్ని సూచిస్తుంది.
44. మెడలోని హారం సంగతి మరచి అజ్ఞానంలో పడి దానికొరకై వెదకి, తుదకు మన మెడలోనే ఉన్నట్లు గ్రహించి ఏదో కొత్తవస్తువును పొందినట్లు భావిస్తాం. అలాగే ఆత్మ అనేది నిత్యప్రాప్తం. నే నన్నదే అది.కాని అవిద్య వలన మన స్వస్వరూపం మరచి బాధలకు గురి అవుతున్నాం. అజ్ఞానం నశించిననాడు ఆత్మ ఏదో కొత్తగా లభించినదానిలా అనిపిస్తుంది.
45. స్తంభంలో మనిషి భ్రాంతి కల్గినట్లు, బ్రహ్మపదార్థంలో జీవిని చూస్తున్నాం. జీవాత్మకు, పరమాత్మకు భేదంలేదని నిజస్వభావం తెలిస్తే తెలియనగును.
46. అహంకార మమకారాలు నిజతత్త్వం తెలిసిన జ్ఞానికి ఉండవు. సూర్యోదయ మవగానే దిక్కులు తెలుస్తాయి.
47. విజ్ఞాని, ఆత్మద్రష్ట అయిన యోగి తన జ్ఞానచక్షువు ద్వారా జగాన్నంతా తన ఆత్మలో దర్శించగలడు. ఆతనికి అంతా ఆత్మమయమే.
48. కుండ, పిడత, మూకుడు మొదలైనవన్నీ మట్టే. నామరూపా దులకు వెనుకవున్న మూలం మట్టే. అలాగే జగత్ అంతా ఆత్మే. ఆత్మకంటే భిన్నమైన దేదీ లేదు. జ్ఞాని సర్వత్రా ఆత్మనే దర్శిస్తాడు.
49. భ్రమరకీటక న్యాయంలా, జీవన్ముక్తుడు ఉపాధులు త్యజించి ఆత్మజ్ఞాననిష్టుడవుతాడు. తన సచ్చిదానంద స్వభావం వలన బ్రహ్మమే అవుతాడు.
50. మోహ సముద్రాన్ని దాటి రాగద్వేషాది రాక్షసులను సంహరించి, యోగి శాంతియుతుడై ఆత్మారామునిలో విరాజిల్లుతాడు.
51. జీవన్ముక్తుడు అనిత్యాలైన బాహ్య సుఖాలలో అనాసక్తుడై ఆత్మ సుఖాన్ని అనుభవిస్తూ, ఘటంలో ఉంచబడిన దీపంలో నిశ్చలంగా ప్రకా శిస్తాడు.
52. దేహేంద్రియాది ఉపాధులు ఉన్నా మునికి వాటి ధర్మాలతో సంబంధం లేదు. దేనినీ పట్టించుకోక సర్వజ్ఞుడే అయినా మూఢునిలా అతడు ఉంటాడు. వాయువులా దేనినీ అంటక ఆతడు చరిస్తాడు.
53. నీటిలో కలసిన నీరు, మహాకాశంలో కలసిన ఘటాకాశం, వెలుతురులో కలసిన వెలుతురు ఎలా ఒకటి అవుతవో ఉపాధిరహితు డైన ముని సర్వవ్యాప్తియైన విష్ణుతత్త్వంలో నిర్విశేషంగా లీనం అయిపోతాడు.
54. దేనిని పొందితే ఇక పొందదగినది ఏదీ ఉండదో, ఏ సుఖంకంటే మించిన సుఖం లేదో, ఏ జ్ఞానంకంటే మించిన జ్ఞానం లేదో, దానిని బ్రహ్మమని తెలుసుకోవాలి.
55. దేనిని చూస్తే ఇక చూడదగినది ఏదీ ఉండదో, దేనిని పొందితే ఇక పునర్జన్మ ఉండదో, దేనిని తెలిసిన ఇక తెలియదగినది ఏమీ ఉండదోదానిని బ్రహ్మమని తెలుసుకోవాలి.
56. అంతటా, పైనా, క్రిందా నిండినదీ, సచ్చిదానందమయమూ, ద్వైతమూ లేనిది, అనంతమైనది, నిత్యమూ, ఏకమూ అయినది ఏది ఉందో అదే బ్రహ్మమని గ్రహించాలి.
57. ‘నేతి నేతి’ అని ఉపనిషత్తులు దేనినిగూర్చి చెప్పుచున్నవో, ఏది అద్వయమూ, అఖండమూ, ఆనందమూ ఏకమూ అయివున్నదో అదే బ్రహ్మం.
58. సృష్టికర్త మొదలగువారు పరబ్రహ్మం అఖండ ఆనందంలో ఒక్క అణువును మాత్రమే చవిచూసి తదనుగుణ్యంగా ఆనందం అనుభవిస్తున్నారు.
59. యావత్తు సృష్టి బ్రహ్మంచే పరివేష్టింపబడి ఉన్నది. బ్రహ్మచైతన్య ప్రసాదంవల్లనే వ్యవహారం జరుగుచున్నది. పాలలోని వెన్నలా అంతటా బ్రహ్మం నిండి ఉన్నది.
60. బ్రహ్మం సూక్ష్మం కాదు, స్థూలమూకాదు; పొట్టికాదు పొడమా కాదు; పుట్టుక లేదు, మార్పు లేదు; రూపం, గుణం, రంగు, పేరు దానికి లేవు.
61. దాని వెలుతురు వలన సూర్యాదులకు ప్రకాశం కల్గుచున్నది. దానిని ఇతర వస్తువులు ప్రకాశింపచేయలేవు. యావత్ప్రపంచం బ్రహ్మం వల్లనే దృశ్యమాన మవుతున్నది.
62. కాలుతున్న ఇనుపగుండును ఆవహించిన అగ్నిలా బ్రహ్మ పదార్థం స్వయంగా ఈ జగత్తు అంతటా లోపలా వెలుపలా ఉండి యావత్తును ఆవహించి ప్రకాశించుచున్నది.
63. బ్రహ్మ జగత్తుకంటే విలక్షణమైనది. బ్రహ్మం తప్ప ఇతరం ఏమీ లేదు. మృగతృష్ణలా (ఎడారిలో కనిపించే నీటిలా) బ్రహ్మాన్ని ఆధారంగా చేసికొని జగత్తు భాసిస్తున్నది.
64. కనిపించేది, వినిపించేది అంతా బ్రహ్మమే. సరియైన జ్ఞానం వలన అద్వయం, సచ్చిదానన్ద స్వరూపం అయిన బ్రహ్మం తెలియవస్తుంది.
65. జ్ఞానచక్షువు ద్వారానే సర్వవ్యాపీ, చైతన్య స్వరూపీయైన ఆత్మను దర్శించగలం. అంధుడు సూర్యుని చూడలేడు, అదేవిధంగా అజ్ఞాని ఆత్మను చూడలేడు.
66. జీవుడు శ్రవణాదులతో ఉద్దీప్తి చెంది, జ్ఞానాగ్ని తప్తుడై, మల విముక్తుడై తప్తకాంచనంలా ప్రకాశిస్తాడు.
67. హృదయాకాశంలో ఉదయించే ఆత్మభానుడు, అజ్ఞానాంధకా రాన్ని దహించి, సర్వవ్యాపియై, సర్వధారియై తాను ప్రకాశించటమేగాక, సమస్తాన్ని ప్రకాశింపచేస్తాడు.
68. సర్వకర్మ సంగమాన్ని పరిత్యజించి; దిక్, దేశకాల పరిధులను అధిగమించి, శీతోష్ణాది ద్వంద్వాలకు అతీతమైనట్టి, నిర్మలినమైనట్టి, ఆత్మ తీర్థానందంలో నిత్యం రమించే జ్ఞాన నిష్టాపరుడు, సర్వజ్ఞుడు, విష్ణు తుల్యుడు, అమృతుడు.
॥ ఓం తత్ సత్ ॥