కాళీమాత ఒడిలో…
వీథిగాయకులు హఠాత్తుగా వస్తారు. ఆడతారు, పాడతారు.
వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడూ
వారిని ఎవరూ గుర్తించరు, నిష్క్రమిస్తూన్నప్పుడూ వాళ్ళు
ఫలానా అని ఎవరికీ తెలియరాదు. శ్రీరామకృష్ణులు
అవును ఈ విషయం శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితచరిత్రను చదువుతున్నప్పుడు ఇది యథాతథంగా రూఢి అవుతుంది. ఆయన నేతృత్వంలో ఒక దివ్యగాయకుల బృందం వచ్చి ఆనందరాగంలో పాటలు పాడి వెళ్ళినట్లుగా ఉంది. ఆ సుమధుర గీతాలను స్వామి శారదానంద కల్పతరువు రోజు వరకు, అంటే 1886, జనవరి 1 వ తేదీ వరకు పొందుపరచి ఉన్నారు. ఆ పాటల ముగింపును, ఆ గాయకబృంద నేత మరణాన్ని తెలుసుకోగోరితే మనం ఇతర పుస్తకాలను చూడవలసి వస్తుంది. గురుదేవుల గృహస్థ శిష్యులు కొందరు, ఆయనను దర్శించిన ఇతరులలో కొందరు ఆయన జీవిత చరిత్రను రచించి ఉన్నారు. వాటి నుండి, రామకృష్ణ మిషన్ వెలువరించిన పలు పుస్తకాల నుండి సేకరించి, అనువదించి ఈ అనుబంధాన్ని పొందుపరచాం.
కాళీమాత అనుంగు పుత్రులైన శ్రీరామకృష్ణులు ఆమె ఒడిలో శాశ్వతంగా నిద్రించిన ఆ శోక వృత్తాంతాన్ని తెలుపడానికి మాత్రమే ఈ అనుబంధాన్ని పొందుపరచడం లేదు. నేడు లోకవ్యాప్తంగా విస్తృతించిన రామకృష్ణ మిషన్ అనే మహావృక్షపు బీజం దక్షిణేశ్వరంలో నాటబడినప్పటికీ, శ్యాంపుకూర్లోనూ, కాశీపూర్లోనూ అది అంకురించిందని మనకుతెలుసు. అది ఎలా అంకురించిందో, కంచె వేసి దానిని పరిరక్షించే బాధ్యతను గురుదేవులు ఎలా నరేంద్రునికి అప్పగించారో ముఖ్యంగా తెలుసుకోవడానికే ఈ విభాగాన్ని మేం పొందుపరచాం.
జనవరి మొదటి తేదీ సంఘటనానంతరం గురుదేవుల ఒంట్లో మంట ఆరంభమైంది. గంగాజలాన్ని తెప్పించుకొని, తమపై ఆయన చిలకరించుకొన్నారు.
ఈ కాలఘట్టంలో నరేంద్రునిలో తీవ్రవైరాగ్యం అంకురించింది. భగవదనుభూతి పొందడానికి అతడిలో ఆరాటం ఉద్ధృతమైంది. జనవరి 1 వ తేదీ నాడు అతడు గురుదేవుల వద్దకు వెళ్ళి, ‘తమ అనుగ్రహం వలన అందరు ఏదోరకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అనుభూతి పొందేలా నన్నూ అనుగ్రహించండి. అందరికీ లభించిన తరువాత నేను మాత్రం రిక్తహస్తునిగా ఉండిపోవాలా?’ అని అడిగాడు. అందుకు గురుదేవులు, ‘నీ కుటుంబానికి చేయవలసిన ఏర్పాట్లు చేసిన తరువాత నా వద్దకురా. అవునూ, ఇంతకూ నీకు ఏం కావాలి?’ అని అడిగారు. ఆ మాటలు విని నరేంద్రుడు, ‘నేను మూడు నాలుగు రోజులు అవిచ్ఛిన్న సమాధిలో మగ్నుడనై ఉండిపోవాలి. తినడానికి మాత్రమే బాహ్యస్మృతిలోకి రావాలి. అటువంటి ఒక స్థితిని అనుగ్రహించండి’ అని అడిగాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, ‘సిగ్గుచేటు. నువ్వు ఒక మఱ్ఱివృక్షంలా ఎదిగి, సంసార తాపంతో వాడిపోతున్న వేలాదిమందికి నీడనిస్తావని ఆశించాను. కాని నువ్వేమో స్వకీయ ముక్తిని కోరుతున్నావు. నువ్వు కోరిన స్థితి కంటే ఉన్నతోన్నత స్థితి ఒకటి ఉంది. ‘సర్వమూ నీవే’ అని నువ్వే కదా పాడావు! నీ కుటుంబానికి కావలసిన ఏర్పాట్లు చేసి నా వద్దకు రా. సమాధి కంటే ఉన్నతమైన స్థితిని నువ్వు పొందగలవు’ అని అన్నారు.
మర్నాడు ఉదయం నరేంద్రుడు ఇంటికి వెళ్ళాడు. పరీక్షలు దగ్గర పడుతున్నప్పటికీ చదవకుండా తిరుగాడుతున్నందుకు ఇంట్లోవారు అతణ్ణి మందలించారు. అమ్మమ్మ ఇంట్లో తను చదువుకొంటున్న గదికి వెళ్ళి, పుస్తకం తెరిచాడు. అంతే, చదవడం ఏదో ఒక భయంకరమైన పనిగా తోచి, చెప్పరాని భయం అతణ్ణి ఆవహించింది. అతడు చదవలేక పోయాడు. కుటుంబ పరిస్థితిని బట్టి చూస్తే చదివే తీరాలి. కాని చదవవద్దని ఆ భయం బెదరిస్తున్నట్లు అతడికి తోచింది. చదవాలో వద్దో అనే సందిగ్ధంలో అతడు సతమతమయ్యాడు. ఏ నిర్ణయానికీ రాలేక, హృదయమే పగిలిపోయేలా విలపించాడు. ఇంతకు ముందు ఎన్నడూ అతడు అలా విలపించి ఎరుగడు. ఆ తరువాత ఏం జరిగింది? అతడే ఇలా చెప్పాడు : “నా పుస్తకాలు వగైరాలను అక్కడే పడేసి, వెఱ్ఱివాడిలా గురుదేవులను వెతుక్కొంటూ కాశీపూర్‌కు పరుగెత్తాను. దారిలో చెప్పులు తెగిపోయి ఎక్కడో పడిపోయాయి. ఒక గడ్డివామికి గుద్దుకొని ఒళ్ళంతా గడ్డిపరకలు అంటుకొన్నాయి. ఒళ్ళు తెలియకుండా పరుగెత్తాను. కాశీపూర్ వరకు పరుగెత్తుతూనే ఉన్నాను.”
జనవరి 4 వ తేదీ ఉదయం తొమ్మిది గంటల సమయం. నిరంజన్, శశి, మహేంద్రనాథ్‌లు గురుదేవుల ప్రక్కన కూర్చునివున్నారు. వ్యాధి ప్రకోపించడంతో గురుదేవులు నొప్పితో ఎంతో బాధపడుతున్నారు. అప్పటికీ తమ చుట్టూవున్న వారితో హీనస్వరంలో నరేంద్రుణ్ణి గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు : “నరేంద్రుడి ప్రస్తుత అద్భుతమైన స్థితిని పరికించండి. ఒక కాలఘట్టంలో అతడు సాకార భగవంతుణ్ణి ససేమిరా అంగీకరించ లేదు. ఇప్పుడు ఆ భగవంతుణ్ణే పొంద ఆరాటపడుతున్నాడు!” తదనంతరం నరేంద్రుడు తన లక్ష్యాన్ని సత్వరమే పొందగలడని సూచనప్రాయంగా చెప్పారు.
గురుదేవుల ఉపదేశానుసారం నరేంద్రుడు పలు విధాలైన సాధనలు అనుష్ఠించాడు. వాటన్నిట్లోను అతడు విజయవంతుడవడంలో వింతేముంది! కాశీపూర్ రోజులలో శ్రీరామకృష్ణులు అతణ్ణి భవిష్యత్ కార్యానికి అనువుగా మలిచారు. ఒక రోజు ఆయన నరేంద్రుణ్ణి పిలిచి, తక్కిన శిష్యులను చూపుతూ, ‘వీరందరి బాధ్యతా నీ మీదే వదలిపెట్టి వెళుతున్నాను. వాళ్ళు సాధనలు అనుష్ఠించేలా, ఇంటికి తిరిగిపోకుండా ఉండేలా చూసుకో’ అని చెప్పారు. యువకులందరికీ సన్న్యాస మార్గంలో పయనించేలా నెమ్మదిగా శిక్షణ గరిపారు. ఒక రోజు వాళ్ళతో వీథుల వెంట వెళ్ళి భిక్ష సేకరించుకొని రమ్మన్నారు. వారిలో పలువురు ఎంతో సంపన్నుల కుమారులు, ఐశ్వర్యంలో పుట్టిపెరిగినవారు. అయినప్పటికీ గురుదేవుల ఈ ఆదేశాన్ని పాటింప సంతోషంగా బయలుదేరారు. భిక్షగా సేకరించి తెచ్చిన బియ్యం, కూరగాయలను వండి గురుదేవుల వద్దకు తెచ్చారు. దాన్లో నుండి ఒకింత తీసుకొని తమ నోట్లోవేసుకొన్న గురుదేవులు, ‘మంచి పని చేశారు. ఈ ఆహారం ఎంతో పవిత్రమైనది’ అని చెప్పి, ఆయన ఎంతో తృప్తి చెందారు.
నానాటికీ శ్రీరామకృష్ణుల గొంతునొప్పి భరించరానంత అధికరించ సాగింది. కాని ఆయనో, మందహాసం చేస్తూ, హీనస్వరంలో, “బాధ, శరీరం వాటి విషయం వాటిని చూసుకోనీ. ఓ నా మనస్సా! నీవు బ్రహ్మానందంలో నిలిచి ఉండు” అన్నారు. మార్చ్ 14 వ తేదీ రాత్రి మహేంద్రనాథ్‌తో, “ఇదంతా ఆనందంగా భరిస్తున్నాను. లేకుంటే మీరంతా బోరున ఏడ్చేస్తారు. మీరంతా, ‘ఈ చిత్రవధ వద్దు, శరీరాన్ని త్యజించివేయండి’ అని చెబితే, నేను ఆనందంతో ఈ దేహాన్ని త్యజిస్తాను” అని అన్నారు.
మార్చ్ 15 వ తేదీ సూర్యోదయ సమయంలో గిరీష్, డాక్టర్లయిన ఉపేంద్రుడు, కవిరాజ్ నవగోపాల్ను తోడ్కొని వచ్చాడు. వాళ్ళు గురుదేవులను శారీరకంగా పరీక్షించి, ఔషధాలు ఇచ్చారు. అందువలన దేహపరిస్థితి కాస్త మెరుగుపడింది. తన ప్రక్కనున్న భక్తులతో, “ఇది దేహానికి వచ్చిన రోగం. దేహం అంటూ ఉంటే రోగం తప్పక వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ దేహం సూక్ష్మాణువులతో రూపొందినట్లు నాకు కానవస్తున్నది” అని శ్రీరామకృష్ణులు చెప్పారు. తరువాత గిరీష్ వైపు తిరిగి, “నేను భగవంతుని అనేక రూపాలను గాంచుతున్నాను. దాన్లో ఇదీ (తాము) ఒకటై ఉంది” అని చెప్పారు.
మార్చ్ 15 వ తేదీ ఉదయం ఏడు గంటల సమయం. భక్తులతో హీన స్వరంలోను, కొన్ని సమయాలలో సైగతోను ఆయన మాట్లాడారు. నరేంద్రుడు, రాఖాల్, లాటు, పెద్దగోపాల్, మహేంద్రనాథ్ (‘మ’) మొదలైనవారు అప్పుడు అక్కడున్నారు.
శ్రీరామకృష్ణులు : నేను ఇప్పుడు ఏం చూస్తున్నానో తెలుసా? సమస్తమూ భగవంతుడే అయివున్నాడు. జీవరాసులన్నీ వేర్వేరు తోలు తిత్తుల మాదిరిగాను, భగవంతుడే వాటిలో ప్రవేశించి కాళ్ళు చేతులు తలలను కదలిస్తూవున్నట్లు చూస్తున్నాను.
ఒకింత సేపట్లో ఆయన సమాధిమగ్నులైనారు. ఆ తరువాత కాస్త ఆహారం స్వీకరించి, “ఇప్పుడు నాకు ఎలాంటి నొప్పీ లేదు” అని అన్నారు.
ఆ తరువాత భక్తులను ఆప్యాయంగా చూశారు. ఆయన కారుణ్యం వేలాది నదులలా పొంగిపొర్లి ప్రవహిస్తూన్నట్లు తోచింది. నరేంద్రుడు, రాఖాల్ల చెంపలను మాతృవాత్సల్యంతో నిమిరారు. కాసేపయ్యాక మహేంద్రనాథ్‌తో, “ఇప్పుడు ఈ దేహానికి వ్యాధి నయమై ఇంకా కొంతకాలం జీవింప అనుమతి లభిస్తే, అనేకులు ఆధ్యాత్మిక జాగృతం పొందుతారు” అని అన్నారు.
కొంతసేపు మౌనం పాటించి “కాని అది జరగదు. ఈసారి ఈ దేహం నిలవదు” అని అన్నారు.
రాఖాల్ : మీ దేహం ఇంకా కొంతకాలం నిలిచేటట్లు భగవంతుని ప్రార్థించండి.
శ్రీరామకృష్ణులు : అది భగవదేచ్ఛ.
నరేంద్రుడు : మీ మనస్సూ, భగవంతుని సంకల్పమూ ఒక్కటే కదా!
శ్రీరామకృష్ణులు ఒకింతసేపు మౌనంగా ఉండిపోయారు. పిదప, “అట్లే నేను ప్రార్థించినా ఏమీ జరగదు. నేనూ అమ్మా ఒక్కరమే అయినట్లు చూస్తున్నాను” అని అన్నారు.
కాసేపయ్యాక మళ్ళీ కొనసాగించారు : “దీన్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు అమ్మ. (కాసేపయ్యాక) అవును, ఒకరు ఆమె, మరొకరు ఆమె భక్తుడు. చెయ్యి విరిగిన వ్యక్తీ* , ఇప్పుడు వ్యాధిగ్రస్తుడూ భక్తుడే. మీకు అర్థమౌతున్నదా?”
భక్తులు మౌనంగా ఉండిపోయారు.
శ్రీరామకృష్ణులు : అయ్యో, ఇదంతా నేనెవరికి మొరపెట్టుకోగలను? ఎవరు నన్ను అర్థం చేసుకోగలరు? (కాసేపయ్యాక) భగవంతుడు మనిషిగా అవతరిస్తున్నాడు, భక్తులతో పాటు ఈ ఇలలోకి వస్తున్నాడు. ఆయన నిష్క్రమించేటప్పుడు భక్తులూ వెళ్ళిపోతారు.
రాఖాల్ : అందుకే మీరు మమ్మల్ని వదలిపెట్టి వెళ్ళవద్దని బ్రతిమాలు కొంటున్నాం.
శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వి, “వీథిగాయకులు హఠాత్తుగా వస్తారు. ఆడతారు, పాడతారు. వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడూ వారిని ఎవరూ గుర్తించరు, నిష్క్రమిస్తున్నప్పుడు వాళ్ళు ఫలానా అని ఎవరికీ తెలియరాదు” అని అన్నారు.
పలువురు వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం చూసి మాతృదేవి, దైవశక్తి మూలంగా శ్రీరామకృష్ణుల ప్రాణాలు కాపాడడానికి నిశ్చయించుకొన్నారు. కోరిన వరం ప్రసాదించే తారకేశ్వర శివాలయానికి వెళ్ళి తన భర్తను రక్షింప ఒక మార్గం లభించేవరకు ప్రాయోపవేశం పూని, దైవసన్నిధిలో ఉండిపోయారు. మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు పగటి వేళ గడిచిపోయింది. రాత్రయింది. ఆ రాత్రి అద్భుతమైన ఒక అనుభవం ఆమెకు కలిగింది. అసంఖ్యాక మట్టి కుండలను ఎవరో పగలగొట్టుతున్నట్లు ఒక శబ్దం వినవచ్చింది. ఆమెలో తీవ్రవైరాగ్యం జనించింది. ‘ఈ లోకంలో బాంధవ్యం అంటే ఏమిటి? ఒట్టి కలే కదా!’ అని ఆమె భావించారు. ఆమె కాశీపూర్కి తిరిగి వచ్చేసారు. శ్రీరామకృష్ణులు ఆమెను చూడగానే, ‘మంచిది, నువ్వెళ్ళిన పని ఏమైంది?’ అని అడిగారు. శారదాదేవి జరిగింది పూసగుచ్చినట్లు చెప్పారు. అదే జవాబును ఆయన ఎదురుచూసినట్లుంది.
ఒక రోజు పెద్దగోపాల్ కొన్ని కాషాయ వస్త్రాలను, రుద్రాక్షమాలలను మూటగాకట్టి శ్రీరామకృష్ణుల వద్దకు తెచ్చాడు. వాటిని ఉత్తమ సన్న్యాసులకు ఇవ్వగోరుతున్నట్లు చెప్పాడు. శ్రీరామకృష్ణులు తమ ముందున్న యువశిష్యులను చూపి, “వీరికంటే ఉత్తములైన సన్న్యాసులు ఎవరూ ఉండరు. వీరికే వాటిని ఇవ్వు” అని చెప్పారు. పెద్దగోపాల్ మూటను ఆయన ముందుపెట్టాడు. వాటిని భక్తులైన ఆ పన్నెండుమంది యువకులకు శ్రీరామకృష్ణులు అందించారు. ఒక కాషాయ వస్త్రమూ, ఒక రుద్రాక్ష మాలా మిగిలాయి. వాటిని గిరీష్ కోసం కేటాయించి ఉంచమన్నారు. “వైరాగ్య మనస్తత్వంలో గిరీష్ ఈ యువకులలో ఎవరికీ తీసిపోడు” అని చెప్పారు. ఒక రోజు సాయంత్రం సన్న్యాసానికైనా క్రతువు ఒకటి చేయమని, ఊళ్ళోకి వెళ్ళి భిక్షమెత్తి రమ్మన్నారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు రామకృష్ణ సన్న్యాస సంఘాన్ని ప్రారంభించారు.
నరేంద్రుడు ‘సత్యం’ తెలుసుకోవడంలో ఎంత అనురక్తుడై ఉన్నాడో, అందుకై రేయింబవళ్ళు అతడు ఏ రకంగా శ్రమించాడో మునుపే చూసివున్నాం. ఒక రోజు సాయంత్రం అతడు ధ్యానం చేస్తూవున్నప్పుడు హఠాత్తుగా అతడికి సమాధి అవస్థ కలిగింది. మొదట్లో అతడి తల వెనుక జ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా తన ఉనికినీ, బాహ్యజగత్తు ఉనికినీ కోల్పోయి సమాధిలో మగ్నుడైపోయాడు. ఇంద్రియాలను, మనస్సును, లోకాలను అతిక్రమించి చైతన్యమయమైన నిర్వికల్పసమాధిలో మగ్నుడైనాడు. చాలాసేపయిన తరువాత సమాధి స్థితిలో నుండి దిగివచ్చాక అతడికి తల మాత్రం ఉన్నట్లుగా, తక్కిన దేహం లేనట్లుగా తోచింది. కాబట్టి, “నా దేహం ఎక్కడ? దేహం ఎక్కడ?” అంటూ కేకలు పెట్టాడు. అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్ద గోపాల్, అతడి దేహాన్ని చూపి, “ఇదుగో ఉంది నరేన్, ఇదుగో ఉంది” అని చెప్పాడు. గోపాల్ మాటలు అతడి చెవినపడినట్లు లేదు. ముందు మాదిరే కేకలు పెట్టాడు. భయపడ్డ గోపాల్ మేడమీదికి పరుగెత్తి శ్రీరామకృష్ణులకు విషయం తెలిపాడు. గోపాల్ చెప్పింది ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు : “అదే స్థితిలో అతణ్ణి ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితికే అతడు చాలాకాలంగా నన్ను ఎంతో వేధిస్తున్నాడు.”
చాలాసేపు గడిచాక నరేంద్రుడు బాహ్యస్మృతిలోకి వచ్చాడు. కళ్ళు తెరవగానే తన చుట్టూ ఆందోళనతో కూర్చున్న సోదరశిష్యులు కనిపించారు. ఇంతకాలంగా అతడి మనస్సులో చెలరేగుతూవున్న తుపాను సమసిపోయింది, ప్రగాఢ శాంతి నెలకొంది. ఆ తరువాత శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. ఆయన ఆనందంగా అతణ్ణి చూస్తూ, “కాళీమాత ఇప్పుడు నీకు సమస్తం దర్శింపచేసింది. కాని ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేసి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్దే ఉంటుంది. నువ్వు జగజ్జనని కార్యాన్ని నిర్వర్తించిన తరువాత ఈ నిధిమళ్ళీ నీకు లభిస్తుంది; మళ్ళీ సమస్తం నువ్వు అనుభూతం చేసుకొంటావు” అని చెప్పారు.
ఈ రోజులలో జరిగిన ఒక సంఘటన మనస్సును కదలించి వేస్తుంది. శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి ఎంత అమితంగా ప్రేమించారో విశదపరచడంతో పాటు, తమ భవిష్యత్తు, భవిష్యత్ కార్యాన్ని అతడికి అప్పగించిన వైనం తెలిపే ఒక ముఖ్య సంఘటన ఇది. గురుదేవులకు, ఆయనను సేవించేవారికి అయ్యే ఖర్చును గృహస్థ భక్తులు భరిస్తూవచ్చారని ఇంతకు మునుపే తెలిపివున్నాం. యువభక్తులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని గృహస్థ భక్తులు భావించారు. ఇది రెండు వర్గాల మధ్య మనస్తాపానికి దారితీసింది. అది క్రమంగా పెరిగి శత్రుత్వంగా మారబోతున్నప్పుడు నరేంద్రుడు ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలిపాడు. నరేంద్రుని విచారాన్ని చూసి ఆయన, “ఓ, నా నరేన్, నీ భుజాల మీద నన్ను ఎక్కడకు తోడ్కొని వెళ్లినా, నేనక్కడకు వచ్చి వసిస్తాను” అన్నారు ఆప్యాయం ఉట్టిపడే స్వరంలో.
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు దొర్లిపోయాయి. శ్రీరామకృష్ణుల పరిస్థితి అంతకంతకూ దిగజారసాగింది. ఒక రోజు శ్రీరామకృష్ణులు, నరేంద్రునికి తమ ఇష్టమంత్రమైన రామనామంలో దీక్ష నొసగారు. నరేంద్రుడు ఆనంద పారవశ్యంలో తన్మయుడై, “రామా, రామా” అంటూ ఉచ్చరిస్తూ ఇంటిని పదేపదే చుట్టిచుట్టి రాసాగాడు. అతడి పారవశ్యస్థితిని చూసిన వారు, అతడిని సమీపించడానికే భయపడ్డారు. “రామా, రామా” అంటూ ఉచ్చరిస్తూ గంటల పర్యంతం అతడు చుట్టూ తిరిగిరావడం చూసి, శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిపారు. శ్రీరామకృష్ణులు, “అతణ్ణి ఆ స్థితిలోనే ఉండనివ్వండి. త్వరలోనే అతడు మాములు స్థితికి వస్తాడు.” అని అన్నారు. కొన్ని గంటల తరువాత క్రమంగా నరేంద్రుడు మామూలు స్థితిలోకి రాగలిగాడు.
దుర్గాచరణ్ (నాగమహాశయుడు) కాశీపూర్‌కు కొన్నిమార్లు వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించాడు. శ్రీరామకృష్ణులంటే అతడికి అచంచలమైన ప్రేమాభిమానాలుండేవి. ఆయన అనుభవిస్తున్న బాధను చూడలేక అతడు తరచు రావడం లేదు. ఒకసారి అతడు వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి తమ మంచం దగ్గరకు రమ్మన్నారు. “ఇలా చూడు, దుర్గాచరణ్! ఈ వ్యాధిని నయం చేయడం తమకు అసాధ్యమని డాక్టర్లు పెదవివిరిచారు. నువ్వు నయం చేయగలవా?” అని అడిగారు. నాగమహాశయుడు కాసేపు తీవ్రంగా యోచించాడు. ఆ తరువాత శ్రీరామకృష్ణుల వ్యాధిని యోగశక్తి ద్వారా తన దేహంలోకి రప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చి, వినమ్రంగా, “అవును, మీ వ్యాధిని ఎలా నయంచేయాలో నాకు తెలుసు. మీ అనుగ్రహంతో ఆ పనిని ఇప్పుడే చేసివేస్తాను” అని చెప్పి, ఆయనను సమీపించాడు. శ్రీరామకృష్ణులు అతడి భావాన్ని గ్రహించారు. వెంటనే అతణ్ణి ప్రక్కకు త్రోసివేసి, “నీకు సాధ్యమని నాకు తెలుసు. ఈ వ్యాధిని నువ్వు నయం చేయగలవు” అని అన్నారు.
శ్రీరామకృష్ణులకు వచ్చిన వ్యాధి అంటువ్యాధి అనే వదంతి వ్యాపించింది. దాంతో కొందరు ఆయనను సమీపించడానికి, సేవలు చేయడానికి సంకోచించారు. ఇది చూసి నరేంద్రుడు అందరినీ శ్రీరామకృష్ణుల గదిలో సమావేశపరిచాడు. ఆయన త్రాగి వదలివేసిన జావను అందరి సమక్షంలో త్రాగి, అది అంటువ్యాధి కాదని అందరికీ స్పష్టం చేశాడు.
ఒకసారి శ్రీరామకృష్ణులు ఒక కాగితం ముక్కమీద, “జై రాధే ప్రేమమయీ, నరేన్ లోకానికి ఉపదేశిస్తాడు. ప్రతి చోటికీ వెళ్ళి (సత్యాన్ని) ప్రచారం చేస్తాడు” అని వ్రాసి చూపారు. దానికి తన నిరసనను సూచిస్తూ నరేంద్రుడు, “అదంతా నాకు సాధ్యం కాదు” అని చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “నువ్వు చేసే తీరాలి” అని నొక్కి చెప్పారు.
ఒకనాటి సాయంత్రం నిరంజన్ మొదలైన యువభక్తులు తోటలో ఒక మూలగా ఉన్న ఈతచెట్టు నుండి రసం త్రాగే నిమిత్తం ఆ చెట్టును సమీపించారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తమ పరుపుమీద పడుకొని ఉన్నారు. కనీసం లేచి కూర్చోనంత బలహీనంగా ఉన్నారు. హఠాత్తుగా ఆయన లేచి, క్రిందికి దిగి పరుగెత్తారు. మాతృదేవి యాదృచ్ఛికంగా ఆ దృశ్యం చూసారు. ఆయన అలా లేచి పరుగెత్తడం నమ్మలేక, ఎందుకైనా మంచిదని ఆయన గదిలోకి వెళ్ళి చూద్దామనుకొని, అక్కడకు వెళ్ళారు. అక్కడ ఆయన లేరు. అయితే కాసేపట్లోనే వచ్చి పడుకొన్నారు. అదంతా విస్మయంతో చూస్తూన్న మాతృదేవి, ఆయన వద్దకెళ్ళి విషయం ఏమిటని అడిగారు. తాము పడక నుండి లేచి వెళ్ళిన విషయాన్ని ఖండిస్తూ, “నేను లేచి వెళ్ళడమా! అంతా నీ భ్రమే. వంటగదిలోనే సదా ఉండిపోవడంచేత నీ మెదడు వేడెక్కింది” అన్నారు. కాని మాతృదేవి అంతటితో వదలిపెట్టలేదు. పట్టుబట్టి అడిగినప్పుడు, నిరంజనాదులు వెళ్ళిన చోటువద్ద ఉన్న ఈతచెట్టు పొదలో ఒక నాగుపాము పొంచి ఉన్నట్లూ, దాన్ని పారద్రోలడానికే తాము వెళ్ళినట్లూ ఆయన చెప్పారు. ఇటువంటి సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వరాదనే ఆయన మొదట్లో ఆ విషయం చెప్పడానికి నిరాకరించి ఉండవచ్చు.
రోజులు దొర్లిపోతున్నాయి. యోగీన్ను పిలిచి పంచాంగాన్ని తీసుకురమ్మన్నారు. ఆగస్టు 9 వ తేదీ నుండి వరుసగా తిథులను, నక్షత్రాలను వాటి ఫలాలను చదవమన్నారు. నెల చివరి రోజు రాగానే, ఇక చదవవద్దని సైగ చేశారు.
ఈ సంఘటన జరిగి నాలుగైదు రోజులు గడిచాయి. ఒక రోజు శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి తమ ప్రక్కకు రమ్మని పిలిచారు. అప్పుడు గదిలో ఎవరూ లేరు. వారిద్దరే ఉన్నారు. ఆయన నరేంద్రుణ్ణి తన ఎదుట కూర్చోమని, అతణ్ణి తదేకంగా చూస్తూ సమాధిమగ్నులైనారు. కాసేపట్లో నరేంద్రుడు తన దేహంలో విద్యుచ్ఛక్తి వంటి ఒక శక్తి ప్రసరించడం గుర్తించాడు. మెల్లమెల్లగా అతడు కూడా బాహ్యస్మృతిని కోల్పోయాడు. తాను ఎంతసేపు అలా సమాధిమగ్నుడై ఉండిపోయాడో అతడికి తెలియరాలేదు. బాహ్యస్మృతి కలిగి కళ్ళు తెరచి చూసినప్పుడు శ్రీరామకృష్ణులు కన్నీటి ధారలలో మునిగి కూర్చుని ఉండడం కనిపించింది. నరేంద్రుడు అందుకు కారణమేమిటని అడిగినప్పుడు, “నా సమస్తాన్నీ నేడు నీకు ధారాదత్తం చేసి నేను బికారినైపోయాను. ఈ శక్తుల మూలంగా నువ్వు లోకానికి ఎంతో మేలు చేయబోతున్నావు. ఆ తరువాతే నువ్వు ఎక్కణ్ణుండి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోతావు” అని చెప్పారు. ఈ విధంగా తమ శక్తులను నరేంద్రునికి ధారాదత్తం చేసినందున ఇద్దరూ ఏకాత్ములైపోయారు. ఈ అనుసంధానం మూలంగా లోకానికి చేకూర్చిన మేలును నరేంద్రుడి ప్రస్తుత చరిత్ర చెప్పకనే చెబుతున్నది. రాబోయే చరిత్ర ఇంకా చెప్పవలసి ఉంది.
రెండు రోజులు గడిచిపోయాయి. తమను అవతారంగా శ్రీరామకృష్ణులు చెప్పడాన్ని పరీక్షించాలనే ఉద్దేశం నరేంద్రుడికి కలిగింది. నాడు ఎంతో బాధతో శ్రీరామకృష్ణులు అల్లల్లాడిపోతున్నారు. ‘ఈ భరించరాని బాధలో సైతం ఆయన తమను అవతారపురుషులని వ్యక్తం చేసుకొంటే, ఆయన నిజంగానే అవతార పురుషులని నమ్ముతాను’ అని మనస్సులో అనుకొన్నాడు నరేంద్రుడు. బాధతో త్రుళ్ళిపోతూ పడుకొని ఉన్న శ్రీరామకృష్ణులు ఆ క్షణంలోనే తన శక్తినంతా కూడదీసుకొని లేచి కూర్చుని స్పష్టంగా, “నరేన్, మునుపు ఎవరు రాముడిగా కృష్ణుడిగా అవతరించారో, ఆయనే ప్రస్తుతం రామకృష్ణుడుగా ఈ దేహంలో నెలకొని ఉన్నాడు; కాని నీ వేదాంత ధోరణిలో కాదు” అని అన్నారు. ఎన్నో దివ్య దర్శనాలను, శక్తులను ఆయనలో దర్శించిన పిదప కూడా తనకు ఇంకా ఆ సందేహం నివృత్తి కానందున నరేంద్రుడు సిగ్గుపడ్డాడు, అవమానం చెందాడు.
ఆగస్టు 15 వ తేది. ఏ రోజు రాకూడదని భక్తులు ఆశించారో, ఆ రోజు, భక్తులను దుఃఖసాగరంలో ముంచబోయే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆదివారం. శ్రీరామకృష్ణుల బాధ ఎంతో తీవ్రరూపం దాల్చింది. ఆయన నాడి సక్రమంగా కొట్టుకోవడం లేదు. నాడి చూడడంలో నిష్ణాతుడని ఎవరిని శ్రీరామకృష్ణులు ప్రశంసిస్తారో ఆ భక్తుడైన అతుల్ ఆయన నాడి పరీక్షించి, ఆయన పరిస్థితి బాగా దిగజారిపోయినట్లు గ్రహించాడు. చుట్టూవున్న వారితో, ఆయన ఇక బ్రతకడం కష్టమనీ, ఎంతో అప్రమత్తంగా ఉండమనీ చెప్పాడు. సూర్యాస్తమయం కావడానికి ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంది. శ్రీరామకృష్ణులు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. భారంగా ఊపిరి పీలుస్తున్నారు. భక్తులు వెక్కివెక్కి ఏడ్వ సాగారు. తమ జీవితాల్లో ఏ జ్యోతి ఆనందాన్ని నింపుతూ వస్తూన్నదో అది ఆరిపోబోతున్నదని ఎరిగి అందరూ శ్రీరామకృష్ణుల చుట్టూ గుమిగూడారు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు ఆకలి వేస్తోంది అని అన్నారు. కొంచెం ద్రవాహారం ఇచ్చారు. కాని ఆయన మ్రింగలేక పోయారు. ఎంతో కష్టం మీద ఒకింత పుచ్చుకోగలిగారు. నోరు తుడిచి, మెల్లగా ఆయనను పడుకోబెట్టారు. రెండు కాళ్ళను చాపి, దిండు మీద పెట్టారు. ఇద్దరు విసరసాగారు. పడుకొన్న కాసేపట్లో హఠాత్తుగా ఆయన సమాధిమగ్నులైనారు. దేహం నిశ్చలంగా, శిలలా మారి పోయింది. ఊపిరి ఆగిపోయింది. ఇన్ని రోజులుగా రేయింబవళ్ళు ప్రక్కనే ఉంటూ సేవలు చేస్తూవచ్చిన శశికి (కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద)ఈ సమాధి స్థితి, మామూలుగా ఆయనకు కలిగే సమాధ్యవస్థగా తోచలేదు. ఏదో గొప్పమార్పు వచ్చినట్లు కానరాగా, ఏడ్వనారంభించాడు. నరేంద్రుడు అందరిని, “హరి ఓం తత్సత్” అని ఉచ్చరించమన్నాడు. చాలాసేపటి వరకు వారంతా అట్లే ఉచ్చరించారు. కలకత్తా నుండి గిరీష్‌ను, రాంచంద్రను తోడ్కొని రావడానికి మనుషులు పరుగెత్తారు.
అర్ధరాత్రి దాటాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి వచ్చింది. ఎంతో ఆకలి వేస్తున్నదన్నారు. సాయంపట్టి లేచికూర్చోబెట్టారు. ఒక పాత్రనిండా జావ ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ జావను అంతా సులభంగా త్రాగివేశారు. ఆయన ఇంత ఆహారం పుచ్చుకొని ఎన్నో రోజులయింది. ఆహారం పుచ్చుకొన్న తరువాత ఒంట్లో కాస్త బాగుందన్నారు. ఆయన నిద్రకు ఉప్రకమిస్తే బాగుంటుందని నరేంద్రుడు అన్నాడు. బాధ కారణం వల్ల ఎంతో హీనస్వరంలో మాట్లాడే ఆయన బిగ్గరగా, ‘అమ్మ కాళీ’ అంటూ మూడుసార్లు ఉచ్చరించారు. పిదప మెల్లగా పడుకొన్నారు. ఆ తరువాత నరేంద్రుడు విశ్రాంతికై క్రిందికి వెళ్ళాడు.
అప్పుడు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు. మంచం మీద పడుకొని ఉన్న శ్రీరామకృష్ణుల ఒంట్లో హఠాత్తుగా పారవశ్యం కలిగింది. రోమాంచమైంది. దృష్టి నాసికాగ్రంలో నిలిచింది. పెదవులపై చిరునవ్వు వికసించింది. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఇది ఇంతకాలంగా ఆయన మునిగి తేలుతూ వచ్చిన మామూలు సమాధి కాదు, మహాసమాధి; కాళీమాత ఒడిలో ఆమె అనుంగు పుత్రుడు శాశ్వతంగా లీనమైపోయిన ప్రగాఢ సమాధి! ఈ సమాధి అనంతరం ఆయన ప్రాణం దేహంలోకి తిరిగి రాలేదు. అది 1886 వ సం ॥ ఆగస్టు 16 వ తేది.
కొంతసేపట్లో గిరీష్, రాంచంద్రలు వచ్చారు. ఈ శోకవార్త కలకత్తా అంతటా వ్యాపించింది. ఉదయం కెప్టెన్ విశ్వనాథ్ వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణుల దేహం చూసి, “దేహంలో కొంత వేడి ఉంది” అని చెప్పి, వెన్నెముకను బాగా తోమాడు. ఇంకా అంతా ముగిసిపోలేదు, శ్రీరామకృష్ణులు సమాధిస్థితిలోనే ఉన్నారనీ, అంత్యక్రియలు వెంటనే ప్రారంభించవద్దనీ చెప్పాడు. ఆ తరువాత డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ వచ్చాడు. శ్రీరామకృష్ణుల శరీరాన్ని నిశితంగా పరీక్షించి ప్రాణం పోయిందని తేల్చిచెప్పాడు.
వార్త తెలియగానే మాతృదేవి, గురుదేవుల పడక వద్దకు పరుగున వచ్చి, “అమ్మా, కాళీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు?” అంటూ విలపించారు. ఆ దృశ్యం చూసి అందరి హృదయాలు ద్రవించిపోయాయి. ఆమెను క్రిందికి తోడ్కొని వచ్చారు. నాటి సాయంత్రం మాతృదేవి తన సుమంగళీ రూపాన్ని చెరిపివేయడం కోసం తాను ధరించివున్న బంగారు గాజులను తీసివేయ ప్రయత్నించారు. అప్పుడు ఆమె ముందు శ్రీరామకృష్ణులు కనిపించి, “నేను ఎక్కడకు వెళ్ళిపోయాను? ఇదుగో ఇక్కడే ఉన్నాను. ఒక గదిలో నుండి మరొక గదిలోకిపోయాను, అంతే” అని చెప్పి, మాతృదేవి వితంతురూపం దాల్చకుండా ఆపారు. తదనంతర కాలంలో రెండుసార్లు మాతృదేవి గాజులు తీసివేయ ప్రయత్నించినప్పుడు, శ్రీరామకృష్ణులు కనిపించి ఆ విధంగానే ఆ ప్రయత్నాన్ని ఆపించారు. ఆ తరువాత మాతృదేవి జీవిత పర్యంతం గాజులు తీసివేయకుండానే సుమంగళీరూపంలోనే జీవించారు.
ఆగస్టు 16 వ తేది సాయంత్రం ఐదుగంటలు. శ్రీరామకృష్ణుల పావన దేహాన్ని మేడమీద నుండి క్రిందకి తీసుకువచ్చి, మంచంమీద ఉంచారు. కాషాయ వస్త్రంతో ఆచ్ఛాదింపబడి, చందనపుష్పాలతో అలంకరింపబడింది. ఆరు గంటలకు కాశీపూర్ శ్మశానవాటికకు భక్తిపాటలు పాడుతూ గురుదేవుల భౌతిక కాయాన్ని తీసుకువెళ్ళారు. శ్మశానానికి వెళ్ళగానే అక్కడ పేర్చబడివున్న చితిమీద ఉంచారు. త్రైలోక్యనాథ్ సన్యాల్ మనస్సును ద్రవింపచేసే పాటలు కొన్ని పాడాడు. చితికి కొరివి అంటించారు. రెండు గంటల లోపే అంతా ముగిసిపోయింది.
భక్తుల మనస్సులలో ఒక గంభీర ప్రశాంతత నెలకొంది. వారి శోకతప్త హృదయాలు ఊరడిల్లాయి; ‘గురుదేవులు నిష్క్రమించలేదు. మా ఆత్మలలోనే సంలీనమైపోయారు’ అనే ప్రగాఢనమ్మకం వారిలో కలిగింది. శ్రీరామకృష్ణుల పావన చితాభస్మాన్ని ఒక కలశంలో సేకరించి, వేలాది మధుర జ్ఞాపకాలు పొంగిపొర్లగా ‘జై శ్రీరామకృష్ణా!’ అంటూ ఉచ్చరిస్తూ కాశీపూర్ ఇంటికి తిరిగి వచ్చారు.
శ్రీరామకృష్ణుల అస్థికలను ఎక్కడ ఉంచి ఆరాధించాలి అన్న పెద్ద ప్రశ్న అప్పుడు తలెత్తింది. తర్జనభర్జనానంతరం కలకత్తాకు వెలుపల ఉన్న కాంకూర్గాఛి అనే చోట రామచంద్రకు సొంతమైన తోటలో ఉంచి, దేవాలయం నిర్మింప గృహస్థ భక్తులు నిశ్చయించారు. శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో ఈ తోటకు వచ్చివుండడం వారి ఆ నిర్ణయానికి ఒక కారణమైంది. కాని శ్రీరామకృష్ణుల సన్న్యాస భక్తులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. వారు అస్థికలలో అత్యధిక భాగం బలరాం ఇంటికి పంపి, అక్కడ సక్రమంగా ఆరాధించేలా చేశారు. భవిష్యత్ కాలంలో గంగాతీరాన స్థలం కొనుగోలుచేసి అక్కడ శ్రీరామకృష్ణుల ఆలయం నిర్మించాలన్నది వారి అభిప్రాయం. మిగిలిన అస్థుకలను శ్రీకృష్ణ జయంతి నాడు కాంకూర్గాఛికి తీసుకువెళ్ళారు. శశి ఈ అస్థికల కలశాన్ని తలమీద మోసుకొంటూ వెళ్ళాడు. సన్న్యాస శిష్యులందరూ, భక్తులూ కూడా వెళ్ళారు. కాంకూర్గాఛిలో అస్థుకలను ఉంచి, ఆలయం నిర్మించి, సక్రమంగా అనునిత్యం పూజాదికాలు నిర్వర్తించేలా రాం ఏర్పాట్లు చేశాడు.
శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడు కొందరు శిష్యులు, నిరంతరం ఆయనతోనే కాశీపూర్ ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇంటి అద్దె ఇచ్చుకోలేని పరిస్థితిలో ఎక్కడకు పోవాలో వారికి అర్థంకాలేదు. గృహస్థ భక్తులు వారికోసం ధనం వెచ్చించడానికి సిద్ధంగాలేరు. వారిని తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోయి చదువు కొనసాగించి, చక్కని భక్తులుగా జీవించమని కొందరు గృహస్థ భక్తులు ఉపదేశించారు. కాని మూర్తీభవించిన సన్న్యాసిగా జీవించిన శ్రీరామకృష్ణుల వద్ద శిక్షణ పొందిన ఆ యువశిష్యుల మనస్సులు మళ్ళీ లౌకిక జీవితాన్ని అభిలషించ లేదు. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల భక్తుడైన సురేంద్రనాథ్ మిత్ర వారికి తోడుగా నిలిచాడు. అతడు నరేంద్రునితో, “నరేన్, మీరంతా ఎక్కడకు పోతారు? ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ఉండండి. లౌకిక క్లేశాలలో వాడిపోతున్న మేమూ అప్పుడప్పుడు అక్కడకు వస్తాం; మా దుఃఖాలను బాపే ఒక శరణాలయంగా ఆ ఇల్లు ఉంటుంది. శ్రీరామకృష్ణుల ఖర్చులకై నేను ఏదో నా శక్తిమేరకు కొంత ఇస్తూవచ్చాను. దాన్ని ఇకమీదట మీకు ఇస్తాను” అని అన్నాడు. అతడి సహాయంతో బారానగర్ అనే పేటలో ఒక ఇంటిని అద్దెకు కుదుర్చుకొన్నారు. దాన్లో బసచేస్తూ, శ్రీరామకృష్ణుల అనుగ్రహాన్ని తోడుగా చేసుకొని ఆ యువశిష్యులు కఠోర తపస్సు చేశారు. అదే ప్రప్రథమ రామకృష్ణ మఠం. అదే నేడు ఆకాశాన్ని అంటుతూన్న మహావృక్షంగా ఎదిగి లోకవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఆధ్యాత్మిక పిపాసువులకూ, సంసార అనలంలో దహింపబడుతున్న వారికీ తన చల్లని నీడలో ఆశ్రయం ఇస్తున్నది.
కొన్ని అంశాలు
యోగీన్మా నుండి విన్నవి :
మాతృదేవి దక్షిణేశ్వరంలో వసిస్తూవున్న రోజుల్లో శ్రీరామకృష్ణులు అనేక విషయాలలో ఆమె అభిప్రాయాన్ని అడిగేవారు. కాని మాతృదేవి, “మన్నించండి. కాసేపయ్యాక చెబుతాను” అని చెప్పేవారు.
అందుకు శ్రీరామకృష్ణులు, “ఎందుకు, ఇప్పుడే చెప్పకూడదా? ఎవరితో కలిసి ఆలోచించదలచుకొన్నావు?” అని అడిగేవారు.
అప్పుడు ఆమె, “కాస్త ఆగండి. నేను కాస్త యోచించి మీతో మాట్లాడతాను” అని చెప్పేవారు.
పిదప తిన్నగా నహబత్కు వచ్చి జగజ్జననితో, “అమ్మా, నేను ఏం చెప్పాలో అనుగ్రహించి తెలియచెయ్యి” అని హృదయపూర్వకంగా ప్రార్థించేవారు. ఆ ప్రార్థన ఫలితంగా ఆమెకు లభించే జవాబును అట్లే శ్రీరామకృష్ణులకు విన్నవించేవారు.
శ్రీరామకృష్ణులు కాశీపూర్‌లో వ్యాధి తీవ్రతతో బాధపడుతున్నప్పుడు మాతృదేవి పొందిన దుఃఖం వర్ణనాతీతం. ఒక రోజు ఆమెకు ఒక దర్శనం కలిగింది. పొడవైన జడతోవున్న కారునలుపు స్త్రీ కనిపించి ఆమె ప్రక్కన కూర్చుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవియే అని తెలుసుకొన్న మాతృదేవి, “ఓ, నువ్వు వచ్చేశావా!” అని ఆశ్చర్యబోతూ అడిగింది.
“అవును. నేను దక్షిణేశ్వరం నుండి వస్తున్నాను” అన్నది దేవి. కాసేపు సంభాషణ కొనసాగింది. అప్పుడు కాళికాదేవి కంఠం కాస్త వంగి వుండడం మాతృదేవి చూశారు. వెంటనే, “నీ కంఠానికి ఏమైంది, అమ్మా?” అని అడిగారు.
కాళి : ‘నా కంఠంలో వ్రణం వచ్చింది’ అని అన్నది.
మాతృదేవి : ఓ దేవుడా, గురుదేవులకే గొంతులో పుండు అనుకుంటుంటే అది నీకూ వచ్చేసిందే!’ అని మాతృదేవి ఆశ్చర్యపడ్డారు.
కాళి : ‘అవును’ అని ధ్రువపరచింది.
ఈ విధంగా గురుదేవులూ, కాళికాదేవి అభిన్నులని మాతృదేవికి తెలియవచ్చింది.
సామాన్యంగా రాందయాళ్ (కుటుంబ పురోహితుడు) లేదా ‘మ’ వీరే దక్షిణేశ్వరంలో కీర్తనకు ఏర్పాట్లు చేసేవారు. ఒకసారి ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు శ్రీరామకృష్ణులు హరిపాదుణ్ణి పంపి యోగీన్మా, కృష్ణభావిని మొదలైన వారిని ఆహ్వానించారు. నాడు కీర్తన రక్తికట్టలేదు. గాయకుని హావభావాలు చూస్తే అతడు ఎవరితోనో దెబ్బలాడుతూన్నట్లుగా అనిపించింది. శ్రీరామకృష్ణులకు భావపారవశ్యమే జనించలేదు. ఆయన ఇతరులతో మాట్లాడసాగారు.
కీర్తన ముగిశాక ఆయన రాంతో, “రాం, కీర్తన జరుగుతున్నప్పుడు మీరెవరూ నృత్యం చేయలేదు, ఎందుకని?” అని అడిగారు.
అందుకు రాం, “కోతులు ఎక్కడన్నా తమంత తామే నృత్యం చేస్తాయా? మీరు నృత్యం చేయలేదు, మేం ఎలా చేయగలం?” అని అడిగాడు.
తరువాత శ్రీరామకృష్ణులు భక్తురాండ్రతో వెళ్ళి జగజ్జననిని ఆరాధించమని చెప్పారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆకుపచ్చ చొక్కాధరించి భక్తులతో ఈ క్రింద పాటను పాడుతూ, నృత్యం చేయసాగారు.
నా మాయీ నల్లనిదా?
కాళరూపి దిగంబరి…
యోగీన్మా, ఇతరులు గదిలోకి వచ్చి ఒక మూల నిలబడ్డారు. రాత్రి తొమ్మిది గంటలు అయినప్పటికీ ఆయన భావపారవశ్య స్థితి ఉపశమించలేదు.
ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని యోగీన్మా ఆదుర్దాపడసాగింది. ఎందుకంటే, చాలా ఆలస్యంగా పోతే భావిని తల్లి ఒక రగడనే లేవదీస్తుంది.హరిపదునితో వాళ్ళు బయలుదేర సిద్ధమైనారు. పారవశ్య స్థితిలో గురుదేవులు హఠాత్తుగా ఒక కేక వేశారు. ఆ తరువాత మామూలు స్థితిలోకి ఆయన వచ్చాక, “ఎవరది, ప్రసాదం పుచ్చుకోకుండా వెళుతున్నది?” అని అడిగారు. “మేమే బయలుదేరుతున్నామండి” అన్నాడు హరిపదుడు. శ్రీరామకృష్ణులు, అతడికీ యోగీన్మా తదితరులకూ ప్రసాదం ఇచ్చారు. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది.
ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు, గోలాప్మా తదితరులతో కలకత్తాలోని ఈడెన్ ఉద్యానానికి శిల్పప్రతీకలను (Masonic symbols) తిలకింప వెళ్ళారు. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలయి ఉంటుంది. అందరికీ ఆకలి దప్పులు. ఒక భక్తుడు రెండు పైసలకు మిఠాయి కొని తెచ్చాడు. దానిని అతడు గురుదేవులకు ఇచ్చాడు. ఆయన దానిని ఆరగించి ఒక గ్లాసు నీరు త్రాగారు. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడున్న అందరి ఆకలిదప్పులు తీరిపోయాయి. శ్రీరామకృష్ణులు ఒకింత ప్రసాదం ఇస్తారని ఎదురుచూసిన ‘గోలాప్మా’ కు ఇప్పుడు గొంతువరకు తిన్నట్లుగా అనిపించింది. శ్రీరామకృష్ణుల తృప్తి అందరినీ తృప్తిపరచింది. విస్మయంలో మునిగిపోయిన వాళ్ళు ఆ విషయం ఆయనతో చెప్పారు.
ఒక సందర్భంలో యోగీన్మా మనస్సు ఎంతో చంచల స్థితికి లోనైంది. తన సమస్యను గురుదేవులకు తెలుపాలనుకొన్నది. ఒక రోజు వేకువన కాలి నడకనే దక్షిణేశ్వరానికి బయలుదేరింది. అక్కడకు వెళ్ళినప్పుడు గోపాలుని తల్లి అక్కడ ఉండడం చూసింది.
శ్రీరామకృష్ణులు ఉత్తర వసారా గోడను ఆనుకొని నిలబడి ఉన్నారు. ఆయనను చూడగానే యోగీన్మా విచారమూ, చంచలతా ఎగిరిపోయాయి.
యోగీన్మా తోట నుండి కొన్ని పువ్వులు సేకరించి తన చీరచెంగున ముడివేసుకొంది. అది చూసి శ్రీరామకృష్ణులు అదేమిటని అడిగారు. యోగీన్మా పువ్వులు చూపించి, ఆయన పాదపద్మాలకు వాటిని సమర్పించింది. శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో తన పాదాన్ని యోగీన్మా తలమీద ఉంచారు. పక్కనే నిలబడి ఉన్న గోపాలుని తల్లి ఆ పాదాన్ని హృదయానికి హత్తుకోమని చెప్పింది. యోగీన్మా అట్లే చేసింది.
శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం ఒక రోజు యోగీన్మా జపం చేసుకొంటూవుంది. అప్పుడు ఆమెకు అశరీరవాణి, “నీ హృదయంలో గదాధరుని పాదపద్మాల ముద్ర నెలకొని ఉంది” అని పలికిన మాటలు వినిపించాయి.
గోలాప్మా నుండి విన్నది :
ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణులు కాళికాలయ ఉద్యానంలో పచార్లు చేస్తున్నారు. అప్పుడు ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారు. ఆయనను చూసిన ‘గోలాప్మా’ కు సాక్షాత్తు కాళికాదేవియే పచార్లు చేస్తున్నట్లు అనిపించింది. గోలాప్మా దేహం రోమాంచితమైంది.
ఒక రోజు పెద్ద గోపాల్ వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు. వస్తువులు కొన్న తరువాత ఒక వస్త్రం కొని వాటిని దాన్లో మూటగా కట్టి తెచ్చాడు. అతడు వేసిన ముడిని విప్పడానికి ఎంతో శ్రమపడవలసి వచ్చిందని గోలాప్మా, శ్రీరామకృష్ణులకు చెప్పింది. వస్తువులు చాలా ఉన్నాయని చూసి ఆయన, మాతృదేవితో, “ఎందుకు గోపాల్‌తో ఇన్ని వస్తువులు తెమ్మని చెప్పావు?” అని అడిగారు. వారి సంభాషణ ఇలా సాగింది.
మాతృదేవి :నేను ఏం చేయగలను! ఎంతో మంది భక్తులున్నారు.
శ్రీరామకృష్ణులు : కాళికాలయంలో భక్తుల భోజనాలకు ఏర్పాట్లు జరిగి ఉంటాయని తెలిసే ఎందుకింత ఖర్చు పెట్టించావు! నిత్యం ఇలా ఎక్కువ సేపు వంటి ఇంట్లోనే నిలబడి రెండు పూటలా వండితే, ఉష్ణం అధికరించి నీ ఆరోగ్యం పాడైపోదా? ఇంత ఎక్కువగా వండవద్దు. నేను ఇవన్నీ తినబోను.
చెప్పినట్లే ఆయన వాటిలో ఏదీ తినలేదు. కనుక వండిన వంటకాలన్నింటినీ ఆలయ వంటశాలకు పంపటం జరిగింది. మాతృదేవి విచారం వర్ణనాతీతం. వెక్కివెక్కి ఆమె ఏడ్చారు.
శ్రీరామకృష్ణులు ఆమెను ఇలా అనునయించారు : “ఇది శక్తికి మించిన శ్రమ అని నీకు తెలియదా? నీ ఆరోగ్యం గురించే నేను ఆవిధంగా మాట్లాడాను. ఇక ప్రత్యేకించి ఏ ఆహారాన్ని వండమనీ నీతో చెప్పకూడదని నిర్ణయించుకొన్నాను. ‘లభించింది తినడం’ అనే ధోరణి పాటిస్తాను. నీకుగా నువ్వు ఏదన్నా వండాలనుకొంటే చెయ్యి, కాని నా కేది ఇష్టమని మాత్రం అడగవద్దు.”
స్వామి రామకృష్ణానంద నుండి విన్నది :
ఒక రోజు గోపాలుని తల్లి ఆకు వేసి, అన్నం వడ్డించబోయింది. గాలి వీచి ఆకు జరిగిపోవడంతో, అన్నం వడ్డించలేకపోయింది. హఠాత్తుగా అక్కడ ఒక కుఱ్ఱాడు వచ్చి ఆకును పట్టుకొన్నాడు. ఆమె అన్నం వడ్డించింది. ఆ తరువాత, “అవును, ఈ అబ్బాయి ఎవరు?” అని యోచిస్తూ అతడి కేసి చూసింది. అక్కడ ఎవరూ లేరు.
కిషోరీ మోహన్‌రాయ్ నుండి విన్నది :
ఒకే గురువు వద్ద నుండి దీక్ష పొందాలని నేనూ, నా భార్య అనుకొన్నాం. ఒకసారి నా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఒక రోజు నేను కార్యాలయంలో ఉన్నప్పుడు ఆమె నుండి ఒక ఉత్తరం వచ్చింది. నా భార్య, తన తల్లితో మరో గురువు వద్ద దీక్ష పుచ్చుకోబోతున్నట్లు, అందుకై నన్ను డబ్బు పంపమని ఆ ఉత్తరంలో వ్రాసి ఉంది. నేను ఎంతో విచారిస్తూ కాశీపూర్‌కు వెళ్ళాను.
నాడు ‘అ’ ద్వారం వద్ద కాపలా కాస్తున్నాడు. నన్ను లోపలకు వెళ్ళకూడదని అడ్డగించాడు. నేను రెండడుగులు ముందుకు వేసేసరికి, తిట్టడం ప్రారంభించాడు. నాలోని శోకం దుర్భరమై కన్నీరుమున్నీరయ్యాను. మనస్సు వికలమైపోగా నేను తిరిగి వెళ్ళ ఉద్యమించినప్పుడు స్వామీజీ (నరేంద్రుడు) నన్ను చూడడం తటస్థించింది. వెంటనే ఆయన నా వద్దకొచ్చి, “ఏమిటి, ఇలా విచారంగా ఉన్నారు?” అని అడిగారు. నేను విషయం చెప్పాను. అందుకు ఆయన, “ఇవాళ ఏమిటో తెలియడం లేదు, అంతా గందరగోళంగా ఉంది. ఇంతవరకు (మధ్యాహ్నం 3 గం ॥) శ్రీరామకృష్ణులు భోజనం చేయలేదు. అనవసరమైన వ్యక్తులు కొందరు చెప్పా పెట్టకుండా ఆయన గదిలోకి వచ్చి ఆయనకు ఎంతో ఇబ్బంది కలిగించారు. ‘అ’ మూర్ఖుడు. జరిగింది మీతో చెప్పివుండవచ్చు. పోనివ్వండి, మీరు గురుదేవులను చూడాలా? ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషించి ఒకవేళ మీ చేతుల మీదుగా ఏదైనా తినవచ్చేమో! భక్తులను ఆయన ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలుసుకదా!” అనిచెప్పారు.
లోపలికి పోవాలని నేను అంతగా అనుకోవడం లేదు. కాని స్వామీజీ విడిచి పెట్టలేదు. ‘అ’ ను మందలించి నన్ను మెట్లు ఎక్కి వెళ్ళమన్నారు. నేను మరోదారి లేక మెట్లు ఎక్కి శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళాను. గుమ్మం వద్ద నుండే ఆయనకు మొక్కి, తిరిగి రాబోయాను. కాని ఆయన నన్ను దగ్గరకు రమ్మన్నారు. “మీ కావలి మనిషి ఊరుకోడు” అని అన్నాను. వెంటనే ఆయన (అతడేమీ చేయలేడనే ధోరణిలో విసుగ్గా) బొటనవ్రేలిని కదిలించి, నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు. పిదప తమ గొంతును చూపారు. “మహాశయా, మీరు నేడు ఎంత శుష్కించిపోయి కనబడుతున్నారో తెలుసా? మీరు ఏమీ తినలేదనిపిస్తోంది. నేను కొంచెం ఆహారం తీసుకురానా?” అని అడిగాను. ఆయన గదిలో రవ్వపాయసం సిద్ధంగా ఉంది. కాస్త వేడి చేయించి, దాన్ని పుచ్చుకొన్నారు. ఆ తరువాత, “ఇప్పుడు ఉసిరికాయ లభిస్తుందా? కాస్త తీసుకురాగలవా?” అని నన్ను అడిగారు. పిదప సురేష్ మిత్ర భార్య దీక్ష పుచ్చుకోవడం గురించి నాకు చెప్పమని పెద్దగోపాల్తో చెప్పారు. నేను నిర్ఘాంత పోయాను.
పెద్దగోపాల్ ఇలా అన్నాడు : “సురేష్‌బాబు సతీమణి ఒక ఫలానా గురువు వద్ద దీక్షపొందగోరింది. కాని సురేష్ అందుకు అనుమతించలేదు. కనుక ఇద్దరి మధ్య మనస్తాపం ఏర్పడింది. ఈ విషయం గురుదేవులకు తెలియవచ్చింది. ఒక రోజు శ్రీరామకృష్ణులు సురేష్‌బాబుతో, ‘సురేష్, మీ సతీమణి భ్రష్టుపట్టిపోతే మీరు ఏం చేయగలరు?’ అని అడిగారు. అందుకు సురేష్‌బాబు, ‘ఆమె కోరుకొంటే నేనెలా అడ్డగించగలను’ అని చెప్పాడు. వెంటనే గురుదేవులు, ‘చూశావా, అటువంటప్పుడు మంచిపనిని ఎందుకు ఆపుతున్నావు? దీక్షపొందడం మంచిపనే కదా!’ అని చెప్పారు.”
నాకు కావలసిన జవాబు లభించింది.
జయచంద్ర మిత్ర నుండి విన్నది :
(నేను ప్రప్రథమంగా హరితో కలిసి గురుదేవుల వద్దకు వెళ్ళాను.) హరి ఇంట్లో లేనందున రెండవసారి ఒంటరిగానే వెళ్ళాను. శ్రీరామకృష్ణులు నన్ను దక్షిణవైపు వసారాలోకి తోడ్కొని వెళ్ళారు. నా హృదయాన్ని, నాలుకను వ్రేళ్ళతో స్పృశించారు. తదుపరి సంభాషణ ఇలా సాగింది.
గురుదేవులు : “నీ ఇష్టదేవతగా ఎవరిని భావిస్తున్నావు?”
నేను ఏమీ మాట్లాడలేదు.
గురుదేవులు : “ఓ, చెప్పడం ఇష్టంలేదన్నమాట! ఫరవాలేదు. (కాళీని చూపుతూ) ఈమెను ఇష్టపడుతున్నావు. అంతేనా!”
నేను “ఊ” అని తల ఊపగానే గురుదేవులు ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించారు. పిదప ఆయనతో నేను, ‘మహాశయా, మీరు నాకు దీక్షనిచ్చారు. ఇందువలన నా కులగురువు విచారిస్తే నాకు హాని వాటిల్లదా?’ అని అడిగాను.
గురుదేవులు : ఏముంది, ఆయన నుండి కూడా ఒక మంత్రాన్నితీసుకో. అందుకు ఇష్టంలేకపోతే ఆయనకు మామూలుగా ఇచ్చే దక్షిణ ఇచ్చివెయ్యి.
ఆ తరువాత గురుదేవులు నాకు తినడానికి మంచి ఆహారం ఇచ్చారు. పగలంతా అక్కడే గడిపి ఇంటికి తిరిగి వెళ్ళాను.
అతుల్‌చంద్ర ఘోష్ (గిరీష్ తమ్ముడు) నుండి విన్నది :
ఉత్తర కలకత్తాలోని దీనుబాబు ఇంటికి గురుదేవులు ఒకసారి విచ్చేశారు. మా పెద్ద అన్నగారు గిరీష్ ఆయనను చూడడానికి వెళ్ళాడు. మా అన్న రాగానే నేను “ఆయన ఎటువంటివారు?” అని అడిగాను.
“ఒక కపటి” అని జవాబిచ్చాడు.
నేను మళ్ళీ ఏ ప్రశ్నావేయకూడదనే ఉద్దేశంతోనే అలా జవాబిచ్చాడు. కాని మా అన్న దక్షిణేశ్వరానికి తరచు వెళ్ళసాగాడు. అంతేకాదు ఆయన, దేవేన్బాబు రహస్యంగా గురుదేవుల గురించి మాట్లాడుకొంటూ ఉంటారు. నాతో ఏమీ చెప్పరు.
1885, మార్చ్ నెలలో ఒక రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు అన్నగారు, దేవేన్బాబు, హరిపదుడు అలవాటు ప్రకారం మాట్లాడుకొంటున్నారు. “ఏమిటి మీలో మీరు ఏం మాట్లాడుకొంటున్నారు? పరమహంసగారి గురించా? ఆయన పరమహంస కాదు, రాజహంస. ఎర్రంచు ధోవతి ధరిస్తారు, అందమైన చొక్కాలు వేసుకొంటారు, పాలిష్ చేసిన చెప్పులు ధరిస్తారు, సుఖాసనంలో నిద్రిస్తారు” అన్నాను నేను.
ఇలా మాట్లాడుకొంటున్నప్పుడు గురుదేవులు, నారాయణ్‌తో అక్కడకు వచ్చారు. రాగానే, “గిరీష్, భగవంతుని అనుగ్రహం వల్లనే మీ వద్దకు రాగలిగాను” అని అన్నారు. ప్రాంగణం దాటి, మెట్లు ఎక్కి వచ్చి, ఆయన మాట్లాడేవరకు, మేం ఎవరం ఆయనను గమనించలేదు. మా అన్న, ఇతరులు ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ‘బ్రాహ్మణులకు సముచిత గౌరవం ఇవ్వాలి’ అన్నదే మా సంప్రదాయం. అందువల్ల నేనూ చేతులు జోడించి ఆయనకు నమస్కరించాను. గురుదేవులు కూర్చున్నారు. మా అన్న ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. ఇతరులు ఆయన చుట్టూ కూర్చున్నారు.
మా అన్న నన్ను ఆయనకు పరిచయం చేసి, “ఇతడు నా చిన్న తమ్ముడు, ఇప్పుడే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు” అని చెప్పాడు. పిదప నన్ను చూసి, “ఇప్పుడెందుకు మౌనం వహించావు. ఆయనను చూడగానే తన్మయుడవై పోయావా?” అని అడిగాడు.
నేను సిగ్గుపడ్డాను. కాని భయపడలేదు, ఆయన ఆకర్షణలో తన్మయుడనూ కాలేదు. కాబట్టి గురుదేవులతో ఇలా అన్నాను: “మహాశయా, మీరు పరమహంసలు కారు, రాజహంసలని చెప్పాను”.
వెంటనే గురుదేవులు మా అన్నతో ఇలా అన్నారు : “నీ తమ్ముడు సరిగానే చెప్పాడుగదా. ఇది తక్కువ చేయడం కాదే! పాలనూ నీటినీ కలిపి ఉంచితే, హంస వాటిని వేరుచేసి పాలను మాత్రం త్రాగుతుంది. అంతేకాదు. కాశీకి వెళితే ఎందరో పరమహంసలను చూడవచ్చు. నీ తమ్ముడు నన్ను వారందరికీ రాజును చేశాడు. సముచితంగానే చెప్పాడు.”
కేవలం వచనజాలంతో గురుదేవులను జయించలేం. ఆయన మేధావి అని గ్రహించాను. ఆయనను శోధింప, “మహాశయా, మీ పేరేమిటి?” అని అడిగాను.
గురుదేవులు నా వీపును నిమురుతూ, “మాకు పేరంటూ ఏదైనా ఉంటుందా? హే, హలో అని ఎలాగైనా నన్ను సంబోధించవచ్చు. సంబోధిస్తున్నది నన్నేనని అర్థం చేసుకోగలను” అని అన్నారు.
‘ఇదేమిటి, ఈయన నా మనస్సును చదివేస్తున్నారా?’ అనే ఆలోచనలలో పడ్డాను. ఇతరుల మనస్సులను చదవగలిగే విద్య నాకు కొంచెం తెలుసు. కొంత కాలం దానిని అభ్యసించాను కూడా.
“నేటిదాకా నాకు నీ పట్ల కాస్త భయం ఉండేది. ఆనాడు ఈ దారిలో వెళ్ళాను. గిరీష్ ఇంట్లో లేడు. వసారాలో కూర్చున్న నిన్ను చూసి, నీ వద్దకొచ్చి వాకబు చేయనా అని నారాయణ్ అడిగాడు. నేను వద్దన్నాను. నీ పొడవైన గడ్డం చూసి నేను భయపడ్డాను. ఇప్పుడు భయమంతా తొలగిపోయింది” అని గురుదేవులు తెలియచెప్పారు.
“మీ భయం గురించీ, అది నేడు తొలగిపోవడం గురించీ నా కెలా తెలుస్తుంది? నేను అదే గడ్డంతో అదే వ్యక్తిగానే ఉన్నాను” అని అన్నాను.
ఆ సమయంలో ‘మ’, పల్టు, చిన్న నరేంద్రుడు అక్కడకు వచ్చారు. గురుదేవులు ‘మ’ ను చూసి, “రండి, రండి, మూడున్నర పట్టభద్రులూ రండి” అని అన్నారు. వాళ్ళు నవ్వుతూ కూర్చున్నారు.
తరువాత అనేక విషయాల గురించి మాటలు కొనసాగాయి.
దక్షిణేశ్వర ఆలయాలు
కాళికాలయం
క లకత్తాకు ఉత్తరాన ఐదు మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వరమనే గ్రామంలో పావన గంగానది తూర్పు తీరాన ఈ ఆలయం వెలసి ఉంది. రాణీ రాస్మణి అనే పరమ భక్తురాలైన ఒక జమీందారిణి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఒక రోజు కాళీమాత ఆమెకు కలలో కనిపించి, తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించింది. ఆ మేరకు ఆమె అనతికాలంలోనే ఈ ఆలయం నిర్మించి, దేవిని ప్రతిష్ఠింపచేసింది. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు, సుందరమైన ఈ ఆలయాన్ని చూపిస్తూ, “ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన రాణి రాస్మణీ! నువ్వు భాగ్యశాలివి. నీ పుణ్యం చేతనే కదా లోకులు నేడు ఈ సజీవ దైవమూర్తి అయిన భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి, పూజించే అవకాశం కలిగింది” అనటం కద్దు. సాధువులు, పరమహంసలు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బ్రహ్మ సమాజస్థులు, శాక్తేయులు, వైష్ణవులు అందరూ ఇక్కడకు వస్తుంటారు.
చాందినీ – ద్వాదశ శివాలయాలు
పడవ నుంచి దిగగానే మొదట విశాలమైన మెట్లుగల స్నానఘట్టం వస్తుంది. ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానం చేసేవారు. స్నానఘట్టం దాటగానే కానవచ్చే చాందినీలో ఆలయపు ద్వారపాలకులు వసించి, కాపలా కాస్తూంటారు. వారి మంచాలు, చెక్కపెట్టెలు, రెండుమూడు పాత్రలు అన్నిటినీ అక్కడ చూడవచ్చు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న సంపన్నులు కొందరు స్నానార్థం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని కబుర్లాడుతూ ఒంటికి నూనె రాసుకొంటారు.
సాధువులు, ఫకీర్లు, బైరాగులు మొదలైనవారు ఆలయ ధర్మశాలలో ప్రసాదం ఆరగించడానికి, పూజ నైవేద్య గంటలు మ్రోగేవరకు ఇక్కడ వేచి ఉంటారు. కొన్ని సందర్భాలలో కాషాయ వస్త్రధారిణియైన భైరవి, త్రిశూలం చేత పుచ్చుకొని ఇక్కడ కూర్చుని ఉండేది. భోజన వేళ కాగానే ఆమె కూడా ధర్మశాలకు పోయేది. చాందనీకి ఉత్తరాన ఆరు, దక్షిణాన ఆరు – మొత్తం పన్నెండు శివాలయాలు వరుసగా కానవస్తాయి. గంగానది మీదుగా పడవలో వచ్చేవారు, దూరం నుంచే ఈ ద్వాదశ శివాలయాలను చూపి, “రాణి రాస్మణి నిర్మించిన ఆలయాలివి” అని చెప్పుకోవటం పరిపాటి.
ప్రాంగణం : రాధాకాంత ఆలయం
చాందినీకి శివాలయాలకు తూర్పున పొడవైన విశాలమైన ప్రాంగణం ఉత్తర దక్షిణాలకు వ్యాపించి ఉంది. దాన్లో ప్రక్కప్రక్కన రెండు ఆలయాలను చూడవచ్చు. దక్షిణాన, దక్షిణాభిముఖంగా ఉన్న పెద్ద ఆలయంలో కాళీమాత, ఉత్తరం వైపున ఉన్న చిన్న ఆలయంలో, పశ్చిమదిశన పరవళ్ళు తొక్కుతూ ఉన్న పావన గంగానదిని చూస్తూ రాధాకాంతుడు వెలసి ఉన్నారు. ఈ రాధాకాంత ఆలయాన్ని విష్ణ్వాలయం అని కూడా పేర్కొంటారు.
రాధాకాంత ఆలయం నేల చలువరాళ్ళతో పరచి ఉంది. ఆలయ పై కప్పున అలంకృతమైన గాజు దీపాలు వరుసలుగా వ్రేలాడుతూంటాయి. ప్రస్తుతం వాటిని ఉపయోగించటం లేదు. దుమ్ము, ధూళి పడకుండా ఎర్రని వస్త్రంతో వాటిని కప్పి ఉంచారు. సాయంత్రపు సూర్యుని కిరణాలు విగ్రహాల మీద పడకుండా ఉండటానికి వసారాలోని పెద్ద స్తంభాల నడుమ మందపాటి తెరలు కట్టబడి ఉన్నాయి. ఒక కాపలాదారు ఆలయాన్ని కాపలాకాస్తూ ఉంటాడు. ద్వారం ప్రక్కన చిన్న ఇత్తడి పాత్రలో శ్రీపాదతీర్థం ఉంటుంది. దేవుణ్ణి పూజించి తిరిగివచ్చే భక్తులు ఈ తీర్థాన్ని సభక్తికంగా పుచ్చుకొంటారు. ఆలయం లోపల రాధాకృష్ణులు సింహాసనారూఢులై దర్శనం ఇస్తూంటారు. 1857–58 సం ॥ మధ్యకాలంలో శ్రీరామకృష్ణులు మొట్టమొదట ఈ ఆలయంలోనే పూజారిగా ఉండేవారు.
భవతారిణీ కాళికాదేవి
కాళికాలయంలో కాళీమాత సుందరమైన శిలావిగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. ఇక్కడ కాళీమాతను భవతారిణిగా, అంటే భవసాగరాన్ని దాటించే దేవిగా పూజిస్తారు. ఆలయ గచ్చు తెలుపు నలుపు చలువరాళ్ళతో పరచబడి ఉంది. మెట్లున్న ఎత్తైన పీఠం ఒకటి ఇక్కడ ఉంది. పీఠం మీద వెండితో తయారైన సహస్రదళ పద్మం, దాని మీద దక్షిణాభిముఖంగా తల, ఉత్తరం వైపుగా సాచిన కాళ్ళతో శివుడు శవంలా పడి ఉంటాడు. శివుని విగ్రహం తెల్లని చలువరాతితో తయారైనది. బెనారస్ పట్టుచీరను ధరించి, వివిధాలంకారభూషితయై, నల్లని చలువరాతితో మలచబడి సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్న ముక్కంటి దేవియైన శ్యామాకాళీ, శివుని హృదయస్థానం మీద నిలబడి ఉంటుంది. ఆమె నిలబడి ఉన్న, గాంభీర్యం ఉట్టిపడే తీరుతెన్నులను మాటలలో వర్ణించలేం.
కాళీమాత పాదాలకు నూపురం, గజ్జెలు, పాజీబులు, మట్టెలు మొదలైన ఆభరణాలు, మందారపువ్వులు, బిల్వపత్రాలు అలంకరింపబడి ఉంటాయి. శ్రీరామకృష్ణుల కోర్కె మేరకు మథుర్బాబు అనేక ఆభరణాలను దేవికి కానుకగా సమర్పించాడు. అమ్మవారి చేతికి వంకీలు, మురుగులు, గాజులు; మెడలో కంటె, కాసులపేరు, ముత్యాలసరం, శిరస్సున కిరీటం, కర్ణాభరణాలు అలంకరింపబడి ఉన్నాయి. ముక్కుపుడకలు, నత్తు, బేసరి ఉన్నాయి. రెండు ఎడమ చేతుల్లో మానవ శిరస్సు, ఖడ్గం పట్టుకొని ఉంటుంది. కుడి రెండు చేతులు వరాభయ ముద్రలు చూపుతూంటాయి. ఆమె నడుముకు మానవ హస్తాలమాల, వేపాకుల గుత్తి, వడ్డాణము ధరింపబడి ఉంటాయి. ఆమె రూపం విధ్వంసక భీతిని, మాతృహృదయ మార్దవం అందించే విశ్వాసాన్ని కలగలిపి చూపుతూ ఉన్నట్లుగా కానవస్తుంది. జగత్ శక్తి ఆమే. యావత్ప్రపంచంలో ద్వంద్వాలకు వైభవాన్విత సామరస్యం ఆమే. సృష్టి స్థితి లయాలు నిర్వర్తించేదీ ఆమే. ఆమె మూడవ కన్ను జ్ఞాననేత్రం. ఆ త్రినేత్రాల దృక్కులు దుష్టులకు భయకంపనాలను, సజ్జనులకు అనురాగాన్ని కలిగిస్తాయి.
గర్భగుడిలో ఒక మూల, అంటే ఈశాన్యమూల దేవి విశ్రాంతి గైకొనడానికి మంచం వేసి ఉంది. మరో ప్రక్కన వింజామరం (చామరం) వ్రేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఈ వింజామరంతో దేవికి ఎన్నోమార్లు వీవన వీచి సేవలు చేసి ఉన్నారు.
పీఠంపై పద్మదళాల ఆసనం మీద ఒక వెండి చెంబులోనూ, పీఠం క్రింద వరుసగా పేర్చిన కలశాలలోనూ నీళ్ళు నింపబడి ఉంటాయి. పీఠం చుట్టూ అష్టధాతువులతో తయారైన సింహం, మొసలి, త్రిశూలం, ఆడ నక్క, నల్లరాతితో మలచిన నంది, హంస కానవస్తాయి.
పీఠం మెట్లపై వెండితో తయారైన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువు నుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారైన ‘రాంలాలా’ అని పేర్కోబడే బాలరాముని విగ్రహం, బాణేశ్వరలింగం, అనేక దేవీదేవతల విగ్రహాలు అమర్చబడి ఉంటాయి.
జగజ్జనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. దేవి పీఠానికి దక్షిణంగా ఉన్న కలశంలో కుంకుమ, అర్చన గావించబడిన పువ్వులు, పుష్పమాలలు మొదలైనవి ఉంటాయి.
గర్భగుడిలో మరోవైపు దేవి ఆచమనం చేయటానికి తామ్రపాత్ర ఒకదాన్లో నీళ్ళు నింపి ఉంచుతారు. దేవి పీఠం మీద ఎత్తులో అందమైన గోపురం అమరి ఉంది. దేవికి వెనుకవైపు బెనారస్ పట్టుతో రూపొందిన అందమైన తెర వ్రేలాడదీయబడి ఉంటుంది. పీఠం నాలుగువైపులా చిన్న చిన్న వెండి స్తంభాలు నిలచి ఉన్నాయి. స్తంభాలపైన నవరత్నఖచితమైన గోపురం అమరి ఉంది. గర్భగుడి సుదృఢ ద్వారాలతో సురక్షితంగా ఉంటుంది. ద్వారం ప్రక్కన, వసారాలో కాపలాదారు కూర్చుని ఉంటాడు. ఆలయ ద్వారం ప్రక్కనే దేవి పాదతీర్థం ఉంటుంది.
కాళికాలయ అగ్రాన తొమ్మిది గోపురాలు అమరి ఉన్నవి. క్రింది వరుసలో నాలుగు చిన్న గోపురాలు, మధ్య వరుసలో నాలుగు చిన్న గోపురాలు, అన్నింటికంటే పైన ఒక చిన్న గోపురం అమరి ఉన్నవి. వీటిలో ఒక గోపురం ప్రస్తుతం విరిగి ఉంది. భవతారిణీ కాళికాలయంలోను, రాధాకాంత ఆలయంలోను శ్రీరామకృష్ణులు పూజలు ఒనరించి ఉన్నారు. ధ్యానాయత్త జీవితానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ గోచరమవుతుంది.
ఆలయానికి ఎదురుగా నాట్యమండపం ఉంది. ఈ మండపంలో పెద్ద స్తంభాలు రెండు వరుసల్లో అమరి ఉన్నాయి. ఈ స్తంభాలు కప్పుభారాన్ని తలదాల్చి ఉన్నాయి. ఉత్సవ వేళలలో, కాళీపూజ వంటి పర్వదినాలలో ఈ మండపంలో నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ మండపంలోనే శ్రీరామకృష్ణుల ఇచ్ఛమేరకు ‘అన్నమేరు’ ఉత్సవం, రాణి రాస్మణి అల్లుడైన మథుర్ ఏర్పాటుచేశాడు. ఇక్కడే శ్రీరామకృష్ణులు భైరవీపూజను ఘనంగా నిర్వహించారు.
వంటశాల, భాండాగారం, అతిథిశాల, బలిపీఠం
ప్రాంగణం పశ్చిమాన ద్వాదశ శివాలయాలు ఉన్నాయి. సన్న్యాసులకు ఇష్టదైవమైన శివుని పలుస్థితులు తెలియచేసే పన్నెండు శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నవి. అనునిత్యం విధివిహితంగా ఈ శివలింగాలకు పూజాదికాలు నిర్వర్తిస్తారు.
పెద్ద ఆవరణ తక్కిన మూడు వైపుల వంటశాలలు, భాండాగారాలు, అతిథిశాల (ధర్మశాల) నెలకొని ఉన్నాయి. తూర్పున వంటశాలలు, భాండాగారం, అతిథులశాల అమరి ఉన్నాయి. రాధాకాంత ఆలయ, కాళికాలయ నైవేద్యాలను విడివిడి వంటశాలలలో వండుతారు. అనునిత్యం కాళీపూజ తరువాత, మధ్యాహ్న భోజన వేళకు కాస్త ముందుగా నైవేద్యం అర్పించబడుతుంది. పిదప, ఆ అన్న ప్రసాదాన్ని ధర్మశాలలో గుమిగూడిన భక్తులకు, పేదలకు వితరణ చేస్తారు. వండిన ఆహారం స్వీకరింప నొల్లని సాధువులకు స్వయంపాకం వస్తుభండారం నుంచి ఆలయ కోశాధికారి అనుమతితో ఇస్తారు. ఆలయ సిబ్బందికి కూడా ప్రసాదంలో భాగం ఉంది. రాణీ రాస్మణి బంధువులు, మిత్రులు వచ్చినప్పుడు కుఠీ (అతిథి భవనం)లో బస చేస్తారు. వారికీ ఆలయ ప్రసాదం పంపబడుతుంది. భాండాగారానికి దక్షిణంగా బలిపీఠం ఉంది.
కార్యాలయం
పెద్ద ఆవరణకు దక్షిణాన వరుసగా అనేక గదులు కానవస్తాయి. ఆలయ కార్యాలయమూ, ఆలయ సిబ్బంది బస, భక్తుల బస ఇక్కడ ఉన్నాయి. కార్యాలయ నిర్వహణాధికారి, గణకుడు ఇక్కడే నివసిస్తారు. భాండాగార నిర్వహణాధికారి, వంటశాల సిబ్బంది, ఆలయ అర్చకులు, పనివారు మొదలైన వారు సదా ఇక్కడ తిరుగాడుతూ ఉంటారు. ఉత్సవదినాలలో మాత్రమే వినియోగింపబడే పెద్దపెద్ద జంపఖానాలు, తెరలు మొదలైనవాటిని కొన్ని గదుల్లో పదిలపరచి ఉంచుతారు. శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలో నివేదనం వండడానికి కొన్ని గదులను నేటికీ ఉపయోగిస్తున్నారు.
ఉత్తరం వైపున కొన్ని గదులు వరుసగా కట్టబడి ఉన్నాయి. ఈ వరుస మధ్యన ఒక ద్వారం కానవస్తుంది. ఇక్కడ సదా ఒక కాపలాదారు ఉంటాడు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళేవారు తమ పాదరక్షలను ఇక్కడ వదులుతారు.
శ్రీరామకృష్ణుల గది
ప్రాంగణంలో వాయవ్యమూల, అంటే ద్వాదశ శివాలయాలకు ఉత్తరంగా శ్రీరామకృష్ణుల గది ఉంది. శ్రీరామకృష్ణులు తమ జీవితకాలంలో అత్యధికభాగం ఇక్కడే గడిపారు. ఈ గదికి పశ్చిమాన నెలకొన్న అర్ధచంద్రాకార వసారాలో నిలబడి పావన గంగానదిని దర్శిస్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. ఈ వసారాను ఆనుకొని కాలిబాట ఒకటి ఉత్తర–దక్షిణంగా పోతూ ఉంది. బాటకు పశ్చిమాన పువ్వులతోట. దాన్ని దాటి వెళితే రాళ్ళతో కట్టబడిన గట్టు. గట్టును తాకుతూ సర్వతీర్థమయి అయిన గంగాదేవి కలకల నినాదంతో ప్రవహిస్తూ ఉంటుంది.
నహబత్, పొగడ చెట్టు, పంచవటి
శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపు ఒక చదరపు వసారా, అక్కడ నుంచి పూతోటకు వెళ్ళే బాట, పూతోట* అమరి ఉన్నాయి. పూతోట దాటితే మేడతోకూడిన నహబత్ (మేళపు చావడి) కానవస్తుంది. ఈ మేళపుచావడిలో శ్రీరామకృష్ణుల వయోవృద్ధురాలైన తల్లి, మాతృదేవి శారదాదేవి నివసించే వారు. నహబత్ తరువాత పొగడచెట్లు, స్నానఘట్టం ఉన్నాయి. ఈ ఘట్టంలో, ఊరి స్త్రీ జనం స్నానం చేస్తారు. ఇక్కడే శ్రీరామకృష్ణుల తల్లి 1877 సం ॥ లో భగవత్ సన్నిధానం చేరుకొంది.
పొగడచెట్టును దాటి ఉత్తరం వైపుకు వెళితే పంచవటి వస్తుంది. శ్రీరామకృష్ణులు ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారు. భక్తులతో కలసి పచార్లు చేశారు. కొన్ని వేళల్లో నడిరేయి కూడా అక్కడకు వెళుతూండేవారు. పంచవటిలో వటవృక్షం (మర్రిచెట్టు), అశ్వత్థవృక్షం (రావిచెట్టు), నింబవృక్షం (వేపచెట్టు), ఆమలక వృక్షం (ఉసిరి చెట్టు), బిల్వవృక్షం (మారేడు చెట్టు) ఉన్నాయి. వీటిని శ్రీరామకృష్ణులు స్వయంగా నాటి, పెంచారు. బృందావనం నుంచి తాము తెచ్చిన పావన మృత్తికను ఇక్కడ చల్లారు. ఈ పంచవటికి తూర్పున ఒక పర్ణకుటీరం నిర్మింపచేసి దాన్లో చాలాకాలం తపస్సులో, భగవచ్చింతనలో గడిపారు. ఇప్పుడు ఈ పర్ణకుటీరాన్ని కట్టడంగా మార్చి ఉన్నారు.
పంచవటి పలురకాల పక్షులకు, జంతువులకు ఆలవాలమై ఉంది. దాని చుట్టూ మెట్లతో కూడిన అరుగు ఒకటి నిర్మితమై ఉంది. ఈ అరుగుమీద వాయవ్యమూలన కూర్చుని శ్రీరామకృష్ణులు అనేక కఠోర సాధనలు అనుష్ఠించారు. దేవీ దర్శనంకోసం కన్నీరుమున్నీరైనారు.
సరుగుడు తోపు, బిల్వవృక్షాలు, కుఠీ
పంచవటికి కొంచెం ఉత్తరంగా వెళితే ఇనుప తీగెలతో కట్టిన కంచె ఒకటి వస్తుంది. ఆ కంచెకు ఆవలి వైపునే సరుగుడు తోపు ఉంది. అక్కడ సరుగుడు చెట్లు వరుసగా బారులుతీరి ఉన్నాయి. సరుగుడు తోపుకు తూర్పుగా వెళితే బిల్వవృక్షం వస్తుంది. ఇక్కడ కూడా శ్రీరామకృష్ణులు అనేక సాధనలు సల్పారు. సరుగుడు, మారేడు చెట్లకు వెనుకనే ఎత్తైన ప్రహరీగోడ ఉంది. దానికి ఆవల తుపాకీమందు కర్మాగారం ఉంది.
ఆలయ ప్రాంగణపు సింహద్వారం బయట ఉత్తరం వైపున రెండంతస్తుల ‘కుఠీ’ ఉన్నది. రాణిరాస్మణి, ఆమె అల్లుడు మథుర్బాబు మొదలైనవారు ఆలయానికి వచ్చినప్పుడు ఇందులోనే విడిది చేసేవారు. వారు జీవించి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఈ కుఠీలోని క్రింది అంతస్థులో పడమటివైపు గదిలో ఉండేవారు. ఇక్కడ నుండి పొగడచెట్ల గట్టుకు వెళ్ళవచ్చు. అక్కడ నుండి గంగానది సుందర దృశ్యం చక్కగా కానవస్తుంది.
పాత్రలు తోమే గట్టు, గాజీతోలా, రెండు వాకిళ్ళు
సింహద్వారానికి, కుఠీకి మధ్యన ఉన్న దారిలో వెళ్ళినప్పుడు కుడి ప్రక్కగా మెట్లతో తీర్చి కట్టబడిన సుందరమైన కోనేరు ఉన్నది. కాళికాలయానికి తూర్పువైపున ఈ కోనేటి మరొక గట్టు ఉంది. అక్కడ వంటపాత్రలు తోముతారు. అదేవైపున అనతిదూరంలోనే మరో గట్టు ఉంది. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. దీన్ని గాజీతోలా అంటారు. ఆ దారినే తూర్పుగా వెళితే సింహద్వారం ఒకటి వస్తుంది. ఆలంబజార్, కలకత్తా నుండి వచ్చేవారు ఆ ద్వారం నుండే ఆలయంలోకి రావచ్చు. ఇక్కడ సర్వదా ద్వారపాలకుడు కాపలాకాస్తుంటాడు. కలకత్తా నుండి శ్రీరామకృష్ణులు, రాత్రి పొద్దుపోయాక వచ్చినప్పుడు ఈ ద్వారం గుండానే లోపలికి వచ్చేవారు. అప్పుడు ద్వారపాలకుడు తాళం తీసి ద్వారం తెరిచేవాడు. శ్రీరామకృష్ణులు, అతణ్ణి తమ గదికి తీసుకువెళ్ళి పూరీలు, మిఠాయిలు వంటి ప్రసాదం పెట్టేవారు.
హంసపుకూర్, అశ్వశాల, గోశాల, పువ్వుల తోట
పంచవటికి తూర్పువైపున మరో కొలను ఉంది. దాన్ని హంసపుకూర్ అంటారు. దానికి ఉత్తర దిక్కున అశ్వశాల, గోశాల ఉన్నాయి. గోశాలకు తూర్పుగా సందువాకిలి ఉంది. ఈ వాకిలి నుండే దక్షిణేశ్వర గ్రామానికి వెళ్ళవచ్చు. పూజారులు, మరికొందరు పనివారు తమ కుటుంబాలను తోడ్కొనివచ్చి దక్షిణేశ్వరంలోనే వసించేవారు. వారు ఈ వాకిలిగుండానే రాకపోకలు సాగించేవారు.
ఆలయ ప్రాంగణానికి దక్షిణ సరిహద్దు నుండి ఉత్తరాన గల పంచవటి వరకు గంగాతీరాన కాలిబాట ఉంది. ఆ బాటకు ఇరువైపులా పువ్వుల చెట్లు నాటి ఉన్నారు. అలాగే కుఠీవద్ద తూర్పు–పడమరలుగా ఉన్న దారిలో కూడా పువ్వుల చెట్లు ఉన్నాయి. గాజీతోలా నుండి గోశాల వరకు; కుఠీ, హంసపుకూర్లకు తూర్పుగా ఉన్న స్థలంలో నలుదిక్కులా పలురకాల పువ్వుల, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మరో కొలను కూడా ఉంది.
వేకువజామున ఆకాశం రక్తవర్ణంతో శోభించేటప్పుడు మంగళహారతి సుమధుర నాదాలు ఆలయం నుండి వినవస్తాయి. అప్పుడు పూజ నిమిత్తం కాళికాదేవి తోటలో పువ్వులు కోయనారంభిస్తారు. గంగాతీరాన పంచవటికి ఎదురుగా బిల్వవృక్షం, తెల్లగన్నేరు పువ్వుల చెట్లు ఉన్నాయి. మల్లెపూలు, మాధవీలత, తెల్లగన్నేరు పువ్వులంటే శ్రీరామకృష్ణులకు మహాప్రీతి. మాధవీలతను స్వయంగా బృందావనం నుండి తెచ్చి నాటారు. హంసపుకూర్, కుఠీకి మధ్యనున్న కొలను ఒడ్డున సంపెంగ చెట్టు ఉంది. దానికి కొంత దూరంలో పన్నీరు, మందార పువ్వుల చెట్లు ఉన్నాయి. దడిలో శంఖు పువ్వుల తీగ అల్లుకొని ఉంది. దానికి చివరగా మొల్లచెట్టు, పారిజాతపు చెట్టు ఉన్నాయి. ద్వాదశ శివాలయాలకు పశ్చిమంగా శ్రీరామకృష్ణుల గదికి ఇరువైపులా ఉన్న స్థలం పలురకాల పువ్వుల చెట్లతో అలరారుతోంది.
ప్రప్రథమంలో శ్రీరామకృష్ణులు కూడా ఇక్కడ పువ్వులు కోసేవారు. ఒక రోజు పంచవటి ఎదుటనున్న ఒక బిల్వవృక్షం ఆకులు కోస్తూంటే ఒక కొమ్మ కొద్దిగా ఊడి వచ్చింది. అప్పుడు ఆయనకు సర్వభూతాలలోనూ భగవంతుడు విరాజిల్లు తున్నాడు అన్న అనుభూతి కలిగింది. ఆ చెట్టుకు ఎంతగా బాధ కలిగిందో అని చింతించారు. పిమ్మట ఆయన ఆకులు కోయలేకపోయారు. మరొక రోజు పువ్వులు కోయడానికి తిరుగుతున్నారు. అప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుత్తిగా విరాట్ శివునికి అలంకరిస్తూ, అహర్నిశలు ఆ విరాడ్రూపుని పూజ జరుగుతున్నట్లుగా ఆయన దర్శించారు.
శ్రీరామకృష్ణుల గది వసారా
శ్రీరామకృష్ణుల గదికి తూర్పువైపున పొడవైన వసారా ఉంది. ఈ వసారాలో కొంత భాగం ప్రాంగణం వైపుగా అంటే దక్షిణాభిముఖంగా ఉంది. శ్రీరామకృష్ణులు తరచు ఈ వసారాలో కూర్చుని ఆధ్యాత్మిక ప్రసంగాలు, భగవత్ సంకీర్తనలు గావించేవారు. వసారాలోని మిగిలిన భాగం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఈ వసారాలో భక్తులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునేవారు; ఆయనతోపాటు సంకీర్తన చేసేవారు; ఆయన, వారితోపాటు కలసి కూర్చుని ప్రసాదం స్వీకరించేవారు. కేశవ్‌చంద్రసేన్ భక్తి వినమ్రతలతో శ్రీరామకృష్ణులతో సంభాషించింది ఈ వసారాలోనే. ఆనందంగా అందరూ కలసి మరమరాలు, కొబ్బరి, పూరీలు, మిఠాయిలు మొదలైవాటిని తినేవారు. నరేంద్రుణ్ణి చూసి శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయింది కూడా ఈ వసారాలోనే.
ఆనంద నికేతనం
కాళికాలయం ఆనంద నికేతనంగా రూపొందింది. రాధాకాంతులు, భవతారిణీదేవి, శివభగవానుల నిత్యపూజానైవేద్యాలు, అతిథి సేవలు ఇక్కడ జరుగుతూ వస్తూన్నాయి. ఒకవైపు పవిత్ర భాగీరథీ కనుచూపు మేర కానవస్తుంది. మరొకవైపు సుగంధపరిమళభరితమై చిత్రవిచిత్ర కుసుమ సమూహాలతో పువ్వుల తోట అలరారుతోంది. ఒక చేతన పురుషుడు రాత్రింబవళ్ళు భగవత్ప్రేమలో ఉన్మత్తుడయింది ఇక్కడే! ప్రత్యక్షదైవంగా నివసించిందీ ఇక్కడే! ఆలయంలో దేవికి మేలుకొలుపు సేవ మొదలు పవళింపు సేవ వరకు యథావిధిగా మంగళ వాద్యాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా పూజాదికాలు నిర్వర్తింపబడుతూ కాళీకాలయం ఆనంద నికేతనంగా విరాజిల్లుతూ వస్తూ ఉన్నది.
పూర్వాపర్యక్రమంలో ముఖ్య సంఘటనలు
| సం ॥ | సంఘటన | |
| 1775 | క్షుదీరామ్ జననం. | |
| 1791 | చంద్రమణీదేవి జననం. | |
| 1799 | ఇరవై ఐదేళ్ల క్షుదీరామ్, ఎనిమిదేళ్ళ చంద్రాదేవిని వివాహం చేసుకోవడం. | |
| 1805 | రామ్‌కుమార్ జననం. | |
| 1810 | కాత్యాయని జననం. | |
| 1815 | నలభైయో ఏట క్షుదీరామ్ కామార్పుకూర్లో స్థిరనివాసం. | |
| 1821 | రామ్‌కుమార్, కాత్యాయనుల వివాహాలు. | |
| 1824 | క్షుదీరామ్ రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరడం. | |
| 1826 | రామేశ్వర్ జననం. | |
| 1834 | కాత్యాయనిని పిశాచి ఆవహించడం. | |
| 1835 | అరవయ్యో ఏట క్షుదీరామ్ కాశీ, గయలకు తీర్థయాత్ర. | |
| 1836 | ఫిబ్రవరి 18 వ తేదీ బ్రహ్మముహూర్తంలో సుమారుగా ఉదయం 5 గం ॥ శ్రీరామకృష్ణుల జననం | |
| 1839 | సర్వమంగళ జననం. | |
| 1843 | శ్రీరామకృష్ణులు పొందిన మొదటి భావసమాధి. క్షుదీరామ్ మరణం. | |
| 1848 | రామేశ్వర్, సర్వమంగళల వివాహాలు. | |
| 1849 | అక్షయ్‌ను ప్రసవించి రాంకుమార్ భార్య మరణించడం. | |
| 1850 | కలకత్తాలోని ఝమాపుకూర్లో రాంకుమార్ సంస్కృత పాఠశాల ప్రారంభం. | |
| 1852 | కలకత్తాకు శ్రీరామకృష్ణుల రాక. | |
| 1853 | డిసెంబర్ 22, మాతృమూర్తి శారదాదేవి జననం. | |
| 1855 | దక్షిణేశ్వర కాళికాలయ ప్రతిష్ఠాపన. దక్షిణేశ్వరంలో హృదయ్. విష్ణ్వాలయ పూజారిగా శ్రీరామకృష్ణుల నియామకం, తదనంతరం కాళికాలయ పూజారిగా నియుక్తులు కావడం. | |
| 1856 | రాంకుమార్ మరణం. భగవత్సాక్షాత్కారం, శ్రీరామకృష్ణులు పొందిన జగన్మాత ప్రథమ దర్శనం. | |
| 1857 | రాణీ రాస్మణిని శిక్షించడం. | |
| 1858 | కాళికాలయ పూజారిగా హలధారి. శ్రీరామకృష్ణుల కామార్పుకూర్ ఆగమనం. | |
| 1859 | శ్రీరామకృష్ణుల వివాహం. | |
| 1860 | దక్షిణేశ్వరానికి తిరిగి రావడం. శ్రీరామకృష్ణులలో శివ–శక్తులను మథుర్ దర్శించడం. | |
| 1861 | రాణీ రాస్మణి కాలధర్మం. భైరవీ బ్రాహ్మణి ఆగమనం. | |
| 1862 | శ్రీరామకృష్ణుల తాంత్రిక సాధన. | |
| 1863 | తంత్రసాధన పరిసమాప్తి. గంగాతీరాన వసించడానికి చంద్రమణీ దేవి దక్షిణేశ్వరానికి రావడం. | |
| 1864 | మథుర్ ‘అన్నమేరు’ ఉత్సవం. | |
| 1865 | తోతాపురి రాక, శ్రీరామకృష్ణుల సన్న్యాస స్వీకారం. హలధారిస్థానే అక్షయ్. | |
| 1866 | ఆరు నెలలకాలం శ్రీరామకృష్ణులు అద్వైత భూమిలో నెలకొని ఉండడం. | |
| 1867 | బ్రాహ్మణి, హృదయ్లతో, శ్రీరామకృష్ణులు కామార్పుకూర్కు వెళ్ళడం. మాతృదేవి కామార్పుకూర్కు రావడం. | |
| 1868 | శ్రీరామకృష్ణుల తీర్థయాత్ర. | |
| 1869 | అక్షయ్ వివాహం, మరణం. | |
| 1870 | శ్రీరామకృష్ణుల కాల్నా, నవద్వీప్ సందర్శనం; భగవాన్దాసుతో సమావేశం. | |
| 1871 | మథుర్బాబు మరణం (జూలై). | |
| 1872 | మాతృదేవి దక్షిణేశ్వర ప్రథమ సందర్శనం. శ్రీరామకృష్ణుల షోడశీపూజ, మాతృదేవి కామార్పుకూర్కు తిరిగి వెళ్ళిపోవడం. | |
| 1873 | రామేశ్వర్ మరణం. | |
| 1874 | రెండవసారి మాతృదేవి దక్షిణేశ్వరానికి రావడం. | |
| 1875 | కేశవచంద్రసేన్తో శ్రీరామకృష్ణుల ప్రథమ సమావేశం. | |
| 1876 | మాతృదేవి జబ్బుపడి పుట్టింటికి వెళ్ళడం. చంద్రమణీదేవి కాలధర్మం. | |
| 1877 | మాతృదేవి తృతీయ దక్షిణేశ్వర సందర్శనం.గిరిష్ చంద్రఘోష్, శ్రీరామకృష్ణులను కలుసుకోవడం. | |
| 1879 | శిష్యుల ఆగమనానికి నాంది. | |
| 1881 | నరేంద్రనాథ్‌తో, శ్రీరామకృష్ణుల ప్రథమ సమావేశం. హృదయ్‌కు ఉద్వాసన. | |
| 1882 | విద్యాసాగర్‌ను శ్రీరామకృష్ణులు సందర్శించడం; మాతృదేవి తిరిగి దక్షిణేశ్వరానికి రావడం. | |
| 1883 | ఈ రచయిత శ్రీరామకృష్ణులను నవంబర్ 26 వ తేదీ కలుసుకోవడం. | |
| 1884 | కేశవ్ కాలధర్మం. శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి గోపాలుని తల్లి సందర్శించడం. ఆంతరంగిక భక్తుల రాక పూర్తికావడం. | |
| 1885 | పానీహాటీ మహోత్సవాన్ని చివరిసారి సందర్శించడం. సెప్టెంబర్ తొలినాళ్ళలో శ్యామ్పుకూర్కు, అక్కడ నుండి డిసెంబర్ 11 నాడు కాశీపూర్‌కు శ్రీరామకృష్ణులను తరలించడం. | |
| 1886 | జనవరి 1 వ తేదీ (కల్పతరువు దినం) నాడు శ్రీరామకృష్ణుల అనుగ్రహ వృష్టి. | |
| 1886 | ఆగస్టు 16 వ తేది శ్రీరామకృష్ణుల మహాసమాధి |
రచన – రచయిత
ప్రఖ్యాత ఫ్రెంచి పండితుడైన రోమారోలా ఎవరిని ‘వంగ ప్రవక్త’ గా పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడో ఆ శ్రీరామకృష్ణుల సమగ్ర జీవిత చరిత్రను ఆయన సన్న్యాస శిష్యులైన స్వామి శారదానంద వంగ భాషలో ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగం’ పేరిట రచించారు.
శ్రీరామకృష్ణుల జీవితం గత (19 వ) శతాబ్దపు అత్యంత ప్రాముఖ్యత వహించిన ఆధ్యాత్మిక సంఘటన. ఆయన ప్రధాన శిష్యులైన స్వామి వివేకానంద ఆయనను గురించి ఇలా ప్రకటించారు : “శ్రీరామకృష్ణుల జీవితం ఆయన బోధనల కంటే వెయ్యిరెట్లు ఘనతరమైంది, అది ఉపనిషత్తుల మంత్రాలకు సజీవ వ్యాఖ్యానమే కాదు; ఆయన మానవ రూపంలో ఆవిర్భవించిన ఉపనిషత్తుల భావఘనమూర్తి. అనుపమానమైన ఆ పరిపూర్ణత, తనను తాను సమర్థించుకోని అద్భుతమైన ఆ కారుణ్యం, బద్ధజీవుడి పట్ల కనబరిచే ఆ సానుభూతి ప్రపంచంలో మరెక్కడా కానరాదు. స్త్రీ పురుషులకు మధ్య, శ్రీమంతులకు దరిద్రులకు మధ్య, పండిత పామరులకు మధ్య, బ్రాహ్మణ నిమ్నకులస్థులకు మధ్య కనబడుతున్న తారతమ్యాలను కూకటవ్రేళ్ళతో పెకలించివేయడానికే ఆయన జీవించారు… ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతి సభ్యతలకు ఒక అపూర్వ సమన్వయం కొనిరావటానికే ఆయన అవతరించింది. అంతగొప్ప, అంత అద్భుతమైన మత సామరస్యాన్ని కొనితెచ్చిన జగద్గురువును గత అనేక శతాబ్దాలలో భారతదేశం చూడలేదదనడం తిరుగులేని సత్యం. ప్రస్తుత యుగధర్మం ప్రపంచానికంతటికీ, విశేషంగా భారత దేశానికి, ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ యుగధర్మానికి స్ఫూర్తిప్రదాత భగవాన్ శ్రీరామకృష్ణులు. గతంలో ఏతెంచిన మహామహులైన మతప్రవక్తలందరి నూతన అభివ్యక్తీకరణే శ్రీరామకృష్ణులు.”
అటువంటి జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని వ్యక్తం చేయటం సామాన్యులకు అసాధ్యం. ఆధ్యాత్మిక రాజ్యంలో అనంత జ్ఞానం, అత్యున్నత శ్రేణికి చెందిన అంతర్దృష్టి, యుక్తియుక్తత సంతరించుకొన్న మనిషికి మాత్రమే ఆ పని సాధ్యం.
ప్రత్యక్ష పరిశీలన, ఎంతో ఓపికతో విభిన్న స్థానాల నుండి విషయ సేకరణ, సప్రామాణికం కావాలనే లక్ష్యాన్ని చేర ఎంతో శ్రద్ధతో సేకరించిన విషయాలను పరిశీలించటం, మత సిద్ధాంతాలకు, అనుష్ఠానాలకు సంబంధించిన జటిల చిక్కులను తేటతెల్లంగా వివరించటం – వీటిని సంతరించుకొని వంగ భాషలో రచింపబడిన ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగ’ ఆధ్యాత్మిక మహాపురుషుల జీవిత చరిత్రలలో ప్రప్రథమ స్థానాన్ని అలంకరించగలదనటంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఈ పుస్తకం ధారావాహికంగా ఐదు సంపుటాలుగా ప్రచురింపబడింది. మొదటి రెండు సంపుటాలలో శ్రీరామకృష్ణుల గురుభావం విశదంగా చిత్రీకరింప బడింది. తర్వాతి రెండు భాగాలలో ఆయన బాల్యం, యౌవనం, కఠోర సాధనలు వర్ణింపబడ్డాయి. వారి జీవితంలో దివ్యభావం ఎలా వ్యక్తమైందో చివరి సంపుటం వివరిస్తుంది.
దురదృష్టవశాత్తు ఈ పుస్తకం అసంపూర్ణంగానే ఉండిపోయింది. శ్రీరామకృష్ణుల చివరి కొన్ని నెలల జీవితం దీనిలో పొందుపరచబడలేదు. అయినా కూడా “అసంపూర్ణమైనా అద్భుతమైన రచన” అని దీన్ని గురించి రోమారోలా ప్రశంసించడం అతిశయోక్తి కాదు.
ఇక గ్రంథకర్తను గురించి ఫ్రెంచి పండితుడు రోమారోలా “ఆయన దార్శినికుడిగా, చరిత్రకారుడిగా ప్రామాణికుడనడంలో ఏ సందేహమూ లేదు. తాత్త్విక వ్యాఖ్యానాలు సమృద్ధిగా కూడిన ఆయన పుస్తకాలలో సమృద్ధికరమైన హిందూ చింతనాధోరణిలో శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణను రచయిత కచ్చితమైన స్థానంలోనే ప్రతిష్ఠించాడు” అని ధ్రువీకరించాడు. విషయాంశాన్ని అద్భుత రీతిలో మలచడంలో రచయిత చూపిన పాటవం అద్వితీయం. విస్తృతమైన ఆయన అనుభవాలు, పాండిత్యం, యుక్తియుక్త విచారణాశక్తి, అన్నింటికంటే ఎక్కువగా వారి ఆధ్యాత్మిక సాధనలు, సాదాసీదా పాఠకునికి కూడా తక్షణమే విశదమౌతాయి.
కనుక ఈ తెలుగు అనువాదాన్ని చదువగోరే పాఠకులకు రచయిత సంక్షిప్త జీవితం ఎంతో ఆసక్తికరం, దోహదం కాగలదు. ఆధ్యాత్మిక యుగ ప్రవక్తలైన శ్రీరామకృష్ణుల పావన జీవితాన్ని ఈయన అకుంఠిత దీక్షతో ప్రామాణికంగా, సమగ్రంగా రచించి మనందరికి అందించారు. కనుక రచయిత సంక్షిప్త జీవితం పాఠకులకు ఎంతైనా అవసరం అని భావించి పరిచయం చేస్తున్నాం.
స్వామి శారదానంద
శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యుల్లో అత్యంత ప్రధానమైన శిష్యుడు స్వామి శారదానంద. ఆయన పూర్వాశ్రమ నామధేయం శరత్చంద్ర చక్రవర్తి. ఇతడు 1865, డిసెంబరు నెలలో కలకత్తాలో నివసిస్తూన్న ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే ఇతని జీవితంలో మహాపురుష లక్షణాలు వ్యక్తం కాసాగాయి. శాంత స్వభావియైన ఈ పిల్లవాడు దృఢకాయం, కుశాగ్రమైన బుద్ధి, సానుభూతి సంతరించుకొన్నాడు.
అవలీలగా తోటి విద్యార్థులందరినీ మించగల్గిన శరత్ బహిరంగ చర్చలలో కూడా నిపుణుడు. అయినా కఠినంగా మాట్లాడటం, ఎగతాళి చేసి ఇతరులను బాధించటం అతనికి అసాధ్యమైన పని. ఆప్యాయపూరితమైన అతని హృదయం బాధపడుతున్న పరిచితులు, మిత్రులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు, చివరకు పనివాళ్ళు – రోగం అత్యంత సాంక్రమితమైనదైనా సరే – ఎవరినైనా వెనువెంటనే సేవించటానికి అతణ్ణి ఎంతో స్వాభావికంగా పురిగొల్పేది. అన్నింటి కంటే ఎక్కువగా శరత్ మానసిక నిర్మాణంలోని అద్భుత లక్షణం, అతని ఆధ్యాత్మిక అభిరుచి. చిన్నప్పటి నుండే అతని మనస్సు సహజంగా మతసంప్రదాయాల పట్ల మొగ్గుచూపేది. అతనికి ఇష్టమైన ఆట – పూజ చేస్తున్నట్లు నటించటం. పెరుగుతున్న కొద్దీ ఈ ఆట అతని జీవితంలో ముఖ్యాంశంగా పరిణమించింది.
పూర్వాచారపరాయణులైన కుటుంబంలో జన్మించిన శరత్‌కు యుగానుగతంగా వస్తున్న హిందూమతం పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు జనించాయి. అయినా బడి చదువు ముగిసేటప్పటికి మతమంటే అతని విశ్వాసం యుక్తియుక్తత అనే పునాది మీద సుస్థిరమైంది. దీనికి మూలకారణం కేశవచంద్రసేన్ నాయకత్వంలో అప్పుడు ప్రాబల్యం వహించిన ‘నవవిధాన్’ అనే బ్రహ్మసమాజం ప్రభావమే. సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో బైబిల్ చదివిన ఫలితంగా ఏసుక్రీస్తు జీవితం, ఉపదేశాలు అతణ్ణి ఎంతో ప్రేరేపించాయి. ఫలితంగా ఆధ్యాత్మిక సాధనల పట్ల అతని ఉత్సాహం ద్విగుణీకృతమైంది. కళాశాల చివరి రోజుల్లో భాగ్యవశాత్తు ఒక మహనీయుణ్ణి కలుసుకొన్నాడు. ఫలితంగా మత సత్యాలను గురించిన అతని అనుమానాలన్నీ శాశ్వతంగా నివృత్తమైనాయి; శరత్ జీవితమే పూర్తిగా మారిపోయింది.
శరత్ కలుసుకున్న ఆ మహనీయుడే దక్షిణేశ్వర పరమహంసగా ఖ్యాతి గాంచిన శ్రీరామకృష్ణులు. కలకత్తా వార్తాపత్రికల ద్వారా, విశేషించి బ్రహ్మ సమాజపు వార్తాపత్రికల ద్వారా ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన మహా పురుషుడొకరు దక్షిణేశ్వరంలో నివసిస్తూన్నారనే విషయం కలకత్తాలో ఎంతగానో వ్యాపించసాగింది. ఆ వార్త విని స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు, ఒకరేమిటి ఆధ్యాత్మిక పిపాసువు లెందరో దక్షిణేశ్వరానికి వెళ్ళసాగారు. శరత్, అతడి దాయాదియైన శశి (కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద) ఆ వార్త విని పరమహంసను దర్శించటానికి తహతహలాడసాగారు. అప్పుడు వారు యువకులు, కళాశాల విద్యార్థులు. 1883, అక్టోబర్ నెలలో ఒకనాడు వారిద్దరూ శ్రీరామకృష్ణులను దర్శింప బయలుదేరారు.
1920 సం ॥ కలకత్తా, ఉద్బోధన్ కార్యాలయంలో స్వామి శారదానంద, ఈ గదిలోనే శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం (శ్రీరామకృష్ణ పరమహంస) వ్రాసారు.
అటువంటి యోగ్యులైన యువసాధకుల కోసమే ఎదురు చూసేవారు శ్రీరామకృష్ణులు. వీరు రాగానే మహదానందంతో వారిని ఆప్యాయంగా ఆహ్వానించి ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఈ యువకుల్ని తమవారిగా చేసుకున్నారు. తమ తియ్యని సరళ వచనాలతో భగవద్దర్శనం కోసం ప్రాపంచిక సుఖభోగాలను పరిత్యజించాలనే సత్యాన్ని ఆ యువహృదయాలలో దృఢంగా పాదుగొల్పారు. తమ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్దేశించగలిగే అపూర్వమైన గురువు శ్రీరామకృష్ణులనే సత్యం వారికి ఆ క్షణమే స్ఫురించింది.
గురువారం కళాశాలకు సెలవు కావటం చేత అప్పటి నుండి ప్రతి గురువారం వెళ్ళి గురుదేవులను కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు శరత్. అత్యంత పవిత్రమూ, నిస్వార్థమూ అయిన శ్రీరామకృష్ణుల ప్రేమ అతణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. రోజులు గడిచేకొద్దీ గురుదేవుల పట్ల అతడు మరింత ఆకర్షితుడు కాసాగాడు. పదేపదే గురుదేవుల సాంగత్య ఫలితంగా మతాన్ని గురించి అతడి అభిప్రాయాలు స్పష్టం కాసాగాయి; శ్రీరామకృష్ణుల మార్గదర్శకత్వంలో సత్వరమే శరత్ ఆధ్యాత్మికమార్గంలో పురోగమించసాగాడు.
బాల్యం నుండే శరత్లో ఆధ్యాత్మిక అభిలాష ఎంతో ప్రగాఢంగా ఉండేది. జీవంలేని ధార్మిక భావాలను ఆచరించడం అతని గమ్యం కాదు, చివరకి భగవంతుని రూపాదులను దర్శించటమూ అతడు ఆకాంక్షించింది లేదు. జీవులందరిలోను భగవంతుణ్ణి దర్శించటమే అతని ఏకైక ధ్యేయం. ఆధ్యాత్మిక పురోగమనానికి ఇదే పరాకాష్ఠ అని, దానిని చేరటం అంత సులభం కాదనీ శ్రీరామకృష్ణులు చెప్పారు. దారిలో ఎన్ని కష్టాలను ఓర్చుకోవలసి వచ్చినా తాను సంసిద్ధుడననీ ఆ మహోన్నత లక్ష్యం తప్ప మరేదీ తనకు సంతృప్తికరం కాజాలదనీ సమాధానం చెప్పాడు ఈ యువశిష్యుడు. యువసాధకుని మనోనిబ్బరాన్ని చూసి గురుదేవులెంతగానో సంతసించి భవిష్యత్తులో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించనున్న నరేంద్రనాథ్‌తో స్నేహం చేయమని నిర్దేశించారు.
శ్రీరామకృష్ణులను దర్శించిన ఒక్క సంవత్సరంలో శరత్, నరేంద్రులు ఆప్త మిత్రులయ్యారు. 1884 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు శ్రీరామకృష్ణుల అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను నరేంద్రుడి నుండి విన్నాడు శరత్. ఫలితంగా గురుదేవులను గురించిన అతనికున్న మొదటి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. శ్రీరామకృష్ణులు కేవలం సామాన్యులైన ఒక సిద్ధ పురుషులు మాత్రమే కారనీ, తాను విన్న అవతార పురుషులలా, ప్రవక్తలలో ఒకరనే అభిప్రాయం అతడికి అప్పుడు కలిగింది.
సహజంగానే శ్రీరామకృష్ణుల పట్ల అతనికున్న శ్రద్ధాభక్తులిప్పుడు ఆకాశాన్నంటాయి. అచంచల విశ్వాసంతో అతడిప్పుడు శ్రీరామకృష్ణులను తన గురుదేవులుగా ఎంచి, పూర్తిగా ఆయనకు అన్ని రీతుల్లోను శరణాగతుడయ్యాడు. అప్పటి నుండి అతడు సమయాన్నంతా ఆధ్యాత్మిక సాధనలలో గడపసాగాడు. ఇక గురుదేవులు కూడా యువశిష్యునిలో గర్భితంగా ఉన్న ఉత్కృష్ట ఆధ్యాత్మిక బీజాన్ని గుర్తించి, అతని మీద తమ అపార అనుగ్రహాన్ని కురిపించారు.
ఇలా అంతా సవ్యంగా 1885 వ సంవత్సరం వరకు జరిగిపోసాగింది. ఆ సంవత్సర మధ్యకాలంలో తీవ్ర కంఠవ్రణంతో (క్యాన్సర్) వ్యాధిగ్రస్తులై చికిత్స కోసం కలకత్తాకు తోడ్కొని రాబడ్డారు శ్రీరామకృష్ణులు – భయంకరమైన ఈ వార్త అశనిపాతమైంది శరత్‌కు. చివరికదే వార్త అతని ఆధ్యాత్మిక పిపాసను వెయ్యింతలు ఇనుమడించింది. ప్రపంచమే తలక్రిందులైనట్లు భావించాడు శరత్. గురుదేవుల సేవ కోసం అప్పుడే చేరిన కలకత్తా వైద్య కళాశాలకు తిలోదకాలిచ్చి ఇంటిని విడిచిపెట్టి గురుదేవుల వద్దకు పరుగెత్తాడు. అప్పటి నుండి రాత్రింబగళ్ళు అక్కడే ఉంటూ గురుదేవులను సేవించసాగాడు. నాలుగు నెలల తర్వాత శ్రీరామకృష్ణులు అక్కడ నుండి కాశీపూర్‌కు కొనిపోబడ్డారు. గురుదేవులు జీవించి ఉన్నంత వరకూ సమధికోత్సాహంతో శరత్ ఆయనను సేవించాడు.
శ్రీరామకృష్ణులు అలా తీవ్ర రోగంతో బాధపడిన ఒక్క సంవత్సరకాలం యువశిష్యులకు ఒక సంకేతమైంది. నరేంద్రుని నాయకత్వంలో సంసారాన్ని పరిత్యజించి భవిష్యత్సన్న్యాసి సంప్రదాయానికి నాంది పలికారు. వారు గురుదేవులను సేవించటానికొచ్చినా నిజానికి సన్న్యాస జీవితపు శిక్షణను పొందింది ఇక్కడే. ఈ సమయంలో ఒక రోజు శరత్‌తో సహా మరికొందరు యువ శిష్యులు హైందవ సన్న్యాసికి ప్రత్యేకించబడిన కాషాయవస్త్రాలను స్వయంగా శ్రీరామకృష్ణుల నుండి స్వీకరించారు. అలాగే గురుదేవుల సూచన మేరకు తమలో వ్రేళ్ళూనిపోయి ఉన్న అహంభావనలను నిర్మూలించటం కోసమూ, భగవంతుడి మీద సంపూర్ణంగా ఆధారపడటానికీ భిక్షాటన ప్రారంభించినదీ ఇక్కడే. అట్టి ఆ యువశిష్యులు గురుదేవుల మూలంగా మహోన్నత ఆధ్యాత్మికాదర్శాలచే ప్రేరేపితులై లాంఛన ప్రాయంగా సన్న్యాసాశ్రమంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి ప్రాణసములైన గురుదేవుల సేవ, ఆధ్యాత్మికోన్నతికై ఏకాగ్ర భక్తితో సాధన తప్ప తక్కిన అన్నిటినీ విస్మరించారు.
భగవత్సాక్షాత్కారమనే పరమలక్ష్యం వారి హృదయాలలో గాఢంగా పాదుకు పోయింది. ప్రపంచం, దాని వ్యవహారాలు నాటి ఆకర్షణ వారి నుండి తొలగిపోయాయి. 1886, ఆగస్టు నెలలో శ్రీరామకృష్ణులు మహా సమాధి పొందారు. అప్పటి నుండి యువశిష్యుల మనోభీష్టం మరింత తీవ్రతరమైంది. కొద్ది రోజులలోనే కాశీపూర్‌కు అనతిదూరంగా బారానగరంలోని ఒక అద్దె ఇంట్లో ఒక మఠం నెలకొల్పారు. ఇష్టం లేకున్నా గురుదేవులు మహాసమాధి పొందిన తరువాత శరత్ ఇంటికి తిరిగిపోయాడు. మఠం ప్రారంభమైన తరువాత తరచు అక్కడికి వెళ్ళి సోదర శిష్యులతో కలిసి సాధన భజనలతో పాటు గురుదేవుల జీవితం, ఉపదేశాది ఆధ్యాత్మిక ప్రసంగాలను చేస్తూ సమయం వెళ్ళబుచ్చసాగాడు. శరత్ తండ్రికి తన కుమారుడెక్కడ సన్న్యాసం పుచ్చుకొంటాడోననే భయం పట్టుకొంది. తర్కం ద్వారా పుత్రుని మనస్సును ప్రాపంచిక జీవితం వైపుకు త్రిప్పలేక, సోదర శిష్యులను కలుసుకోకుండా చేయడంకోసం తండ్రి చివరికతణ్ణి, ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. దాంతో ఒకింతైనా చలించక తన ఏకాంత బంధనాన్నే భగవత్కృపగా, సదవకాశంగా ఎంచి మనస్సును పూర్తిగా సాధనలో నిమగ్నం చేయసాగాడు. కాని అన్న మీద జాలిపడి అతని తమ్ముడు రహస్యంగా తాళం తీశాడు. తక్షణం చల్లగా శరత్ ఇంటిని విడిచిపెట్టి తిన్నగా మఠానికి వెళ్ళాడు.
ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే అతడు మరికొందరు సోదర శిష్యులతో కలిసి స్వామి ప్రేమానంద స్వగ్రామం ఆంట్పూరుకు వెళ్ళాడు. అక్కడ ఏసుక్రీస్తు జన్మదినం నాటి రాత్రి అందరూ కలిసి ధునిని రగిలించి సాధనమగ్నులయ్యారు. నాటి రాత్రి ఏసుక్రీస్తు జీవితంచే ప్రేరేపితుడై ఆయన పవిత్రతను, త్యాగాన్ని గురించి నరేంద్రుడెంత సమధికోత్సాహంతో మాట్లాడాడంటే అక్కడున్న యువ శిష్యులందరూ సన్న్యాస దీక్షను స్వీకరించారు.
అలా ఒక్కొక్క మెట్టుగా హిందూ సన్న్యాస మార్గంలో పురోగమించసాగాడు శరత్. శ్రీరామకృష్ణుల భావిసన్న్యాస శిష్యులు ఆ కాలంలో బారానగరపు మఠంలో ఎంతటి కఠోర సాధనలు చేయసాగారో వర్ణించనలవికాదు. అన్న వస్త్రాదుల లోటును లక్షించక కఠోర భగవత్సాక్షాత్కార మార్గాన్ని సంతోషంతో వరించారు ఈ విద్యావంతులైన మధ్యతరగతికి చెందిన యువకులు. ఏకనిష్ఠతో వారు చేపట్టిన ఆధ్యాత్మిక సాధన నుండి మరే విషయమూ వారి మనస్సును వైదొలగ చేయలేకపోయింది. జపం, ధ్యానం, స్తోత్ర ప్రార్థనలు, శాస్త్రాధ్యయనం, ఆధ్యాత్మిక ప్రసంగాలలో గడవసాగింది వారి సమయమంతా. అలా తదేక దీక్షతో సాధన మగ్నులైన ఆ యువశిష్యులు తమ గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించ దలచుకోలేదు.
ఒక శుభముహూర్తంలో శాస్త్రాలు నిర్దేశించిన ‘విరజా హోమాన్ని’ నిర్వర్తించి, శాస్త్రోక్తంగా సన్న్యాసం పుచ్చుకొని సనాతన సన్న్యాసి సంప్రదాయంలో కలిసిపోయారు. నిజానికి వీరి సన్న్యాస జీవితం కాశీపూర్‌లో శ్రీరామకృష్ణుల చివరి దినాలలో ప్రారంభమై, నరేంద్రుని ప్రేరేపణతో ఆంట్పూర్లో వర్ధిల్లినా వైదికశాస్త్రాచారాన్ని అనుసరించి విధ్యుక్తంగా నిజమైన సన్న్యాసి జీవితం ప్రారంభమైంది ఈనాటి నుండే. జాతి, కుల, వంశాచారాలకు సంబంధించిన పూర్వాశ్రమ సంస్కారాల నన్నిటిని త్రోసిరాజని, తమ నామధేయాలకు, పదవులకు తిలోదకాలిచ్చి, నూతన నామధేయాలను స్వీకరించారు. నాటి నుండి శరత్ స్వామి శారదానంద అయినాడు.
తన సోదర సన్న్యాసుల మాదిరిగా త్వరలోనే పవిత్ర పరివ్రాజక జీవితాన్ని గడపాలనే తీవ్ర ఆకాంక్ష శారదానందను ఆవేశించింది. తన తోటి శిష్యుల సాంగత్యం, మఠపు నిశ్చింత జీవితం – ఇవి కూడా అతనికిప్పుడు బంధనాలుగా కానవచ్చాయి. ఆహార, ఆశ్రయాలకు కేవలం భగవంతుడొక్కడి మీదే ఆధారపడుతూ, ముక్తజీవుడుగా ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించాలనే వ్యాకులతతో అతడి హృదయం తపించసాగింది. శతాబ్దాలుగా సాధు సత్పురుషుల వాసంతో పవిత్రీకృతమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదీతీరాలు, హిమాలయోత్తుంగ శిఖరాలు అతడి పవిత్ర హృదయాన్నిప్పుడు తీవ్రంగా ఆకట్టుకోసాగాయి.
బారానగర్ను విడిచిపెట్టిన తర్వాత స్వామి మొదట జగన్నాథుని పూరీ క్షేత్రం చేరుకొన్నారు. కొంతకాలం అక్కడ బసచేసి తిరిగి వచ్చి, మళ్ళీ ఉత్తర భారత తీర్థాలకు పయనమైనారు. దారిలో కాశీ, అయోధ్యలను దర్శించి హృషీకేశ్ చేరి సాంప్రదాయక సన్న్యాసి జీవితాన్ని అనుసరించి కఠోర తపస్సు చేస్తూ కొన్ని నెలలు అక్కడ గడిపారు. 1890, వేసవి కాలంలో హిమాలయ శిఖరాల మీద నెలకొన్న కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను దర్శించారు. జూలై నెలలో అల్మోరాకు దిగి వచ్చి ఒక నెలరోజుల లోపుగానే వివేకానందను కలుసుకున్నారు. తర్వాత ఆయనతో కలిసి గర్వాల్ రాష్ట్రం గుండా మళ్ళీ హృషీకేశ్కు తిరిగి వెళ్ళాడు. పిదప వివేకానందతో కలిసి మీరట్, ఢిల్లీలలో కొంతకాలం గడిపి దారిలో మథుర, బృందావనం, ప్రయాగ క్షేత్రాలను దర్శించుకొని చివరకు కాశీ చేరుకొన్నారు. ఈ పుణ్యక్షేత్రంలో కొంతకాలం కఠోర తపస్సు చేశారు. ఫలితంగా రక్త విరేచనాలకు గురియైనారు. ఆ కారణంగా కోలుకోవటం కోసం 1891, సెప్టెంబరు నెలలో బారానగర మఠానికి తిరిగి వచ్చారు శారదానంద. కోలుకొన్న తదుపరి మాతృదేవిని దర్శించటం కోసం జయరాంబాటికి వెళ్ళారు.
స్వామి శారదానంద తీర్థపర్యటనల వివరాలను తెలుసుకోవచ్చు కానీ త్వరితగతిలో ఆధ్యాత్మిక ప్రగతి నొందిన ఆయన మనస్సును అర్థం చేసుకోవటం ఎవరికి సాధ్యం? ఎప్పుడు, ఎలా, ఏ విధానాల ద్వారా ఆయన మనస్సు ఆధ్యాత్మిక వికాసం పొందిందో వివరించటం దుస్సాధ్యం. కనుక అత్యంత ఆసక్తికరమైన ఆయన అంతరంగ జీవితం మూసిన పుస్తకంలాగా ఆయన హృదయంలోనే అజ్ఞాతంగా నిలబడిపోయింది.
1892 వ సంవత్సరంలో మఠం బారానగరం నుండి దక్షిణేశ్వరానికి ఒకింత దగ్గరగా ఉన్న ఆలంబజార్కు మార్చబడింది. ఇది జరగటానికొకింత ముందుకాలం నుండి, ఆ తర్వాత కూడా కొంతకాలం వరకు నరేంద్రుని ఆచూకీ ఎవరికీ తెలియరాలేదు. పరివ్రాజకావస్థలో అదృశ్యుడైపోయిన తమ సోదర శిష్యుడిప్పుడు సముద్రాలను దాటి ‘భారతీయ ఝంఝామారుత సన్న్యాసి’ గా అమెరికా సమాజం మీద విరచుకుపడ్డ వైనం హఠాత్తుగా తెలుసుకొని ఆ యువ సన్న్యాసులు ఆనందంతో పులకరించిపోయారు. 1894 మార్చి నుండి వివేకానంద స్వామి క్రమబద్ధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపసాగారు. ఉత్తరాల ద్వారా సంప్రదాయపరంగా వస్తున్న సన్న్యాసపు ఏకాంతం నుండి బయల్వెడలి, ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ’ (స్వంత ముక్తికి, జగత్సేవకు) అనే జంట ఆదర్శాలే తమ గమ్యంగా చేసుకొని ఒక కొంగ్రొత్త హిందూ సన్న్యాసి సంప్రదాయాన్ని స్థాపించవలసిందిగా సోదర శిష్యులను ప్రేరేపించసాగారు. రెండు సంవత్సరాల తర్వాత తన పాశ్చాత్య కార్యకలాపాలలో తోడ్పడటం కోసం స్వామి శారదానందను పాశ్చాత్యానికి రావించారు. నాయకుని ఆదేశానుసారం స్వామి శారదానంద 1896, ఏప్రిల్‌లో లండన్ చేరారు. మరొక్క నెల తర్వాత రెండవసారి అమెరికా నుండి స్వామి వివేకానంద లండన్‌కు వచ్చారు.
అప్పటికే స్వామి వివేకానంద న్యూయార్క్‌లో వేదాంత సంఘాన్ని స్థాపించారు. లండన్‌లో కొన్ని ఉపన్యాసాలిచ్చిన పిదప స్వామి శారదానందను న్యూయార్క్‌కి పంపించారు స్వామీజీ. అక్కడ వేదాంతం మీద హిందూమత భావాల, ఆదర్శాల మీద, యోగదర్శనం మీద చక్కని ఉపన్యాసాలు ఇచ్చి స్వామి శారదానంద వేదాంత ప్రచారాన్ని సుస్థిరం చేయసాగారు. అలాగే గ్రీనేకర్ తులనాత్మక మత సమావేశం, బ్రూక్లిన్ ఎథికల్ అసోసియేషన్ – ఈ సంస్థలలో పాల్గొని వాటి కార్యక్రమంలో ఇతోధికంగా దోహదం చేశారు. అలాగే న్యూయార్క్, బోస్టన్ సమాజంలోని ప్రముఖులకు వేదాంత లక్ష్యాలను, ఆదర్శాలను గురించి ఉపన్యసించి వారి జీవిత విలువలలో ఎంతో పరిణామం తీసుకువచ్చారు. స్వానుభవంతో నిండి హృదయాంతరాళం నుండి వెలువడిన స్వామి ప్రసంగాలు శ్రోతల హృదయాలలో ప్రగాఢంగా పాదుకుపోయేవి. అన్నిటి కంటే ఎక్కువగా ఆయన ధీరత్వం, ప్రశాంతత, విశాల దృక్పథం, నిస్వార్థ ప్రేమ, ఆప్యాయతలు అమెరికాలో ఆయనకు ఎందరో మిత్రుల్ని, భక్తుల్ని చేకూర్చాయి. ఇలా స్వామి శారదానంద నిర్దేశకత్వంలో వేదాంత సంఘపు కార్యం సుస్థిరం కాసాగుతున్నప్పుడు మళ్ళీ నాయకుని పిలుపు వచ్చింది. ఆ ఆదేశాన్ననుసరించి, పాశ్చాత్యాన్ని విడిచిపెట్టి 1898, జనవరి 12 వ తేదీ ఐరోపా మీదుగా భారతదేశానికి మరలారు స్వామి.
స్వామి వివేకానంద 1897, జనవరిలో అమెరికా నుండి భారతదేశానికి వచ్చారు. వచ్చిందే తడవుగా కొలంబో నుండి ప్రారంభించి అల్మోరా వరకు భారతీయ జాగృత శంఖారావాన్ని మ్రోగించసాగారు. మహాశక్తిమంతమైన తన ఉపన్యాసాలతో భారతీయుల హృదయాలను ఉఱ్ఱూతలూగించారు. అవిరామంగా అలా పని చేస్తూ కలకత్తాకు వచ్చి రామకృష్ణ సంఘాన్ని స్థాపించటం కోసం ప్రయత్నించసాగారు.
1897, మే నెల ‘రామకృష్ణ మిషన్’ ను స్థాపించారు. ఆయన వచ్చిన ఒక్క సంవత్సరం లోపల ఆలంబజార్ మఠం తాత్కాలికంగా బేలూర్‌లో నీలాంబర బాబు ఉద్యానగృహానికి మార్చబడింది. దీనికి పశ్చిమంగా కొద్ది దూరంలో ఉన్న ఒక స్థలాన్ని సుస్థిర రామకృష్ణ మఠాన్ని నెలకొల్పడం కోసం కొనుగోలు చేశారు. (ప్రస్తుత బేలూర్ మఠం ఇదే) ఈ పరిస్థితిలో రామకృష్ణ మిషన్ కార్యాలను సక్రమంగా నిర్వర్తించడం కోసం, రామకృష్ణ మఠపు కార్యాలను అజమాయిషీ చేయటం కోసం స్వామి శారదానంద రావలసిన అవసరం ఏర్పడింది. స్వామీజీ ఆయనను రప్పించింది ప్రత్యేకంగా దీనికోసమే.
స్వామి శారదానంద 1898 వ సంవత్సరం ఫిబ్రవరి తొలి దినాలలో నీలాంబరబాబు ఉద్యానగృహానికి తరలించబడిన మఠాన్ని చేరి ఆయన కోసం కేటాయింపబడిన కార్యాలను చేబట్టారు. 1899 ప్రారంభంలో ఇప్పుడు బేలూర్ మఠంగా ప్రసిద్ధి పొందిన స్థలానికి మఠం శాశ్వతంగా మార్చబడింది. తరువాత రెండు సంవత్సరాలలోపే రామకృష్ణ మిషన్ అసోసియేషన్‌ను చట్టబద్ధం చేసే ట్రస్టు దస్తావేజుని తయారుచేయించారు స్వామీజీ. చట్టబద్ధమైన ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా స్వామి శారదానంద నియుక్తుడైనారు.
ఈ సందర్భంలో మరో విషయాన్నిక్కడ విశదీకరించాలి. కొంతకాలం తర్వాత కార్యనిర్వహణ సౌలభ్యం నిమిత్తం రామకృష్ణ సంఘం రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అని రెండుగా విభజింపబడింది. ఈ విభజన కేవలం సంఘోద్దేశాన్ని చట్టబద్ధం చేయటం కోసమే అని పాఠకులు గ్రహించాలి. మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలకు ప్రాముఖ్యత నిస్తుంది. మిషన్ సంఘసేవాకార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తుంది. ఇది తప్ప ఈ రెండింటి మధ్య మరే తేడా లేదు.
స్వామి శారదానంద రెండు సంఘాలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించసాగారు. అత్యంత విశ్వసనీయుడైన అనుచరుడుగా జీవితాంతం స్వామి ఈ పదవినే మహానిష్ఠతో నిర్వర్తించారు. ఎందుకంటే స్వామీజీయే స్వయంగా శారదానందకు ఈ పనిని అప్పగించారు.
పాశ్చాత్యంలో నివసించి పాశ్చాత్య సంఘనిర్వహణా పద్ధతులను చక్కగా ఆకళింపు చేసుకొన్న శారదానంద తన అనుభవంతో శ్రీరామకృష్ణ సంఘ అంతర వ్యవహారాలనన్నిటినీ త్వరలోనే ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకువచ్చారు. ఆయన నిర్దేశంలో ఆధ్యాత్మిక సాధనలు, శాస్త్ర పఠనం, సంఘకార్యం, అన్నీ చక్కగా జరుగసాగాయి. పైగా తన పాశ్చాత్యానుభవాన్ని ఊతకఱ్ఱగా తీసుకొని మఠంలో చేరుతున్న యోగ్యులైన యువకులను ఎన్నుకొని వారిని ప్రచారకులుగా పాశ్చాత్యానికి పంపటానికి కావలసిన శిక్షణను కూడా ఇవ్వసాగారు స్వామి.
స్వామి శారదానందకు ఇన్ని పనులతోపాటు కొన్ని ఆవశ్యకమైన సమాజ సేవాకార్యాలను నిర్వర్తింపవలసి వచ్చింది. అమెరికా నుండి తిరిగి వచ్చిన కొన్ని నెలల్లోనే రామకృష్ణ మిషన్ కలకత్తా ప్లేగ్ సహాయ కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చింది. మరికొన్ని నెలల తర్వాత స్వామీజీ శిష్యుల్ని కొందరిని ఉత్తర భారత దేశంలోని చారిత్రక స్థలాలను చూపెట్టటానికి మార్గదర్శకుడిగా వారితో వెళ్ళవలసి వచ్చింది. మఠం బేలూరుకి మార్చబడిన తర్వాత ధనం అవసరమై దాని కోసం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వవలసి వచ్చింది. స్వామి వివేకానంద రెండవసారి పాశ్చాత్యానికి వెళ్ళటానికి (1899) ఒకింత ముందుగా స్వామి శారదానంద పశ్చిమ భారతం నుండి మఠానికి తిరిగివచ్చి తన దైనందిన కర్తవ్యాలను యథాశక్తితో మళ్ళీ నిర్వర్తించసాగారు. ఆ సంవత్సరాంతాన తూర్పు వంగదేశం (ప్రస్తుత బంగ్లాదేశ్) వెళ్ళి ఉత్తేజకరమైన ఉపన్యాసాలిచ్చి అనేకమందిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రజ్వలింప చేశారు స్వామి శారదానంద.
1900 సంవత్సరం చివరి భాగంలో స్వామి వివేకానంద రెండవ పాశ్చాత్య పర్యటన నుండి తిరిగి వచ్చారు. ఆయన 1901, జనవరిలో బేలూరు మఠ ట్రస్టు దస్తావేజు అమలుపరచారు. ఆయన జీవితకార్యం ముగిసింది. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ కార్యాలను ట్రస్టీల చేతికి – విశేషంగా అధ్యక్షుడైన స్వామి బ్రహ్మానందకు, ప్రధాన కార్యదర్శి స్వామి శారదానందకు అప్పగించి 1902, జూలైలో తనువు చాలించారు. ప్రియతముడైన తమ నాయకుని మరణం వారికెంత ఆఘాతం కలిగించిందో వర్ణించటం కష్టం. అయినా కూడా శ్రీరామకృష్ణుల మానసపుత్రుడు రామకృష్ణ సంఘాధ్యక్షుడైన స్వామి బ్రహ్మానంద ప్రేరణాత్మక మార్గదర్శకత్వంతో రామకృష్ణ మఠ, మిషనులకు సంబంధించిన మహాబాధ్యతను అతికౌశలంగా నిర్వర్తించసాగారు స్వామి శారదానంద.
కొద్దికాలంలోనే స్వామికి మరో బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. మూడు సంవత్సరాల నుండి వివేకానంద స్వామి నిర్దేశంతో ‘ఉద్బోధన్’ అనే వంగ మాసపత్రిక వెలువడసాగింది. మునుపు ఆ పత్రికను చక్కగా నిర్వహిస్తూ వచ్చింది స్వామి త్రిగుణాతీతానంద. ఇప్పుడాయన వేదాంతాన్ని ప్రచారం చేయటానికి ఆమెరికాకు వెళ్ళారు. పత్రికను నడిపే సామర్థ్యం కలిగినవారెవరూ లేకపోవటంచేత ఈ పత్రికను ఆపేయవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ బాధ్యతను స్వీకరించారు స్వామి శారదానంద. వివేకానంద ఆశించిన విధంగా శారదానంద అధీనంలో ఈ మాసపత్రిక ఎంతో ప్రాచుర్యం పొందసాగింది, దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అనేక సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలితంగా ఉద్బోధన్ మాసపత్రిక సొంత భవనానికి మారింది.
ఉద్బోధన్ అనే పేరుతో కలకత్తా బాగ్‌బజార్‌లో ఒక మంచి భవనాన్ని కట్టించారు, స్వామి శారదానంద. దీన్ని కట్టించటానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ సమయంలో మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు ఎవరైనా భక్తుల ఇండ్లలో బసచేసి, తిరిగి జయరాంబాటికి వెళ్ళేవారు. ఆమెకు ఒక శాశ్వతమైన బస లేకపోవటం ఎంతో అసౌకర్యంగా ఉండేది. పరమ మాతృభక్తులైన స్వామికి అది ఎంతో బాధాకరమైంది. కనుక ఎలాగైనా సరే ఆమె కోసం ఒక ఇల్లు కట్టించాలని నిశ్చయించుకొన్నారు. కట్టించడానికి కావలసిన ధనం లేనందున బాధ్యతనంతా తానే వహించి, తన పేర అప్పుచేసి బాగ్‌బజార్‌లో ఒక మంచి ఇల్లు కట్టించారు. ఈ ఇంటిలో పై అంతస్తు మాతృదేవికి, ఆమె సేవకులకు కేటాయించబడింది. 1909, మే 23 వ తేదీన తొలిసారిగా మాతృదేవి ఈ ఇంట్లో కాలు మోపారు. క్రింది భాగం ఉద్బోధన్ పత్రిక పనికి, అలాగే త్వరితగతిలో పెరుగుతున్న ఇతర వంగ గ్రంథాల కోసం (రామకృష్ణ – వివేకానంద సాహిత్యం) ఉపయోగింపబడసాగింది. మాతృదేవి నివసించడం చేత ‘మాయేర్ బాడి’ (మాతృ గృహం), ఉద్బోధన్ పత్రిక ప్రచురింపబడుతూండటం చేత ‘ఉద్బోధన్’ అని ఈ ఇంటికి పేర్లొచ్చాయి. వీటిలో ‘మాయేర్ బాడి’ అనే పేరు భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.
ఇల్లు కట్టించడానికి తీసుకొన్న అప్పు తీర్చడానికి స్వామి శారదానందకు ఒక చక్కని ఉపాయం తోచింది. ఆయన ఇప్పుడు శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను ప్రామాణికంగా, సమగ్రంగా రచించి ప్రచురింప దల్చుకున్నారు. రామకృష్ణ సంఘ దైనందిన వ్యవహారాలనన్నిటినీ చక్కగా నడపటంతో పాటు ఈ మహాకార్యాన్ని సమధికోత్సాహంతో చేపట్టారు స్వామి. ఇప్పుడాయన శ్రీరామకృష్ణుల చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటినీ అతికష్టంతో సేకరించసాగారు. జీవితచరిత్రను ప్రామాణికం చేయటంలోనూ, సేకరించిన విషయాలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, నిస్సందేహమని రూఢియైన సంఘటనలను మాత్రమే స్వీకరించే పనిలోనూ నిమగ్నుడయ్యారు. ఉద్బోధన్ కార్యాలయంలోని ఒక చిన్న గదిలో ఒక మూల ఎదుట ఒక చిన్న బల్ల పెట్టుకొని సంవత్సరాల తరబడి పరిశ్రమించారు స్వామి. వచ్చేపోయే దర్శనార్థులు, దైనందిన సంఘకార్యకలాపాలు – ఎన్ని అవరోధాలు కలిగినా అన్నింటినీ చూసుకొంటూ లభించిన మిగిలిన సమయాన్ని ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగ’ రచనకు వినియోగించసాగారు. ఈ ఉద్గ్రంథం ఇలా మొట్టమొదట వరుసగా 1909 సంవత్సరం నుండి ధారావాహికంగా ఉద్బోధన్లో ప్రచురింపబడసాగింది. తర్వాత 1911 నుండి 1918 సంవత్సరాల మధ్యకాలంలో గ్రంథం ఐదు భాగాలలో ప్రచురింపబడింది.
జాతి, మత, వర్గ వివక్షత లేకుండా ప్రజలలో విద్యాసంబంధిత సేవా కార్యాలను, ప్రజాసేవకు సంబంధించిన సేవాకార్యాలను నిర్వహింప ఒక ప్రత్యేక సంఘంగా ‘రామకృష్ణ మిషన్’ ఏర్పడింది. ఇలా రామకృష్ణ మఠానికి, మిషనుకు చెందిన కేంద్రాలు భారతదేశంలో ఎన్నోచోట్ల, విదేశాలలో కొన్నిచోట్ల స్థాపింప బడసాగాయి. కాలం గడిచేకొద్దీ ఇవి అధికరించాయి. వీటితోపాటు వరదలు, క్షామం, భూకంపం, అంటువ్యాధుల వంటి దుర్ఘటనలు ఎదురైనప్పుడు సన్న్యాసులు పునరావాస నివారణ కేంద్రాలను ప్రారంభించటం పరిపాటైంది. మఠ, మిషన్, ప్రధాన కార్యదర్శిగా నానాటికీ పెరుగుతున్న ఈ బాధ్యతల నన్నిటినీ నిర్దేశించటం ఎంతో కష్టంగా పరిణమించసాగింది. అయినా అన్నింటినీ అతి సామర్థ్యంతో నెరవేర్చసాగారు స్వామి. తన సహజ శాంతతతో మౌనంగా వ్యవహారాలన్నిటినీ నిర్దేశించసాగారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వామి ప్రశాంతంగా, చాకచక్యంగా చక్కబరచగలిగేవారు. అలా ఎంతో సాహసంతో, తెలివి తేటలతో సమస్యలను పరిష్కరించడం వలననే ఆ కాలంలో విద్రోహులుగా ప్రభుత్వం అనుమానానికి గురైన యువకులు కొందరు ఆధ్యాత్మిక పిపాసువులై రామకృష్ణ సంఘంలో చేరి ఎంతో ప్రజాసేవ చేయగలిగారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న ఆ రోజుల్లో ఆంగ్ల ప్రభుత్వం, సమాజ సేవాసంస్థలను కూడా అనుమానిస్తున్నప్పుడు స్వామి ప్రయత్నం వలననే రామకృష్ణ మిషన్ నిర్విఘ్నంగా తన సేవలను సాగించగలిగిందంటే అతిశయోక్తి కాదు.
స్వామి శారదానంద అవిరామంగా ఎన్నో పనులు అలవోకగా నిర్విర్తించే వారు. దీనికి ఆధారం అత్యంత గంభీరమైన ఆయన అంతర్జీవితమే. ఈ ఉత్సాహానికి, శక్తికి మూలప్రేరణ ఆయన ఆధ్యాత్మిక సాక్షాత్కారాలే అని చెప్పవచ్చు. ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి.
ఎంతటి అపాయకరమైన పరిస్థితులలో కూడా కించిత్తు చలించక ఎంత ప్రశాంతంగా ఉండేవారో స్వామి ఈ క్రింది సంఘటన స్పష్టం చేస్తున్నది. 1898 వ సంవత్సరాంతాన ఆయనొకసారి స్వామి వివేకానందను, ఆయన స్నేహితులను కలుసుకోవటం కోసం రావల్పిండి నుండి శ్రీనగర్ (కాశ్మీర్)కు గుఱ్ఱపు బండిలో పోతూన్నారు. దారిలో హఠాత్తుగా గుఱ్ఱం బెదిరిపోయి వాయువేగంతో కొండ క్రిందకు పరుగెత్తసాగింది. అదృష్టవశాత్తు దారిలో వంగి ఉన్న ఒక పెద్ద చెట్టు గుఱ్ఱం వేగాన్ని ఆపింది. ఒకింతైనా చలించకుండా ప్రశాంతంగా బయటకు వచ్చారు స్వామి. అదే క్షణంలో ఒక పెద్ద రాయి కొండ నుండి విరిగి పడివచ్చి స్వామికి కొన్ని అంగుళాల ప్రక్కనే ఉన్న గుఱ్ఱం మీద పడింది. తక్షణం గుఱ్ఱం చచ్చిపోయింది. తన జీవితమే అంతం కాబోయే ఆ సంఘటనను మహాప్రశాంతంగా స్థితప్రజ్ఞునిలా చూడసాగారు ఆత్మభావంలో సుస్థిరులైన స్వామి.
జీవన్ముక్తులైన స్వామి జీవితంలో అపాయకర సంఘటనలెన్నో గదా! 1896 వ సంవత్సరంలో నౌకలో లండన్‌కు పయనించసాగారు స్వామి. దారిలో పెద్ద తుఫాను చెలరేగి నౌకను అల్లకల్లోలం చేయసాగింది. ప్రయాణీకులు ఏడుస్తూ అటూ ఇటూ పరుగెత్తుకుపోయే దృశ్యాన్ని అతి ప్రశాంతంగా దర్శించ సాగారు స్వామి. తదనంతర కాలంలో ఏదో సందర్భంలో చిన్న పడవలో గంగా నదిని దాటుతున్నప్పుడు ఒక తుఫాను చెలరేగి పడవ దాదాపు మునిగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇదేమంత గమనించదగిన విషయం కాదన్నట్లు కదలక మెదలక ప్రశాంతంగా కూర్చుండిపోయారు స్వామి. అలా కూర్చున్న స్వామిని చూసి భయంతో గడగడలాడుతున్న తోటి ప్రయాణీకుడు చికాకుపడటం చూసి స్వామి నవ్వారు.
పూర్వజన్మలో తాను ఏసుక్రీస్తు అనుయాయుడననే దివ్యదృశ్యాన్ని స్వామి శారదానంద చూశారు. స్వామి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని జ్ఞప్తికి తీసుకువస్తున్నది. లండన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు స్వామి రోమ్ నగరానికి వెళ్ళి సెయింట్ పీటర్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన మనస్సు సమాధిమగ్నమైంది. ఆ సమయంలో కలిగిన అనుభూతి ఆయన జీవిత రహస్యంగానే ఉండిపోయింది. అయినా కూడా ఏసుక్రీస్తు శిష్యులలో ఒకరితో సంసర్గం కలిగివున్న ఈ పవిత్ర దేవాలయం స్వామికి తన పూర్వ జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చిందని, కనుకనే ఆయనలా పరిసరాలను మర్చిపోయారని మనం ఊహించవచ్చు.
మార్మికమైన ఇటువంటి సంఘటనల ద్వారా విశదమౌతున్న స్వామి శారదానంద ఆధ్యాత్మికౌన్నత్యం కొన్ని అరుదైన సందర్భాలలో వారిచ్చిన సూచనల ద్వారా ఋజువవుతున్నది. స్వామి దినచర్య పుస్తకంలో ప్రత్యక్షంగా ఆయన జగజ్జననిని తరచు దర్శించటం అక్కడక్కడ వ్రాసి ఉండటం మనకు కనబడుతుంది. స్వామి ‘భారతదేశంలో శక్తిపూజ’ అనే మరో వంగ పుస్తకం రచించారు. పుస్తకాన్ని అంకితం చేస్తూ స్వామి ఇలా “ఎవరి అనుగ్రహంతో రచయిత స్త్రీ లందరిలోను జగజ్జననిని దర్శించగలుగుతున్నాడో ఆమెకే (మాతృదేవికి) ఈ గ్రంథం పరమభక్తితో అంకితం చేస్తున్నాను” అని వ్రాశారు. ఆయన మనస్సు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత భూములను అధిరోహించిందో ఇది రూఢిపరుస్తున్నది. ప్రపంచాన్నంతా జగన్మాతగా దర్శించటమే తాంత్రిక సాధనల లక్ష్యం. పాశ్చాత్యం నుండి తిరిగి వచ్చిన రెండు సంవత్సరాలలోపే స్వామి శారదానంద తాంత్రిక సాధనలను అనుష్ఠించి, దాన్లో పరాకాష్ఠకు చేరారు.
తదనంతరకాలంలో తన ఆధ్యాత్మికానుభూతులను గురించి పదేపదే అడుగుతున్న తన సన్న్యాసి సేవకునికి చెప్పదల్చుకోకపోయినా ఈ సూచన ఆకస్మికంగా వారి నోట వెలువడింది : “నేను పొందని ఆధ్యాత్మికానుభూతులేవీ ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగం’ లో వ్రాయలేదు” అని చెప్పారు. మరి ఈ పుస్తకం ఆధ్యాత్మిక పరాకాష్ఠయైన నిర్వికల్పసమాధితోపాటు ఎన్నో రకాల ఆధ్యాత్మిక అనుభూతులతో నిండివుంది. అంటే స్వామి సాక్షాత్కారాలను మనం ఊహించుకోవలసిందే. ఆయన ఇక జీవన్ముక్తులై కేవలం మానవాళి శ్రేయస్సు కోసమే జీవితాంతం పాటుపడ్డారనే విషయం చెప్పటం అనవసరం.
రామకృష్ణ మఠం – రామకృష్ణ మిషన్ కార్యక్రమాలను నిర్వహించడం గురుదేవుల జీవితచరిత్రను రచించి ప్రచురించటం వంటి పనులతోపాటు అన్నింటి కంటే ముఖ్యమైన మరో పనిని చేపట్టారు స్వామి శారదానంద. అది మాతృదేవి ఆరోగ్యం, సౌకర్యాలను చూసుకోవటం. ఆమెను సాక్షాత్తు జగన్మాతృస్వరూపిణిగా దర్శిస్తూ, ఆమె సేవలో తన జీవితాన్నర్పించారు స్వామి. మాతృదేవి జయరాంబాటిలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా – ఎక్కడున్నా, ఎప్పుడూ ఆమె పట్ల శ్రద్ధ వహించేవారు. ఉద్బోధన్ కార్యాలయాన్ని ముఖ్యంగా మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు బసచేయడం కోసమే కట్టించారు. ఈ పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికీ, అప్పుచేయడానికీ వెనుకాడలేదు స్వామి. ఆ అప్పును తీర్చటానికి గాను ‘శ్రీరామకృష్ణ లీలాప్రసంగం’ రచిస్తూ, ప్రచురిస్తూ దాదాపు తొమ్మిది సంవత్సరాలు కఠోర పరిశ్రమచేశారు స్వామి. నిజానికి మాతృదేవిపై స్వామికున్న భక్తిప్రగాఢతను అంచనావేయడం కష్టం. ఉద్బోధన్ భవనంలో క్రింది అంతస్తులో ఒక చిన్న గదిలో కూర్చుని తనను తల్లి ద్వారపాలకునిగా పరిగణించుకొని ఆమెను చూడటానికి వచ్చే దర్శనార్థుల గుంపుల్ని అజమాయిషీ చేస్తూండేవారు. కొన్నిసార్లు క్రొత్తవారికి ఆయన తనను ‘తల్లి ద్వారపాలకునిగా’ పరిచయం చేసుకొని వినోదిస్తూండేవారు. మాతృదేవిని ఇలా సేవించటం సుకృతంగా భావించేవారని ఆయన ధోరణి నుండి తేటతెల్లమౌతుంది. 1920 లో తీవ్ర రోగగ్రస్థురాలై కడపటి సారిగా ఆమె ఉద్బోధన్లో ఉంటున్నప్పుడు స్వస్థురాలిని చేయడానికి ఆమె చికిత్సా విషయంలో, పథ్యం విషయంలో, సేవ విషయంలో స్వామి ఎంత శ్రమించారో వర్ణించటం అసాధ్యం. 1920 వ సంవత్సరంలో మాతృదేవి పరమపదించారు.
మూడు సంవత్సరాల తర్వాత 1923, ఏప్రిల్ నెలలో మాతృదేవి పుట్టిన జయరాంబాటిలో ఆమె జ్ఞాపకార్థం అందమైన ఒక ఆలయాన్ని నిర్మించారు స్వామి. ప్రతిష్ఠోత్సవ సమయంలో మాతృప్రేమ స్వామిని ఎంత ఆవేశించిందంటే, తల్లి వలె స్వామి కూడా అడిగినవారందరికీ మంత్రదీక్ష నిచ్చి వారి జీవితాలను ఆధ్యాత్మికమయం చేశారు. ఉత్సవ దినాలలో స్వామి నుండి ఒక మహా ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిరావటం అనేకులు గమనించివున్నారు.
ఒక దీర్ఘయజ్ఞమైన స్వామి జీవితంలో తుది ఆహుతి మాతృదేవి మందిర ప్రతిష్ఠ అని పేర్కొనవచ్చు. అప్పటికే మహాపురుషులైన సోదరశిష్యులు కొందరు పరమపదాన్ని చేరారు. ఆ తర్వాత మాతృదేవి మహాసమాధి చెందారు. మరో రెండేళ్ళ లోపే శ్రీరామకృష్ణుల మానసపుత్రుడు, మొదటి సంఘాధ్యక్షుడు అయిన బ్రహ్మానంద స్వామి కూడా నిష్క్రమించారు. ఈ సంఘటనలు స్థితప్రజ్ఞుని వంటి శారదానందను కూడా కదలించివేశాయి, కార్యోత్సాహాన్ని సడలించివేశాయి. కనుకనే మాతృదేవి ఆలయం కట్టడం, ప్రతిష్ఠాపన కార్యాలు పూర్తి అయినప్పటి నుండి స్వామి దాదాపు దైనందిన కార్యాల నుండి వైదొలగి ఎక్కువ కాలం ధ్యానంలో గడప సాగారు. రచన కూడా పూర్తిగా ఆగిపోయింది. తన మహత్తర రచనయైన ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగ’ ను ఇక అంతటితోనే ఆపివేశారు.
ప్రస్తుతం స్వామి లక్ష్యం అంతా రామకృష్ణ సంఘంలో చేరుతున్న కొత్త సన్న్యాసులలో, బ్రహ్మచారులలో సంఘప్రతిష్ఠాపకుడైన స్వామి వివేకానంద నెలకొల్పిన భావాలను, ఆదర్శాలను దృఢంగా పాదుగొలపడం; భవిష్యత్తులో సంఘ కార్యభారాన్ని చేపట్టగలగడం కోసం యోగ్యులైన కొందరు యువ సన్న్యాసులకు తగిన శిక్షణ నివ్వటం. అందుకోసంగా 1926 వ సంవత్సరంలో ఒక మహా సమావేశాన్ని ఏర్పరచి మఠం, మిషన్ కేంద్రాలన్నిటి నుండి ప్రతినిధుల్ని ఆహ్వానించారు. సమావేశ ఉపోద్ఘాత ఉపన్యాసంలో మహావిజృంభణంతో ముందు కేగుతున్న రామకృష్ణ సంఘ పుట్టుక, వ్యాప్తిని ప్రస్తావించి, దారిలో అది ఎదుర్కొనే ఆటంకాలను ఎత్తిచూపి, సంఘనాయకుడు నెలకొల్పిన ఆదర్శాలను పూర్తిగా అనుష్ఠించి ఈ అడ్డంకులను అధిగమించి లక్ష్యాన్ని చేరమని అందరికీ ఉద్బోధించారు. ఈ సందర్భంగానే సంఘకార్యపరిపాలనకు సంబంధించిన సమస్యలను గురించి సంఘకార్యనిర్వాహకునికి సలహాలిచ్చి తోడ్పడటం కోసం కొంతమంది సన్న్యాసులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పరచారు స్వామి. అప్పటికే వయోవృద్ధులౌతున్న సన్న్యాసులొక్కొక్కరుగా ఈ భూమి నుండి వెళ్ళిపోతూవుండడం చేత భవిష్యత్తులో బరువైన బాధ్యతలను స్వీకరించగలిగే యువసన్న్యాసులను తయారుచేయడం యుక్తియుక్తమే గదా! స్వామి శారదానంద అలా నెలకొల్పిన ఈ కార్యనిర్వాహక వర్గం ఆ సమయంలో తాత్కాలిక ప్రయోజనాన్ని సాధించటంతో పాటు సుస్థిరమైపోయి ఈనాటికీ సంఘోద్దేశాలను అమలుపరచటానికి ఎంతగానో దోహదం చేస్తూవుంది. రామకృష్ణ సంఘ భావాదర్శాలను అలా ఎత్తిచూపించి, దైనందిన జీవితంలో వాటినెలా అభ్యాసించాలో చూపెట్టి, సంఘయువ సభ్యులకెంతో ప్రేరణనిచ్చి, దాదాపు ముప్ఫై ఏండ్ల వెనుక ప్రియతమ నాయకుడైన స్వామి వివేకానంద తన కప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి, ప్రశాంతంగా తన కార్యం నుండి నిష్క్రమించి 1927, ఆగష్టు 19 న మహాసమాధి చెందారు స్వామి శారదానంద.
జీవన్ముక్తుడైన మహాపురుషుణ్ణి జీవితంలోని ఏ విధినియమాలు బంధించ లేవు. విశ్వరహస్యాన్ని తెలుసుకొని, సర్వం బ్రహ్మమయంగా ప్రత్యక్షం చేసుకున్న వ్యక్తికిక ఏ విధీ, ఏ కార్యమూ ఉండదు. అయినా కూడా భగవత్సంకల్పంతో మానవాళి శ్రేయస్సుకై పాటుపడటానికి పూనుకున్నప్పుడు అతడు పోషించవలసిన పాత్రకు తగిన విశేష గుణాలు కొన్ని అతనిలో వ్యక్తమౌతూంటాయి.
ఈ ప్రపంచనాటక రంగంలో స్వామి శారదానంద పాత్ర ఆదర్శ కర్మ యోగి ఎలా జీవించాలో ఎత్తిచూపటానికి జగజ్జనని ప్రవేశపెట్టినట్లనిపిస్తుంది. పరిపూర్ణమైన నిస్సంగత్వంతో, ఆత్మ నిగ్రహంతో కూడినవారై తన విధ్యుక్తకర్మలను అవి ఎంత చిన్నవైనా సరే, పెద్దవైనాసరే – అన్నిటి మీద పరిపూర్ణ శ్రద్ధ వహించి నిర్దిష్టంగా నిర్వర్తిస్తూ వచ్చారు. నిందాప్రశంసలను, విఘ్నాలను లక్ష్యపెట్టక పవిత్రమైన తన నిర్దిష్టమార్గంలో ముక్కుసూటిగా ముందుకు వెళ్ళారు.
నిజంగానే స్వామి శారదానంద, స్వామి వివేకానంద ఎత్తి చూపించిన ఆదర్శ కర్మయోగిగా జీవించారు. యుక్తితోకూడిన మనస్సు, దయాపూర్ణమైన హృదయం, సమధికోత్సాహం, అరుదైన కార్యనిర్వాహక శక్తి – ఇవి ఆదర్శ కర్మయోగియైన స్వామి గుణాలు. ప్రతి ఒక్కరిలోను స్వామి వివేకానంద చూడదల్చిన ‘అనంత సహనం, అద్వితీయ పవిత్రత, అసామాన్యధీరత్వం’ – ఇవి స్వామి రక్తంలో ప్రవహించాయి. శారదానంద ధీరత్వాన్ని చూసి స్వామీజీ ఒకప్పుడు, ‘శరత్ రక్తం చేపరక్తం వంటిది. ఏదీ దాన్ని ఉద్రేకపరచలేదు’ అని అభివర్ణించారు. ‘సముద్రం వంటి అగాధాన్ని, ఆకాశం వంటి విశాలత్వం’ సంతరించుకొంది స్వామి శారదానంద హృదయం.
నికృష్టమైన పాపిలో కూడా గర్భితంగా ఉన్న దివ్యత్వాన్ని చూస్తూ అపార ప్రేమ, సహాయానుభూతులతో దాన్ని వ్యక్తం చేయించటం కోసం చివరి వరకూ పాటుపడేవారు స్వామి. సహచరులచే కూడా గెంటబడిన ముక్కోపులు, పోట్లాడే వ్యక్తులు కూడా స్వామి దయతో ఆయన ఆశ్రయాన్ని పొందేవారు. “నిజమైన త్యాగి అందరినీ సమదృష్టితో చూస్తూ, అందరినీ సమాన ప్రేమతో సేవించుతాడు” అనే వివేకానందుల ఉక్తి స్వామి విషయంలో అక్షర సత్యం.
తాను గొప్పవాడననే ఆలోచన లేకుండా అందరినీ సరిసమాన ప్రేమతో, ఆప్యాయతతో చూసేవారు స్వామి. వ్యక్తిగత సౌకర్యాల గురించి ఏనాడు ఖాతరు చేయలేదు స్వామి. శిష్యుల నుండి కూడా ఎప్పుడో చాలా అరుదుగాగాని సేవను స్వీకరించేవారు కారు. ఇతరులకు తోడ్పడటం కోసం ఎన్ని కష్టాలకు ఓర్వడానికైనా, చివరకు ప్రాణత్యాగం చేయడానికైనా ఆయన ఎప్పుడూ సంసిద్ధులే.
హిమాలయాల్లో సంచరిస్తూన్నప్పుడొకసారి ఒక కొండదిగి, లోయను దాటవలసి వచ్చింది. ఆ సమయంలో తనలాగే ప్రయాణం చేస్తున్న ఒక వృద్ధస్త్రీని చూచి జాలిపడి తక్షణం తన చేతికఱ్ఱను ఆమెకు అందించారు. తన అసౌకర్యాన్ని, చేతి కర్రలేకపోతే తనకు వాటిల్లే అపాయాన్ని కూడ లక్ష్యపెటలేదు. అలాగే భయంకరమైన అంటువ్యాధులు సోకి, సొంత బంధుగణం కూడా దగ్గరకు రానటువంటి రోగుల దగ్గరకు స్వామి తరచు వెళ్ళేవారు. సహించలేని మనో యాతనలతో బాధపడేవారిని ప్రేమపూరితమైన స్వామి పలుకులు అమృత సమంగా ఊరడించేవి. స్వామి వ్యక్తిత్వ విశేషగుణం ఆయన మామూలు ప్రవర్తనలో వ్యక్త మయ్యేది. సరైన ప్రవర్తనకు అందరికీ అదొక గుణపాఠం. సభ్యతతో వ్యవహరించడంలో సుశిక్షితులైనవారు కూడా స్వామి ప్రవర్తనను చూసి ముగ్ధులయ్యేవారు. యువకులు వేసే పనికిమాలిన ప్రశ్నలను కూడా ఓపికతో విని తియ్యని పలుకులతో సరైన సమాధానాలిచ్చే వారి ధీరత్వం ఆశ్చర్యాన్ని కలిగించేది. అపరాధుల్ని మందలించేటప్పుడు కూడా ఆయన తియ్యని పలుకులు వారి బాధను తొలగించేవి. నిజానికి ఆయన పలుకులు బిడ్డల్ని మందలించే తల్లి పలుకుల్లా కనపడేవి. అయినా కూడా మహాగాంభీర్యంతో కూడిన ఆ పలుకులు అపరాధి హృదయాన్ని పరివర్తనం చేసి ఆశించిన ఫలితాన్ని కల్గించేవి.
ఇక శారదానంద స్వామి పనిచేసే తీరు లక్షింపవలసిన విషయం అంతా క్రమబద్ధంగాను, అందరికీ గుణపాఠంగాను ఉండేది. నిదానం, ధీరత్వం, ప్రశాంతితో కూడిన నడవడికతో ప్రతి ఒక్కపనిని కావలసినంత ఏకాగ్రతతో నెరవేర్చేవారు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్క పనినీ పవిత్రమైన భగవత్పూజా సమంగా చేసేవారాయన. సదా నిదానం పాటిస్తూ, అసంపూర్ణమైన వివరాలను తీసుకొని తక్షణమే ఏ తీర్మానానికి వచ్చేవారు కాదు. వ్యక్తులు, వారి కార్యకలాపాల గురించి వ్యవహరించేటప్పుడు యుక్తి, సానుభూతితో కూడిన దృష్టితో మెలగేవారు.
అన్నిటినీ నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రీతిలో ఉంచడమనేది వారి అంతర్గతమైన సుగుణంగా శోభించేది. తన అవసరాలు ఎంతో తక్కువైనప్పటికీ తన చుట్టూ అన్నీ పొందికగా, నిర్దిష్టంగా ఉండేటట్లు చూచేవారు. ఈ గుణం బహుశా గురుదేవుల ఉదాహరణతో మరింత బలపడి ఉండవచ్చు. ఎందుకంటే నిరాడంబరతలో, నిర్దిష్టత్వంలో శ్రీరామకృష్ణులు అద్వితీయులు.
పైన అభివర్ణించిన ‘శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగ’ రచయిత అయిన స్వామి శారదానంద జీవిత చరిత్ర నుండి, రామకృష్ణ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎటువంటి పాత్రను పోషించారో పాఠకులు కొంతలో కొంత ఊహించుకోవచ్చు.
ఆత్మసాక్షాత్కారంతో పాటు జగత్ కళ్యాణానికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ స్వామి శారదానంద పవిత్ర జీవితం ఒక ఉత్కృష్ట అనుసరణీయమైన దృష్టాంతంగా, శాశ్వతంగా నిలిచిపోవడం తథ్యం. – స్వామి నిర్వేదానంద
శ్రీరామకృష్ణుల పాదుకలు
సపార్షద శ్రీరామకృష్ణ స్తోత్రమ్
– స్వామి శారదానంద
సర్వధర్మస్థాపకస్త్వం సర్వధర్మస్వరూపకః ।
ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయ తే నమః ॥
యథాగ్నేర్దాహికాశక్తి రామకృష్ణే స్థితా హి యా ।
సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహమ్ ॥
పరతత్త్వే సదా లీనో రామకృష్ణసమాజ్ఞయా ।
యో ధర్మస్థాపనరతో వీరేశం తం నమామ్యహమ్ ॥
కాళిందీఫుల్లకమలే మాధవేన క్రీడారత ।
బ్రహ్మానంద నమస్తుభ్యం సద్గురో లోకనాయక ॥
యోగానందః ప్రేమానందశ్చాన్యే వై యే చ పార్షదాః ।
రామకృష్ణగతప్రాణాః సర్వాంస్తాన్ ప్రణమామ్యహమ్ ॥
శ్రీరామకృష్ణ స్తవమ్
– స్వామి వివేకానంద
ఆచణ్డాలా ప్రతిహతరయో యస్య ప్రేమప్రవాహః
లోకాతీతోఽప్యహహ న జహౌ లోకకళ్యాణ మార్గమ్ ।
త్రైలోక్యేఽప్యప్రతిమ మహిమా జానకీ ప్రాణబంధో
భక్త్యా జ్ఞానం వృతవరవపుః సీతయా యో హి రామః ॥
స్తబ్ధీకృత్య ప్రళయకళితం వాహవోత్థం మహాన్తం
హిత్వా రాత్రిం ప్రకృతి సహజా మన్ధతామిస్రమిశ్రామ్ ।
గీతం శాన్తం మధురమపి యః సింహనాదం జగర్జ
సోఽయం జాతః ప్రథితపురుషో రామకృష్ణస్త్విదానీమ్ ॥
నర దేవ దేవ జయ జయ నరదేవ
శక్తి సముద్ర సముత్థ తరంగం
దర్శిత ప్రేమ విజృంభిత రంగమ్ ।
సంశయ రాక్షస నాశ మహాస్త్రం
యామి గురుం శరణం భవవైద్యమ్ ॥
నర దేవ దేవ జయ జయ నర దేవ
అద్వయతత్త్వ సమాహిత చిత్తం
ప్రోజ్జ్వల భక్తి పటావృత వృత్తమ్ ।
కర్మకళేవర మద్భుత చేష్టం
యామి గురుం శరణం భవవైద్యమ్ ॥
నర దేవ దేవ జయ జయ నర దేవ
ఎవరి ప్రేమప్రవాహం చండాలుని పర్యంతం అప్రతిహత వేగంతో ప్రవహించిందో (అంటే చండాలురను సైతం అకుంఠితంగా ప్రేమించటానికి వెనుతీయలేదో), ఎవరి స్వభావం ప్రపంచాతీతమైనా కూడా లోకకళ్యాణ మార్గాన్ని పరిత్యజించలేదో, ఎవరి మహిమ ముల్లోకాల్లో అసమానమో, ఎవరు సీతాదేవికి ప్రాణాధికుడో, ఎవరి ఘనీభవించిన భక్తి అనే దేహం జ్ఞానమనే వస్త్రంతో కట్టబడి ఉండేదో ఆ సీతారాముడే.
మళ్ళీ శ్రీకృష్ణుడుగా అవతరించి కురుక్షేత్ర యుద్ధసమయంలో చెలరేగిన ప్రళయకాలతుల్య ఘోరరవాన్ని నిశ్శబ్దం చేశాడో; ప్రకృతి సహజ ఘోర అంధకారమనే అర్జునుని అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేశాడో; అంతేగాక ప్రశాంతమూ సుమధురమూ అయిన గీతోపదేశాన్ని సింహగర్జనతో బోధించాడో ఆ సువిఖ్యాత పురుషుడే ఇప్పుడు తిరిగి శ్రీరామకృష్ణ రూపంలో అవతరించాడు.
హే నరదేవదేవ! నీకు జయమగుగాక! ఎవరు శక్తి అనే సముద్రం నుండి లేచిన ఒక మహాతరంగ స్వరూపుడో, ఎవరు నానా ప్రేమ లీలలను ప్రదర్శించారో, ఎవరు సందేహాలనే రాక్షసులను నాశనం చేయగల్గిన మహాస్త్ర స్వరూపులో, ఎవరు భవరోగాన్ని నయం చేయగల వైద్యస్వరూపులో ఆ సద్గురుని శరణు పొందుతున్నాను.
హే నరదేవదేవ! నీకు జయమగుగాక! ఎవరి చిత్తం సదా అద్వయ బ్రహ్మంలో సమాహితమై (సుప్రతిష్ఠితమై) ఉంటుందో, ఎవరి ఘనీభవ జ్ఞానదేహం భక్తి అనే వస్త్రంతో ఆచ్ఛాదితమో, ఎవరి దేహం ఆమరణాంతం లోకహిత కర్మల్లో నియుక్తమో, ఎవరి కర్మలీలలు మహాద్భుతాలో ఆ భవవైద్యుని, ఆ సద్గురుని శరణు పొందుతున్నాను.
కుర్మస్తారక చర్వణం
త్రిభువన ముత్పాటయామో బలాత్ ।
కిం భో న విజానాస్యస్మాన్
రామకృష్ణదాసా వయమ్ ॥
క్షీణాః స్మ దీనాః సకరుణా జల్పన్తు మూఢా జనాః
నాస్తిక్యన్త్విదన్తు అహహ దేహాత్మవాదాతురాః ।
ప్రాప్తాస్మ వీరా గతభయా అభయం ప్రతిష్ఠాం యదా
ఆస్తిక్య న్త్విదన్తు చినుమః రామకృష్ణదాసా వయమ్ ॥
పీత్వా పీత్వా పరమమమృతం వీతసంసారరాగాః
హిత్వా హిత్వా సకల కలహ ప్రాపిణీం స్వార్థ సిద్ధిమ్ ।
ధ్యాత్వా ధ్యాత్వా గురువరపదం సర్వకళ్యాణ రూపం
నత్వా నత్వా సకలభువనం పాతుమామంత్రయామః ॥
ప్రాప్తం యద్వైత్వనాది నిధనం వేదోదధిం మథిత్వా
దత్తం యస్య ప్రకరణే హరిహర బ్రహ్మాది దేవైర్బలమ్ ।
పూర్ణంయత్తు ప్రాణసారైర్భౌమ నారాయణానాం
రామకృష్ణ స్తనుంధత్తే తత్పూర్ణ పాత్ర మిదం భోః ॥
నక్షత్రాలను పొడిపొడిచేద్దాం. త్రిభువనాలను పెకలించివేద్దాం. మనం ఎవరమో మీకు తెలియదా? మనం శ్రీరామకృష్ణ దాసులం. భయమా? ఛీ ఛీ ఎవరిని చూసి భయం?
శరీరంతో తాదాత్మ్యం చెందిన బుద్ధిహీనులే ‘మేం బలహీనులం, మేం దీనులం’ అని వాపోతారు. భయాతీతమైన స్థితిని బడసిన మనం ఇక భయపడవలసిన అవసరంలేదు. మనం ధీరులమైనాం. ఇదే ఆస్తికత, శ్రీరామకృష్ణ దాసులమైన మనం దీన్నే కోరుకొందాం.
పరమామృతాన్ని మాటిమాటికి గ్రోలుతూ, సంసారంలోని అనురాగాన్ని వదలినవారమై, అన్ని కలహాలకు తల్లి అయిన స్వార్థపరత్వాన్ని వదలివేసి, సకల కళ్యాణరూపమైన గురుదేవుని పాదపద్మాలను సదా ధ్యానిస్తూ వినమ్రతా మూర్తులమై ఆ అమృతపానంలో పాల్గొనమని సకల ప్రపంచాన్ని ఆహ్వానిద్దాం.
అనంత వేద మహాసముద్ర మథనంచేత ఏ అమృతం ఉద్భవించిందో, దేనిలోకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తినంతా గుమ్మరించారో, ఏది నారాయణుని అవతారమూర్తులందరి ప్రాణసారంతో నిండుకొన్నదో, ఆ అమృత కలశాన్ని శ్రీరామకృష్ణులు పూర్ణరూపంలో తనలో ధరించివున్నారు.