1. డాక్టర్ రాజేంద్ర చికిత్సలో గురుదేవుల ఆరోగ్యం కించిత్తు మెరుగుపడడం
కాశీపూర్‌కు వచ్చిన తరువాత శ్రీరామకృష్ణులు ఒకసారి క్రిందికి దిగివచ్చి, కాసేపు తోటలో పచార్లు చేశారు. బలహీనత కారణం తరువాత పదిహేను రోజుల దాకా మళ్ళీ క్రిందికి దిగిరాలేదు. ఆ సమయంలో చికిత్సలో ఎలాంటి మార్పు చేయకపోయినా, డాక్టర్ మాత్రం మారాడు. బాగ్ బజార్‌కు చెందిన సంపన్న, విఖ్యాత అక్రూర్ దత్త కుటుంబంలో డాక్టర్ రాజేంద్రనాథ దత్త జన్మించాడు. అతడు ఎంతో వ్యయప్రయాసలకోర్చి హోమియో వైద్యం అధ్యయనం చేసి, కలకత్తాలో హోమియోపతి వైద్యవిధానాన్ని ప్రచారం చేశాడు. డాక్టర్ రాజేంద్రతో సన్నిహితం కారణంగా డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్, హోమియోపతి వైద్య ప్రభావ సామర్థ్యాల పట్ల నమ్మకం పొంది, ఆ వైద్య విధానాన్ని పాటించాడు.
లోకుల ద్వారా శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి డాక్టర్ రాజేంద్ర విన్నాడు. తాను కనుక ఆయన వ్యాధిని నయం చేయగలిగితే, హోమియోపతి వైద్యవిధానం ఖ్యాతి గాంచుతుందని అతడు గ్రహించాడు. ఎంతో యోచించి ఆ వ్యాధికి ఒక మందును ఎంపిక చేశాడు. గిరీష్ తమ్ముడైన అతుల్‌తో రాజేంద్రకు పరిచయం ఉంది. ఈ సమయంలోనే అతడు అతుల్‌ను ఎక్కడో కలుసుకొని గురుదేవుల వ్యాధి గురించి ప్రస్తావించి ఉంటాడని మాకు గుర్తు. తరువాత గురుదేవులకు చికిత్స చేయాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అతుల్‌తో “దీర్ఘాలోచనానంతరం ఒక ఔషధాన్ని ఎంపిక చేశానని (డాక్టర్) మహేంద్రతో చెప్పండి. ఇది సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. అతడికి ఎలాంటి అభ్యంతరం లేకుంటే ఈ ఔషధాన్ని ఒకసారి ప్రయత్నించి చూస్తాను” అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అతుల్ ఈ విషయాన్ని భక్తులకూ, డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌కూ తెలియచేశాడు. ఎవరూ అభ్యంతరం వెలిబుచ్చకపోవడంతో, డాక్టర్ రాజేంద్ర, గురుదేవులను పరీక్షించడానికి వచ్చాడు. వ్యాధి ఆద్యంతాల వివరాలన్నీ సావధానంగా విని అతడు ‘లైకోపోడియం 200’ అనే ఔషధాన్ని వాడమని ఇచ్చాడు. ఆ ఔషధం పుచ్చుకొన్నాక దాదాపు పదిహేను రోజుల పైబడి శ్రీరామకృష్ణుల ఆరోగ్యంలో మెరుగు కానవచ్చింది. దాంతో త్వరలోనే ఆయన బలాన్ని, ఆరోగ్యాన్ని పుంజుకోగలరని భక్తులు ఆశించారు.
2. శ్రీరామకృష్ణుల ఆత్మవ్యక్తీకరణ – అభయ ప్రదానం
పుష్యమాసంలో సగం గడిచిపోయింది. అది 1886 వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ. ఈ రోజు శ్రీరామకృష్ణులకు ఒంట్లో కొంత కులాసాగానే ఉంది. గదిలో నుండి బయటకు వచ్చి, తోటలో కాసేపు పచార్లు చేయాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. నాడు సెలవు కావడంతో గృహస్థ భక్తులు మధ్యాహ్నం తరువాత ఒక్కరొక్కరుగా, జట్లుగా రాసాగారు. మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామకృష్ణులు క్రిందికి దిగివచ్చేసరికి ముప్ఫై మందికి పైగానే భక్తులు వచ్చి ఇంట్లోను, బయట చెట్లక్రింద మాట్లాడుకొంటూ కనిపించారు. ఆయనను చూడగానే వారంతా గౌరవపురస్సరంగా లేచి, ఆయనకు ప్రణామాలు చేశారు. ఆయన తోటబాట మీద మెల్లగా నడుస్తూదక్షిణ ద్వారం వైపుగా వెళ్ళసాగారు. భక్తులు కాస్త దూరంలో ఆయనను అనుసరించారు. ఆయన దారి మధ్యకు వచ్చేసరికి చెట్ల క్రింద కూర్చుని మాట్లాడుకొంటున్న గిరీష్, రాం, అతుల్, మరి కొందరు కనిపించారు. ఆయనను చూడగానే వారు ప్రణామాలర్పించి ఆనందంగా ఆయన వద్దకు వచ్చారు.
హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, గిరీష్‌ను సంబోధిస్తూ “గిరీష్, ప్రతి ఒక్కరి తోను ఎక్కడంటే అక్కడ దీనిని (తమను) గురించి (అవతారమని) చెబుతున్నావని తెలిసింది. అలా చెప్పడానికి (తమలో) ఏం చూశావు, ఏం అవగతం చేసుకొన్నావు?” అని అడిగారు. ఆ మాటలు విని గిరీష్ ఏమాత్రం చలించకుండా, శ్రీరామకృష్ణుల పాదాలకు మోకరిల్లి, చేతులు జోడించి, ముఖాన్ని పైకెత్తి, గద్గద స్వరంలో, “ఎవరి మహత్త్వాన్ని వ్యాస వాల్మీకాదులు సైతం వర్ణించలేరో, అటువంటి వారిని గురించి మరేం చెప్పగలను?” అని అన్నాడు.
భక్తిప్రపత్తులు ఉట్టిపడే గిరీష్ పలుకులు విని, శ్రీరామకృష్ణులు ముగ్ధులై, అక్కడ గుమిగూడిన భక్తులందరిని ఆశీర్వదిస్తూ, “ఇంక చెప్పడానికేముంది? మీ అందరిలో ఆధ్యాత్మిక జాగృతం కలుగుగాక! మీ అందరిలో ఆధ్యాత్మిక జాగృతం కలుగుగాక! మీ అందరిలో ఆధ్యాత్మిక జాగృతం కలుగుగాక!” అని అన్నారు. అలా అంటూ, భక్తుల పట్ల కృపాళువులైన శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులైనారు.
3. భక్తుల ఆధ్యాత్మిక జాగృతి
స్వార్థగంధరహితమైన ఆ గంభీర ఆశీర్వచనాలు ప్రతి భక్తుని హృదయంలో సూటిగా ప్రవేశించి వారిని ఆనందంలో ముంచెత్తివేశాయి. వారు దేశకాలాలను మరచిపోయారు. గురుదేవుల వ్యాధినీ మరచిపోయారు. కోలుకోనంత వరకు ఆయనను తాకరాదనే తమ నిర్ణయాన్ని విస్మరించారు. తన పైటకొంగు కప్పి బిడ్డను పరిరక్షించే మాతృమూర్తిలా తమ క్లేశాలను చూసి ఆ కష్టాలు తానే అనుభవిస్తూ బాధపడుతున్నట్లు భావించి కరుణించిన ఓ అద్భుత దేవతామూర్తి స్వర్గం నుండి దిగి వచ్చి తమను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొంటున్న ప్రత్యక్షానుభూతిని వారు పొందారు. అప్పుడు అందరూ ముందుకు వెళ్ళి ఆయనకు మ్రొక్కి, ఆయన పాదధూళి స్వీకరింప ఉబలాట పడ్డారు. దిక్కులు పిక్కటిల్లేలా ‘జై రామకృష్ణ’ అనే జయ జయ ధ్వానాలు చేస్తూ ప్రతి భక్తుడూ ఒకరి తరువాత ఒకరుగా ఆయనకు ప్రణమిల్లసాగారు. వారు అలా ప్రణమిల్లుతూండగా శ్రీరామకృష్ణుల కరుణాబ్ధి నాడు పొంగిపొరలి ఒక అద్భుత సంఘటనకు దారి తీసింది. దక్షిణేశ్వరంలో వసిస్తున్నప్పుడు కరుణతో, అనుగ్రహంతో దివ్య అర్ధ భావావస్థలో తన్మయులై కొందరు భక్తులను అమోఘమైన స్పర్శతో ఆశీర్వదించడం దాదాపు నిత్యం చూసేవారం. ఈ రోజు అదే దివ్యభావావస్థలో కాశీపూర్ ఉద్యాన గృహంలో సమావేశమైన భక్తుల నందరినీ స్పృశించసాగారు. గురుదేవులు అలా ప్రవర్తించడంతో భక్తులు పొందిన ఆనందానికి అవధులు లేకపోయాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇటుపైన తమ దివ్యత్వాన్ని తమ (భక్తుల) నుండి గాని లేదా లోకుల నుండి గాని దాచిపెట్టరని భక్తులు భావించారు. పాపులు, ఆర్తులు, దీనులు ఒక్కరేమిటి సర్వులూ గురుదేవుల ఆ దివ్యపాదపద్మాలను ఆశ్రయిస్తే అభయం పొందగలరని ఎన్నో లోటుపాట్లు, లౌకికత, అసమర్థత ఉన్నప్పటికీ కూడా ఆ భక్తులకు సందేహాతీతంగా అవగతమైపోయింది.
ఆ దివ్య ఘటన తమ కళ్ళముందు అలా జరగడం చూసి మాటాపలుకూ లేక మంత్రముగ్ధుల్లా తదేక దృష్టితో గురుదేవులనే చూడసాగారు కొందరు భక్తులు. మరికొందరు ఇంట్లో ఉన్నవారి నందరినీ చప్పున వచ్చి ఆయన అనుగ్రహం పొందమని కేకలు పెట్టారు. ఇంకొందరు పువ్వులు సేకరించి మంత్రోచ్చారణతో ఆయన పాదాలను అర్చించసాగారు.
త్వరలోనే గురుదేవుల భావసమాధి భంగమైంది. భక్తులు కూడా మామూలు స్థితిలోకి వచ్చారు. ఆ విధంగా నాడు ఉద్యానంలో పచార్లు పూర్తి చేసుకొని శ్రీరామకృష్ణులు ఇంట్లోకి వెళ్ళి తమ గదిలో కూర్చున్నారు.
4. శ్రీరామకృష్ణులు కల్పతరువే అయినారు?
రాంచంద్ర దత్త మొదలగువారు ఆనాటి సంఘటనను శ్రీరామకృష్ణులు ‘కల్పతరువు’ గా మారడమని అభివర్ణించారు. కాని దీనిని శ్రీరామకృష్ణుల ‘ఆత్మ వ్యక్తీకరణ’ అని గాని లేదా ‘అభయ ప్రదానం’ అనిగాని అభివర్ణించడమే సముచితంగా మాకు తోస్తున్నది. మంచి చెడు అన్న విచక్షణ పాటించక కోరిన వారికి కోరినదల్లా కల్పవృక్షం ఇస్తుందంటారు. కాని గురుదేవులు అంతకంటే ఎక్కువే ఇచ్చారు. ఆనాటి సంఘటన ద్వారా తాము మానవరూపంలోని దేవుడనే సత్యాన్ని స్పష్టం చేసి, ఏ తారతమ్యం లేకుండా అందరికీ తమ ఆశ్రయాన్ని ఒసగి, అభయ ప్రదానంచేశారు.
ఏది ఏమైనప్పటికీ నాడు గురుదేవుల అనుగ్రహం పొంది ధన్యులైన వారిలో హరన్చంద్ర దాస్‌ను* ప్రత్యేకంగా పేర్కొనాలి. ఎందుకంటే, అతడు మ్రొక్కగానే భావసమాధిలోని శ్రీరామకృష్ణులు తమ పాదాన్ని ఆతడి తలమీద ఉంచారు. అటువంటి అరుదైన అనుగ్రహాన్ని ఆయన ఎంతో అరుదుగా చూపడం మేం చూసివున్నాం. రాంలాల్ ఛటోపాధ్యాయ కూడా ఆ సందర్భంలో అక్కడే ఉన్నాడు. అతడు కూడా ఆయన అనుగ్రహం పొందాడు. ఆ సంఘటన గురించి అతడు ఇలా చెప్పాడు : “అంతకు మునుపు ధ్యాన సమయంలో నా ఇష్టదేవతా మూర్తిలో కొంత భాగాన్నే మనస్సులో చూడగలిగేవాణ్ణి. ఆయన పాదపద్మాలను చూడగలిగితే ముఖారవిందం కానవచ్చేది కాదు. ఒక్కొక్కప్పుడు శిరస్సు నుండి నడుం దాకా చూడగలిగినా, పాదాలు, కానవచ్చేవి కావు. పైగా నేను చూస్తూన్నదంతా నిర్జీవంగానే కానవచ్చేది. కాని గురుదేవులు నాడు నన్ను స్పృశించగానే సర్వాంగ సహితమైన నా ఇష్టదేవతామూర్తి హఠాత్తుగా నా హృత్కమలంలో దేదీప్యమానంగా ప్రసన్న దృక్కులతో కదలుతూ గోచరించింది.”
5. ఆత్మవ్యక్తీకరణ సమయంలో అక్కడ హాజరైవున్న వారు
ఆ రోజు ఆ సంఘటన జరిగిన స్థలంలో ఉన్న వ్యక్తులలో తొమ్మిది లేదా పదిమంది పేర్లు మాత్రమే మాకు జ్ఞాపకం. వారు : గిరీష్, అతుల్, రాం, నవగోపాల్, హరమోహన్, వైకుంఠ్, కిశోరి (రాయ్), హరన్, రాంలాల్, అక్షయ్. మహేంద్రనాథ్ (శ్రీరామకృష్ణ కథామృత గ్రంథకర్త) బహుశా ఉన్నట్లున్నారు. కాని గురుదేవుల భావి సన్న్యాస శిష్యులు ఒక్కరు కూడా ఆ సమయంలో అక్కడ ఉండకపోవడం ఎంతో ఆశ్చర్యం. గురుదేవుల సేవలోనూ, గతరాత్రి ఎన్నో గంటలసేపు కఠోర సాధనలలో నిమగ్నులై ఉండడం వల్ల నరేంద్రుడు తదితరులు బాగా అలసిపోయి ఆ సందర్భంలో ఇంట్లో నిద్రపోతూన్నారు. లాటూ, శరత్ మేల్కొనే ఉండి శ్రీరామకృష్ణుల గదికి దక్షిణం వైపువున్న డాబామీద నుంచి క్రింద తోటలో జరుగుతూన్నదంతా చూస్తున్నప్పటికీ వారు అక్కడకు బుద్ధిపూర్వకంగానే వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీరామకృష్ణులు తమ గది నుండి క్రిందికి దిగి వెళ్ళగానే ఆయన దుస్తులను, పరుపు, దిళ్ళను ఎండలోవేసి, గదిని శుభ్రపరచడంలో నిమగ్నులైనారు. పని పూర్తిచేయకుండా సగంలో విడిచిపెట్టిపోతే గురుదేవులకు అసౌకర్యం కలుగుతుందని వారు క్రిందికి వెళ్ళదలచుకోలేదు.
ఆనాడు అక్కడున్న వారికి కలిగిన ఆధ్యాత్మికానుభూతులను గురించి చెప్పమని ఇతరులతో పాటు వైకుంఠనాథ్ను కూడా అడిగాం. వైకుంఠనాథ్ ఏం చెప్పాడో తెలిపి, ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తాం.
6. ఆధ్యాత్మికానుభూతులు కలిగించమని గురుదేవులను వైకుంఠనాథ్ వేధించడం
శ్రీరామకృష్ణులను దాదాపు మేం కలుసుకొన్న కాలఘట్టంలోనే వైకుంఠనాథ్ కూడా ఆయనను కలుసుకొన్నాడు. అప్పటి నుండి శ్రీరామకృష్ణులు ఉపదేశాలిచ్చి అతడి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దారో ఇంతకు మునుపే ప్రస్తావించివున్నాం. తదుపరి అతడికి మంత్ర దీక్షనిచ్చి అతణ్ణి ధన్యుణ్ణి చేశారు. అప్పటి నుండి వైకుంఠ్ శాయశక్తులా సాధనలు అనుష్ఠిస్తూ తన ఇష్టదైవ దర్శనం పొందడానికి ప్రయత్నించసాగాడు. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తప్ప తన కోర్కె ఈడేరదని గ్రహించి అప్పుడప్పుడు ఆయనను దీనాతిదీనంగా ముఖ్యంగా ఆయన వ్యాధిగ్రస్థులై మొదట కలకత్తాకు, పిదప కాశీపూర్‌కు వచ్చినప్పటి నుండి ప్రార్థించ సాగాడు. ఈ సమయంలో కూడా రెండు మూడు పర్యాయాలు తన కోర్కెను ఈడేర్చమని ఆయనను ఎంతో వినమ్రంగా అర్థించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ప్రసన్నంగా నవ్వి, అతణ్ణి అనునయిస్తూ, “కాస్త ఆగు. ఈ రోగం కొంచెం నయం కానివ్వు. కావలసినదంతా నేను చేసిపెడతాను” అని అన్నారు.
7. శ్రీరామకృష్ణుల స్పర్శతో వైకుంఠనాథ్లో జనించిన అనుభూతి
ఆనాడు ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ వైకుంఠనాథ్ ఉన్నాడు. శక్తిమంతమైన తమ అపూర్వ స్పర్శతో ఇద్దరు ముగ్గురు భక్తులను శ్రీరామకృష్ణులు ఆశీర్వదించిన పిదప వైకుంఠనాథ్ వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “మహాశయా, నన్ను అనుగ్రహించండి” అని ప్రార్థించాడు. అందుకు ఆయన, “ఇంతకు మునుపే నీ కంతా ఇచ్చాను కదా!” అని అన్నారు. “అంతా ఇవ్వబడిందని మీరు చెబుతున్నప్పుడు అది నిజం కాక తప్పదు. అయినా దాన్ని అవగతం చేసుకోగలిగేటట్లు నన్ను అనుగ్రహించండి” అని వేడుకొన్నాడు వైకుంఠ్. “సరే అలాగే కానివ్వు” అంటూ గురుదేవులు అతడి ఛాతీని ఒక్క క్షణం మామూలు రీతిలో స్పృశించారు.
కాశీపూర్ ఉద్యాన గృహంలోని మామిడి చెట్టు. ఈ చెట్టు దగ్గరే 1886, జనవరి 1 న శ్రీరామకృష్ణులు కల్పతరువు అయ్యారు.
కాశీపూర్‌లో నరేంద్రుని గురించి శ్రీరామకృష్ణులు స్వహస్తాలతో వ్రాసినది: “జై రాధే ప్రేమమయీ, నరేన్ లోకానికి ఉపదేశిస్తాడు. ప్రతి చోటికీ వెళ్ళి సత్యాన్ని ప్రచారం చేస్తాడు.”
తత్ఫలితంగా తాను పొందిన అనుభూతిని వైకుంఠ్ ఇలా వర్ణించాడు : “ఆయన అలా స్పృశించిన మరుక్షణంలో నా మనస్సులో గొప్ప మార్పు సంభవించింది. ప్రసన్న దరహాసంతో ప్రకాశిస్తూన్న గురుదేవుల మూర్తి ఆకాశంలో, ఇళ్ళలో, చెట్లలో, మనుషులలో, నేను చూస్తున్న ప్రతి దాన్లో నాకు కానవచ్చింది. అప్పుడు నాలో ఉప్పొంగుతున్న సంతోషాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అర్థంకాక, మీరు (శరత్, లాటూ) డాబా మీద నిలబడి ఉండడం చూసి, ‘మీరెక్కడున్నారో అంతా వెంటనే రండి’ అంటూ బిగ్గరగా పిలిచాను. ఆ మనోభావం, ఆ దివ్యదర్శనం జాగ్రదావస్థలో కొన్ని రోజుల దాకా అట్లే కొనసాగింది. అన్నింట్లోనూ అలా గురుదేవుల దివ్యదర్శనాన్ని చూసి ఆశ్చర్యంతో ముగ్ధుడనైపోయాను. కార్యాలయానికి లేదా పనిమీద మరెక్కడికి వెళ్ళినా నాలో అదే స్థితి కొనసాగింది.
8. యోగ్యత సంతరించు కోకుండా ఉన్నత ఆధ్యాత్మికానుభూతులను నిలిపి ఉంచుకోవడం అసాధ్యం
“చేయవలసిన పనిని సకాలంలో చేయలేకపోవడంతో అది వెనకపడ సాగింది. పని వెనకపడడం చూసి ఆ దర్శనాన్ని తాత్కాలికంగా మరచిపోవడానికి ప్రయత్నించాను, కాని ఆ ప్రయత్నం విఫలమైంది. భగవంతుని విశ్వరూప దర్శనాన్ని చూసి, తట్టుకోలేక ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని అర్జునుడు ఎందుకు ప్రార్థించాడో నాకిప్పుడు కించిత్తు అర్థమైంది. ముక్త పురుషులు సదా సర్వవేళల ఇటువంటి మహోన్నత స్థితిలోనే నెలకొని ఉంటారనే శాస్త్రవచనం జ్ఞాపకం వచ్చింది. ఈ అనుభవానంతరమే అట్టి మహోన్నత స్థితిలో నెలకొని ఉండాలంటే మనస్సును ఏ మేరకు వాసనారహితంగా రూపొందించుకోవాలో నాకు అవగతమైంది.
“ఆ రకంగా కొద్ది రోజులు గడిచాయో లేదో అదే దివ్యదర్శనాన్ని చూస్తూ, అదే మానసిక స్థితిలో ఉండడం నాకు ఎంతో యాతనాకరంగా పరిణమించింది. ‘నేను పిచ్చివాణ్ణి కావడం లేదుగదా!’ అనే చింత పట్టుకొంది. అప్పుడు ఎంతో భయపడి గురుదేవులను, ‘ప్రభో, నేను ఈ మానసిక స్థితిని తట్టుకోలేకపోతున్నాను. కరుణించి ఈ స్థితిని ఉపసంహరింప చేయండి’ అని ప్రార్థించాను. ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను : ‘మానవ దౌర్బల్యం మూర్ఖత్వం ఎంత దుర్భరమైనవి! నేనెందుకు అలా ప్రార్థించాను? ఆయన పట్ల నేనెందుకు ప్రగాఢ విశ్వాసం వహించ లేకపోయాను? చివరకు ఏమయ్యేదో ఓపికగా ఎందుకు వేచి ఉండలేకపోయాను? మహా అయితే పిచ్చివాణ్ణి అయ్యేవాణ్ణి లేదా మరణించేవాణ్ణి, అంతేకదా!’
“కాని నేను అలా ప్రార్థించిన మరుక్షణంలోనే దివ్యదర్శనం, ఆ నా మానసిక స్థితి అంతమైనాయి. ఏ మహాపురుషుడు వాటిని నాకు అనుగ్రహించాడో ఆయనే వాటిని ఉపసంహరించారని నా ప్రగాఢ నమ్మకం. కాని అవి ఆసాంతం తొలగి పోవాలనే ప్రార్థన నా మనస్సులో కలుగనందున, బహుశా ఆయనే కరుణించి వాటిని అనుభూతం చేసుకోగల కించిత్తు సామర్థ్యాన్ని నా మనస్సుకు ప్రసాదించి ఉంటారు. కాబట్టే దివ్యభావోద్దీపితమైన గురుదేవుల మూర్తి రోజూ కొన్నిసార్లు హఠాత్తుగా నాకు కానవస్తూ నన్ను విస్మయుణ్ణి చేస్తూ, తరింపచేస్తున్నది.”
కాశీపూర్ ఉద్యానగృహంలో 16, ఆగస్టు 1886 సం ॥ లో శ్రీరామకృష్ణులు మహాసమాధి పొందిన గది.
ఈ రెండు ఛాయా చిత్రాలు 16 ఆగస్టు 1886 సం ॥ లో శ్రీరామకృష్ణుల మహాసమాధి తరువాత తీసినవి.
శ్రీరామకృష్ణుల భౌతికకాయాన్ని అగ్నికి ఆహుతి చేసిన స్మృతి ప్రదేశం. గంగానది అవతలి ఒడ్డున బేలూరు మఠాన్ని దర్శించవచ్చు.