1. శ్యాంపుకూర్ ఇంటి వర్ణన
శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణుల కోసం అద్దెకు తీసుకొన్న ఇల్లు తూర్పు నుండి పశ్చిమంగా పొడవులో విస్తరించి, శ్యాంపుకూర్ వీథిలో ఉత్తరం వైపు నెలకొని ఉంది. ఇంట్లోకి అడుగిడగానే ఒక ఇరుకైన వసారా, కుడి ఎడమల రెండు అరుగులు కానవస్తాయి. మరికొన్ని అడుగులు ముందుకు వేస్తే కుడివైపు మొదటి అంతస్తుకు దారితీసే మెట్లు, ఎదురుగా ప్రాంగణం, ప్రాంగణానికి తూర్పుగా రెండు మూడు చిన్నగదులు కనిపిస్తాయి. మెట్ల మీదుగా మొదటి అంతస్తులోకి వెళ్ళగానే కుడిప్రక్క తూర్పు పడమరలుగా విస్తరించిన దర్శనార్థుల పెద్దగది, ఎడమప్రక్క తూర్పు పడమరలుగా గదులకు దారితీసే సన్నని నడవా ఉన్నాయి. ఈ నడవ గుండా పోతే కచ్చేరి గది వాకిలి మొదట కనిపిస్తుంది. శ్రీరామకృష్ణులు ఆ గదిలోనే బసచేశారు. దీనికి దక్షిణంగా, ఉత్తరంగా రెండు వసారాలున్నాయి; ఉత్తరం వైపున్న వసారా కాస్త విశాలమైంది. దీనికి పశ్చిమాన రెండు చిన్నచిన్న గదులున్నాయి. ఒక గది భక్తుల ఉపయోగార్థమూ, మరొక గది రాత్రివేళ మాతృదేవి పడుకోవడానికి కేటాయించబడ్డాయి. దర్శనార్థుల గదికి పశ్చిమంగా అందరూ కూర్చోవడానికి మరొక సన్నని వసారా ఉంది. శ్రీరామకృష్ణులు ఉన్న గదికి తూర్పుగా డాబాపైకి దారితీసే మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల వెలుపల ఆరు అడుగుల విస్తీర్ణం గల డాబా భాగానికి కప్పువేసి ఉంది. మాతృదేవి పగటిపూట ఇక్కడే ఉండి, గురుదేవుల పథ్యపానాదులు తయారుచేసేవారు. బలరాం బసు ఇంట్లో నుండి శ్రీరామకృష్ణులు ఈ ఇంటికి భాద్రపద మాసం చివరిలో, అంటే 1885 వ సం ॥ సెప్టెంబరు నెలలో వచ్చారు. ఆయన ఈ ఇంట్లో దాదాపు మూడు నెలలకు పైబడి గడిపారు. డిసెంబర్ మాసం మధ్యలో (11 డిసెంబర్ 1885) కాశీపూర్ ఉద్యాన గృహానికి బస మార్చారు.
శ్రీరామకృష్ణులు 1885 సం ॥ లో కాన్సర్ చికిత్సకోసం 3 నెలలు ఉన్న శ్యాంపుకూర్ గృహం.
శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు నివసించిన గది.
2. శ్రీరామకృష్ణుల చికిత్సకై డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ నియుక్తులవడం
శ్యాంపుకూర్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తరువాత తమ నిర్ణయం మేరకు భక్తులు శ్రీరామకృష్ణుల చికిత్స నిమిత్తం డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌ను రావించారు. మథుర్బాబు బ్రతికివున్న రోజులలో డాక్టర్ సర్కార్ దక్షిణేశ్వరానికి కొన్నిసార్లు మథుర్ కుటుంబం వారికి చికిత్స చేయడానికి వచ్చివున్నాడు. కాబట్టి అతడు శ్రీరామకృష్ణులకు పూర్తిగా అపరిచితుడు కాడు. కాని అది చాలా కాలం నాటి మాట. కాబట్టి సుప్రసిద్ధ వైద్యుడైన మహేంద్రలాల్ దక్షిణేశ్వర రాకలను గురించి మరచిపోయి ఉండడం సహజమే. పైగా భక్తులు రోగి పేరు చెప్పకుండా డాక్టర్‌ను ఆహ్వానించారు. కాని అతడు శ్రీరామకృష్ణులను చూడగానే గుర్తించాడు. ఎంతో శ్రద్ధగా ఆయనను పరీక్షించి, రోగాన్ని కనుగొని, మందులు పథ్యం నిర్ణయించాడు. ఆ తరువాత కొంతసేపు శ్రీరామకృష్ణులతో ఆధ్యాత్మిక విషయాల గురించీ, కాళికాలయం గురించీ ముచ్చటించి, సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు గురుదేవుల దేహపరిస్థితి గురించి తనకు ప్రతి ఉదయం తెలియచేయమని భక్తులతో చెప్పినట్లు మాకు జ్ఞాపకం. వెళ్ళేముందు భక్తులు ఇచ్చిన ఆయన మామూలు రుసుము పుచ్చుకొన్నాడు. కాని మర్నాడు వచ్చినప్పుడు మాటల సందర్భంలో భక్తులే గురుదేవులను కలకత్తాకు తోడ్కొని వచ్చారనీ, ఖర్చులన్నీ వారే భరిస్తున్నారనీ డాక్టర్‌కు తెలిసింది. గురుదేవుల పట్ల భక్తులు చూపుతున్న భక్తిప్రపత్తులకు ఎంతో ప్రసన్నుడై డాక్టర్ ఆపైన పైకం పుచ్చుకోవడానికి నిరాకరించాడు. “నా శక్తిమేరకు వారికి చికిత్స చేస్తాను. మీరు చేసే ప్రయత్నంలో ఉడతా భక్తిగా వైద్యం నిమిత్తం ఎలాంటి రుసుమూ పుచ్చుకోను” అని అన్నాడు.
3. గురుదేవుల పథ్యం, రాత్రి సేవ
ఎంతో అనుభవజ్ఞుడైన వైద్యుడు చికిత్స చేస్తూవున్నా భక్తులు ఆందోళన పడకుండా ఉండలేకపోయారు. గురుదేవుల సేవకు రేయింబవళ్ళు ప్రత్యేకంగా కొందరిని నియమించాలనీ, ఆయన పథ్యాన్ని శ్రద్ధగా తయారు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలనీ భక్తులు నిశ్చయించుకొన్నారు. డబ్బు ఉన్నంత మాత్రాన పై రెండు కొరతలూ తీరవని వారు గ్రహించక పోలేదు. కనుక పథ్య నియమంగా ఆహారాన్ని తయారుచేయడానికి దక్షిణేశ్వరం నుండి మాతృదేవిని తోడ్కొని రావాలని నిర్ణయించారు. సేవాదులకు యువభక్తులను కేటాయించాలని తీర్మానించారు. కాని అందుకు ఎన్నో ఆటంకాలున్నాయి. ఎందుకంటే, స్త్రీలు నివసించడానికి ప్రత్యేకంగా ఆ ఇంట్లో గదులు లేనందున మాతృదేవి ఒంటరిగా నివసించగలదో లేదో వారికి పాలుపోలేదు. అలాగే యువభక్తులు రోజూ వస్తూ నిద్ర లేకుండా రాత్రుళ్ళు అక్కడే గడిపితే వారి సంరక్షకులు నొచ్చుకొంటారేమో! ఇలా వారి ఆలోచనలు సాగాయి.
4. మాతృదేవి అమిత లజ్జకు ఒక ఉదాహరణ
మాతృదేవి శ్యాంపుకూర్‌కు రావడం గురించి భక్తులలో సంశయం జనించక పోలేదు. వారి సందేహానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే, ఆమె ఎంత లజ్జావంతురాలో వారికి బాగా తెలుసు. దక్షిణేశ్వర ఉద్యానంలో ఉత్తరం వైపునవున్న నహబత్ (వాద్యమందిరం)లో వసిస్తూ ఇన్నేళ్ళుగా గురుదేవుల సేవలో నిమగ్నురాలై ఉన్నప్పటికీ, స్వయంగా ఆయనే ఆమెకు పరిచయం చేసిన ఏదో ఇద్దరు ముగ్గురు యువభక్తులు తప్ప ఆమె పాదపద్మాలను చూసిన లేదా ఆమె గొంతు విన్న వారు ఎవరూలేరంటే అతిశయోక్తి కాదు. రోజంతా ఆ చిన్నగదిలోనే గడుపుతూ నిత్యం రెండు పూటలా గురుదేవుల, భక్తుల నిమిత్తం రకరకాల వంటకాలను వండిపెడుతున్నా, అలా చేస్తున్నదెవరో ఎవరికీ తెలియదు.
ఎవరూ మేల్కొనక ముందే ప్రతి రోజు తెల్లవారుఝాము మూడు గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు, గంగాస్నానం ముగించుకొని మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళి రోజంతా బయటకు వచ్చేవారుకాదు. ఓర్పుతో చకచకా తన పనినంతా పూర్తి చేసుకొని, జపధ్యానాదులలో నిమగ్నురాలయ్యేవారు. ఒక సందర్భంలో ఇంకా బాగా చీకటి ఉండగానే ఆమె స్నానఘట్టానికి వెళ్ళబోతూ, నహబత్ ఎదుట ఉన్న పొగడ చెట్టు క్రింద పడుకొనివున్న ఒక మొసలి మీద దాదాపు అడుగు వేయబోయారు. అదృష్టవశాత్తు ఆమె అడుగుల సవ్వడి విని ఆ మొసలి నీళ్ళలోకి దూకేసింది. మరెన్నడూ చేత దీపం లేకుండా ఆమె స్నానఘట్టానికి వెళ్ళలేదు.
5. శ్యాంపుకూర్‌కు మాతృదేవిని తోడ్కొని రావాలనే ప్రతిపాదన
ఎవరి కంటా పడకుండా చాలాకాలంగా వాద్యమందిరపు ఆ చిన్నగదిలో నివసిస్తున్న మాతృదేవి, ఏ సంకోచమూ లేకుండా పగలంతా పురుషుల మధ్య శ్యాంపుకూర్ ఇంట్లో ఎలా ఉండగలరోనని సందేహంతో సాహసించి ఎవరూ నిర్ణయించ లేకపోయారు. ప్రత్యామ్నాయం లేనందున ఈ విషయం గురించి శ్రీరామకృష్ణులతో ప్రస్తావించవలసిన నిర్బంధానికి భక్తులు గురియైనారు. ఆయన వారికి ఆమె నైజాన్ని జ్ఞప్తికి తెచ్చి, “ఆమె ఇక్కడ ఉండగలదా? ఇక్కడి పరిస్థితులన్నీ తెలిశాక రావడానికి ఇష్టపడుతుందేమో ఆమెను అడిగి చూడండి. ఇష్టపడితే, నిరభ్యంతరంగా ఆమె రావచ్చు” అని అన్నారు. ఆ పిమ్మట దక్షిణేశ్వరంలో ఉంటూన్న మాతృదేవికి కబురు పంపారు.
6. దేశకాల పాత్రాను గుణంగా సర్దుకుపోయే మాతృదేవి సమర్థత
అవసరమైనప్పుడు దేశకాల పాత్రానుసారంగా సర్దుకుపోలేని వ్యక్తి ఎన్నటికీ శాంతిని లేదా తను కోరుకొన్న లక్ష్యాన్ని పొందలేడని శ్రీరామకృష్ణులు తరచు వచించేవారు. ఆయన వచనాలలోనే చెప్పాలంటే, ‘సమయాన్ని బట్టి, ప్రదేశాన్నిబట్టి, వ్యక్తినిబట్టి వ్యవహరించాలి’ అనే సిద్ధాంతాన్ని పాటించని వారికి వైఫల్యం తప్పదు. సిగ్గు బిడియాలనే దుర్భేద్యమైన తెర మరుగున వసిస్తూవున్నప్పటికీ పూజ్యురాలైన మాతృదేవి, పై ఉపదేశాన్ని గురుదేవుల నుండి గ్రహించి తదనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకొన్నారు. ప్రప్రథమంగా ఆమె దక్షిణేశ్వరానికి వచ్చినప్పటి వర్ణన (II.20) నుండి, అట్లే ఈ క్రింద మేం ప్రస్తావించనున్న సంఘటన నుండి అవసరం ఏర్పడ్డప్పుడల్లా తన అలవాట్లు, గత సంస్కారాల నుండి విడివడి భయసంకోచ రహితంగా ఆమె ఎలా సమయోచితంగా మెలగగలిగారో పాఠకులు స్పష్టంగా తెలుసుకోవచ్చు.
7. కామార్పుకూర్ నుండి దక్షిణేశ్వరానికి వచ్చే దారి
ఆ రోజులలో డబ్బులేమి కారణంగా జయరాంబాటి, కామార్పుకూర్ల నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే మాతృదేవి వెళ్ళడం కద్దు. అలా కాలినడకన వెళ్ళే ప్రయాణీకులు జహానాబాద్ (ఆరాంబాగ్) చేరుకొని, అక్కడ నుండి ‘తేలోభేలో’ అనే పదిమైళ్ళ మైదానాన్ని గమించి తారకేశ్వరం చేరుకొనేవారు. అక్కడ నుండి ‘కైకోలా’ అనే మరో మైదానం దాటి వైద్యవాటి చేరుకొని, అక్కడ గంగానదిని దాటేవారు. ఆ రోజుల్లో ఆ రెండు మైదానాల్లో బందిపోట్ల బెడద ఎంతో అధికం. ఇప్పటికీ బందిపోట్ల బారినపడి ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతూ వుంటారని చెప్పుకొంటారు. ఇప్పటికి కూడా తేలోభేలో గ్రామాలకు రెండు మైళ్ళ దూరంగా మైదానం మధ్యలో నోరు తెరచుకొని పెద్ద కోఱలతో భయానకంగా కనిపించే కాళీవిగ్రహం కనబడుతుంది. స్థానికులలో ఆమె ‘తేలోభేలో బందిపోట్ల కాళి’ గా పేరుగాంచింది. ఈ బందిపోట్లు ప్రయాణీకులను చంపడానికి, దోపిడీలకు బయలుదేరబోయే ముందు ఈమెను పూజిస్తారని చెప్పుకొంటారు. కాబట్టి ఆ రోజుల్లో ప్రయాణీకులు తమను బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి బృందాలుగా ఆ మైదానాల గుండా పయనించేవారు.
8. మాతృదేవి తారకేశ్వరానికి కాలినడకన వస్తున్నప్పుడు జరిగిన సంఘటన
ఒకప్పుడు రామేశ్వర్ (శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారు) కుమార్తె, చిన్న కుమారుడు, మరికొందరితో కలిసి మాతృదేవి కామార్పుకూర్ నుండి దక్షిణేశ్వరానికి కాలినడకన బయలుదేరారు. ఆ బృందం ఆరాంబాగ్ చేరుకొంది. చీకటి పడడానికి ముందే తేలోభేలో మైదానాన్ని దాటగలమని ఎంచి, మాతృదేవితో వచ్చినవారు ఆరాంబాగ్లో రాత్రి బసచేయడానికి అంగీకరించలేదు. ప్రయాణంలో ఎంతో అలసిపోయివున్నా మాతృదేవి తన బడలిక విషయం ఎవరికీ చెప్పకుండా వారితో బాటు బయలుదేరారు. కాని నాలుగు మైళ్ళు దాటేటప్పటికే వారితోబాటు నడవలేక ఆమె బాగా వెనుకబడ్డారు. ఆమె కోసం వారు కాసేపు ఆగి, త్వరత్వరగా నడవమని ఆమెతో చెప్పి, కదలిపోసాగారు. మైదానం మధ్యకు చేరేసరికి మాతృదేవి వాళ్ళకంటే ఎంతో వెనుకపడిపోయారు. మళ్ళీ ఆగి ఆమె రాగానే, “ఇంత నెమ్మదిగా నడిస్తే రాత్రి బాగా ప్రొద్దుపోయాకగాని ఈ మైదానాన్ని దాటలేం. అందరం బందిపోట్ల వాతపడే ప్రమాదం ఉంది” అని ఆమెతో చెప్పారు. తన కారణంగా అందరూ ఇబ్బంది పడడం, భయపడడం చూసి, “నా కోసం ఆగవద్దు. మీరంతా తిన్నగా తారకేశ్వరం వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సాధ్యమైనంత త్వరగా వచ్చి మిమ్మల్ని కలుసుకొంటాను” అని వారితో చెప్పారు. ఒక ప్రక్క సూర్యాస్తమయం కాబోతూ ఉండడం చూసీ, మరోవంక మాతృదేవి మాటలనుబట్టీ వారంతా వేరే ఆలోచన చేయకుండా గబాగబా ముందుకు సాగిపోయారు. కాసేపట్లో కనుమరుగయ్యారు.
తేలోభేలో మైదానంలో ‘బందిపోట్ల కాళి’ గా పిలువబడే కాళీమాత
తేలోభేలో మైదానం, 1878 సం ॥ లో శారదామాతకి బాగ్డీ బందిపోటు ఎదురుపడిన ప్రదేశం.
9. తేలోభేలో మైదానంలో
మాతృదేవి కూడా సాధ్యమైనంత వేగంగా నడవసాగారు. కాని నిస్సత్తువ కారణంగా ఆమె నడక వేగం తగ్గింది. మైదానం మధ్యకు చేరేలోపుగానే చీకట్లు క్రమ్ముకొన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో పాలుబోక ఆందోళన పడుతూండగా, కారుమబ్బు వంటి నల్లని పొడవైన ఒక వ్యక్తి దుడ్డుకఱ్ఱ చేతపట్టి వడివడిగా ఆమె వైపు రావడం కనిపించింది. అతడికి కాస్త వెనుకగా, అతడి సహచరుడు కాబోలు మరో వ్యక్తికూడా రావడం ఆమె కంటపడింది. అది చూసి పారిపోవడం లేదా అరవడం వృథా అని భావించి భయంతో దడదడలాడుతూ మాతృదేవి అక్కడే నిలబడిపోయారు.
10. బాగ్డీ దంపతులు
కొద్ది క్షణాల్లో ఆ పురుషుడు ఆమెను సమీపించి కర్కశంగా, “ఎవరు నువ్వు? ఈ వేళప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు?” అని ప్రశ్నించాడు. అతణ్ణి ప్రసన్నుని చేసుకొనే ఉద్దేశంతో మాతృదేవి అతణ్ణి ‘నాన్న’ అని సంబోధిస్తూ, “నాన్నా, నాతో పాటు వచ్చినవారు నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను దారితప్పానని అనుకొంటున్నాను. వాళ్ళు ఉన్న చోటుకు దయచేసి నన్ను తోడ్కొనిపోగలవా? నీ అల్లుడు, రాణీరాస్మణి దక్షిణేశ్వర కాళికాలయంలో వసిస్తున్నారు. నేను ఆయన వద్దకే వెళుతున్నాను. నువ్వు కనుక నన్ను అక్కడదాకా తోడ్కొనిపోతే ఆయన ఎంతో సంతోషిస్తారు” అని ఎంతో వినమ్రంగా అతణ్ణి అడిగారు. మాతృదేవి అలా చెబుతూండగానే ఆ రెండో వ్యక్తి అక్కడకు రావడం జరిగింది. ఆ వ్యక్తి పురుషుడు కాదు, స్త్రీ అని ఆ పురుషుడి భార్య అని గ్రహించారు. ఆమెను చూడగానే మాతృదేవి మరింత ధైర్యం పుంజుకొని, ఆమె చేయి పుచ్చుకొని, “అమ్మా, నేను నీ కుమార్తెను, శారదను. నాతో కలిసి వచ్చినవారు ముందుగా వెళ్ళిపోవడంతో నేను ప్రమాదంలో చిక్కుకొన్నాను. అదృష్టవశాత్తు నుమ్వా, నాన్నా కనిపించారు. లేకపోతే ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు” అని అన్నారు.
11. మాతృదేవికి వారి ఆదరణ
మాతృదేవి సరళ, నిస్సంకోచ వైఖరిని చూసి ఆ బాగ్డీ* బందిపోటు, అతడి భార్య హృదయాలు కరిగిపోయాయి. మాతృపితృ వాత్సల్యాలు పొంగిపొర్లగా కులం జాతివంటి సాంఘిక ప్రతిబంధకాలను విస్మరించి ఆ దంపతులు తమ సొంత కుమార్తెగా భావించి మాతృదేవిని ఊరడించారు. ఆమె శారీరకంగా ఎంతో అలసిపోయి ఉండడం గమనించి చుట్టుప్రక్కల ఉన్న ఒక దుకాణానికి ఆమెను తోడ్కొని వెళ్ళి అక్కడ ఆమెకు ఆ రాత్రికి బస ఏర్పాటు చేశారు. ఆ స్త్రీ తన చీరను పరచి మాతృదేవికి పడకను అమర్చింది. అతడు మరమరాలు, తియ్యని అటుకులు కొనితెచ్చి తినడానికి ఇచ్చాడు. మాతృదేవి వాటిని తిన్న తరువాత, ఆప్యాయంగా ఆమెను నిద్రకు ఉప క్రమించమని చెప్పి, వారిద్దరూ ఆమెకు రాత్రంతా కాపలా కాస్తూ కూర్చున్నారు. తెల్లవారగానే మాతృదేవిని లేపి, సూర్యోదయమైన ఒక గంటలో ఆమెను తారకేశ్వరానికి తోడ్కొని వెళ్ళారు. ఆమెను ఒక దుకాణం వద్దకు తీసుకుపోయి, అక్కడ కాసేపు విశ్రమించమన్నారు. ఆ స్త్రీ తన భర్తతో, “రాత్రి నా కుమార్తె ఏమీ తిన లేదు. వెళ్ళి తారకేశ్వర శివుని అర్చించి, బజారు నుండి కాయగూరలు తీసుకొని రా!, నేడు ఆమెకు సుష్టుగా తినిపించాలి” అని చెప్పింది.
ఆ పురుషుడు భార్య చెప్పిన వస్తువులు తేవడానికి బజారుకు వెళ్ళగానే మాతృదేవి తోటి ప్రయాణీకులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. సురక్షితంగా ఆమె వచ్చి చేరుకోవడంతో వారు ఎంతో సంతోషించారు. ఆ తరువాత మాతృదేవి రాత్రి తనకు ఆశ్రయం ఇచ్చి కాపాడిన ఆ ‘తల్లితండ్రు’ లను వారికి పరిచయం చేసి, “నిన్న రాత్రి వీరే కనిపించి నాకు ఆశ్రయం ఇవ్వకపోతే ఏమైపోయేదాన్నో” అని చెప్పారు.
12. బాగ్డీ దంపతుల నుండి మాతృదేవి సెలవు పుచ్చుకోవడం
తరువాత అందరూ కలిసి తారకేశ్వర శివుణ్ణి ఆరాధించి, వంట చేసుకొని భుజించి అక్కడే కొంతసేపు విశ్రమించారు. తదనంతరం వైద్యవాటికి బయలు దేరుతున్నప్పుడు మాతృదేవి తన అనంత కృతజ్ఞతలు తెల్పుకొని ఆ బాగ్డీ దంపతులను సెలవు కోరింది. కాలాంతరంలో మాతృదేవి ఆ సంఘటన గురించి ఇలా చెప్పేవారు : “ఆ ఒక్క రాత్రిలో ఆ దంపతులూ, నేనూ పరస్పరం ఎంత ఆత్మీయులమైనామంటే, వారి నుండి సెలవు పుచ్చుకోబోతున్నప్పుడు ఉద్వేగంలో నా కళ్ళ వెంట అశ్రువులు ధారగా స్రవించాయి. అవకాశం చూసుకొని దక్షిణేశ్వరానికి రావలసిందిగా వారిని బ్రతిమలాడాను. వస్తామని వారు మాట ఇచ్చిన తరువాతే ఎంతో కష్టం మీద నేను బయలుదేరగలిగాను. మేం బయలుదేరుతున్నప్పుడు చాలా దూరం వరకు వారు కూడా మమ్మల్ని సాగనంపడానికి వచ్చారు. దారి ప్రక్కని చేలలోని శనగలను కోసి, నా చీర కొంగుకు కట్టి ఆమె ఏడుస్తూ, ‘అమ్మాయ్ శారదా, రాత్రి అటుకులతో పాటు వీటిని కూడా తిను’ అని చెప్పింది.
“ఇచ్చిన మాటను ఆ దంపతులు నిలబెట్టుకొన్నారు. మిఠాయిలు పుచ్చుకొని వారు పలుమార్లు దక్షిణేశ్వరానికి వచ్చారు. నా ద్వారా ఆయన (శ్రీరామకృష్ణులు) జరిగినదంతా విని, ఆ దంపతులు వచ్చినప్పుడల్లా వారిని ఆప్యాయంగా ఆహ్వానించి, వారి పట్ల అల్లుడి మాదిరే ప్రవర్తించారు. నా ‘బంది పోటు తండ్రి’ ఇప్పుడు సరళహృదయుడుగా సజ్జనుడుగా మారిపోయినప్పటికీ, గతంలో ఎన్నో దోపిడీలు చేసిన వ్యక్తిగానే నాకు కనిపిస్తాడు.”
13. శ్యాంపుకూర్ ఇంట్లో మాతృదేవి
వైద్యుల సలహా మేరకు పథ్యపానాదులు కచ్చితంగా తయారుచేసి ఇవ్వకుంటే శ్రీరామకృష్ణుల వ్యాధి ప్రకోపించవచ్చుననే సమాచారం వినగానే మాతృదేవి తన అసౌకర్యాలను ఏమాత్రం లక్ష్యపెట్టక నిస్సంకోచంగా శ్యాంపుకూర్ ఇంటికి వచ్చేసారు. ఎన్నో అసౌకర్యాలు భరిస్తూ, అపరిచితులైన పురుషుల మధ్య ఒకే ఇంట్లో మూడు నెలలు మాతృదేవి గడిపారనే విషయం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. అందరికీ స్నానాల గది ఒక్కటే ఉన్నా, ఎప్పుడామె కాలకృత్యాలు ముగించుకొని తెల్లవారుఝాము మూడు గంటలకు ముందే రెండవ అంతస్తు డాబా మీదికి వెళ్ళిపోయేవారో ఎవరికీ తెలిసేదికాదు. రోజంతా అక్కడే ఉండిపోయి గురుదేవుల కోసం వేళవేళకీ పథ్యపానాదులు తయారుచేసి, లాటూ (స్వామి అద్భుతానంద) లేదా పెద్దగోపాల్ (స్వామి అద్వైతానంద) ద్వారా కబురు పంపేవారు. అప్పుడు అందరినీ అక్కడ నుండి వైదొలగమని చెప్పి భోజనాన్ని ఆమె క్రిందికి తీసుకువచ్చేవారు. లేదా శిష్యులమైన మేమే తీసుకొని వచ్చేవారం. మధ్యాహ్నం ఆమె భోజనం చేసి, అక్కడే విశ్రమించేవారు. రాత్రి పదకొండు గంటలకు అంతా నిద్రపోయాక ఆమె మొదటి అంతస్తుకు దిగి వచ్చి, తెల్లవారి రెండు గంటల దాకా తన కోసం కేటాయించిన గదిలో నిద్రించేవారు. గురుదేవులకు వ్యాధి నయమౌతుందనే ఆశతో గుండెను రాయిచేసుకొని ఆ విధంగా ఆమె రోజులు గడపసాగారు. ఎవరికీ తెలియరాకుండా ఎంత నెమ్మదిగా ఆమె ఆ ఇంట్లో బసచేశారంటే, అక్కడికి వచ్చే దర్శనార్థులలో అనేకులకు ఆమె అక్కడ ఉంటున్న సంగతే తెలిసేది కాదు. అలా అత్యంత కష్టభరితమూ, బాధ్యతాయుతమూ అయిన గురుదేవుల సేవాకార్యాన్ని నిర్వర్తిస్తూ మాతృదేవి శ్యాంపుకూర్ ఇంట్లో రోజులు గడపసాగారు.
14. శ్రీరామకృష్ణులను యువభక్తులు సేవించడం
పథ్యపానాదుల సమస్య ఆ విధంగా తీరడంతో, ఇప్పుడిక రాత్రిపూట శ్రీరామకృష్ణులను సేవించే వ్యవహారం గురించి భక్తులు తీవ్రంగా ఆలోచించ సాగారు. నరేంద్రుడు తానే ఆ బాధ్యతను స్వీకరించి రాత్రుళ్ళు అక్కడే గడపసాగాడు. అది చూసి ఉత్సాహ పూరితులైన చిన్నగోపాల్, కాళి, శశి వంటి యువకులు ముందుకొచ్చి ఆ పనిలో పాలు పంచుకోసాగారు. వీరంతా భగవత్సాక్షాత్కారమనే మహోన్నత జీవితాదర్శం కోసమే జీవించాలనే దృఢసంకల్పంతో జీవిస్తున్న యువకులు. శ్రీరామకృష్ణుల జాజ్వల్యమానమైన పరిత్యాగం, పావన వచనాలు, సాంగత్యం వలన పొందిన స్ఫూర్తితోనూ, ఆయన పట్ల గల తమ భక్తిప్రపత్తుల చేతా తమను ఆయన సేవకై అంకితం చేసుకోవాలని సంకల్పించారు ఆ యువకులు. ఆ యువకుల తల్లిదండ్రులకు వారి జీవితోద్దేశం ఏమిటో అప్పట్లో తెలియదు. కాబట్టి శ్యాంపుకూర్ ఇంటికి వచ్చి గురుదేవులకు అలా సేవచేయడం పట్ల వారు ఎటువంటి ఆక్షేపణా తెలుపలేదు. కాని శ్రీరామకృష్ణుల వ్యాధి ప్రకోపించడంతో ఈ యువకులు కళాశాలలకు వెళ్ళకపోవడమూ, తిండితిప్పలకు ఇంటికి రాకపోవడమూ చూసి వారి తల్లితండ్రులకు అనుమానం రాసాగింది. ఆ అనుమానం క్రమంగా ఆందోళనకు దారితీసింది. దాంతో వారు తమ బిడ్డలు గురుదేవులను సేవించకుండా చేయడానికి నానారకాల మార్గాలూ అవలంబించసాగారు. కాని నరేంద్రుని ఉదాహరణ, స్ఫూర్తి, ప్రోత్సాహం లేకుంటే, ఆ యువకులు తల్లితండ్రుల ఒత్తిడికి లొంగిపోయి, దృఢంగా తమ సేవాకార్యంలో నిమగ్నులై ఉండేవారుకారు. నలుగురైదుగురు మాత్రమే తమ జీవితాలను అంకితం చేసి శ్యాంపుకూర్ ఇంట్లో గురుదేవుల సేవను నిర్వర్తించసాగారు. అయితే శ్రీరామకృష్ణులను మెరుగైన వాతావరణం కోసం కాశీపూర్ ఉద్యానగృహానికి తరలించినప్పుడు వారి సేవలో అంకితమైనవారి సంఖ్య నాలుగు రెట్లుగా పెరిగింది.
కాళి (1866-1939). కాలాంతరంలో స్వామి అభేదానంద
శశి (1863-1911) కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద