1. పానీహాటీ ఉత్సవం తరువాత శ్రీరామకృష్ణుల గొంతునొప్పి ప్రకోపించడం
పానీహాటీ మహోత్సవంలో పాల్గొన్న తదనంతరం శ్రీరామకృష్ణుల గొంతు నొప్పి ప్రకోపించింది. ఆ రోజు అప్పుడప్పుడు వర్షం కూడా కురిసింది. వానలో తడుస్తూ ఒట్టి కాళ్ళతో చాలాసేపు ఉండడం వలన నొప్పి అధికరించిందనీ, అలా మళ్ళీ జరగకూడదనీ, జరిగితే పరిస్థితి విషమిస్తుందనీ వైద్యులు, భక్తులకు హెచ్చరికగాసూచించారు. అప్పటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలని భక్తులు నిశ్చయించుకొన్నారు.
బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు ఆనాటి వైద్యనిషేధాల ఉల్లంఘన తప్పునంతా రామచంద్రదత్త వంటి పెద్దలైన భక్తుల మీద మోపి, “వెళ్ళకూడదని పట్టుపట్టి చెప్పి ఉంటే ఆ రోజు నేను పానీహాటీకి వెళ్ళేవాణ్ణా?” అని వాళ్ళను నిలదీసినట్లు అడిగారు. వృత్తిరీత్యా రామచంద్ర దత్త వైద్యుడు కాకపోయినప్పటికీ, కాంప్‌బెల్ వైద్యసంస్థలో అతడు చదివి, పట్టా పొందివున్నాడు. వైష్ణవ మత అభిమాని కావడం వలన పానీహాటీకి వెళ్ళడానికి ఒక రకంగా అతడు గురుదేవులను ప్రోత్సహించాడు. ఆ కారణంగా జరిగిన తప్పులో అధిక బాధ్యతను అతడు వహించవలసి వచ్చింది.
ఒక రోజు మా మిత్రుడొకడు దక్షిణేశ్వరానికి వెళ్ళి, తమ గదిలో చిన్న మంచం మీద, గొంతుకు లేపనం పూసుకొని నిశ్చలంగా కూర్చునివున్న శ్రీరామకృష్ణులను చూశాడు. అప్పుడు ఏం జరిగిందో అతడిలా మాతో చెప్పాడు : “ఒక పనిని చేయవద్దని కట్టడిచేసి, ఒకచోట కదలనివ్వకుండా కూర్చోబెట్టిన పిల్లవాడి ముఖంలో ద్యోతకమయ్యే విషాదఛాయలు ఆయన ముఖంలో కానవచ్చాయి. ఆయనకు ప్రణామం చేసి, విషయం ఏమిటని అడిగాను. ఆయన తమ గొంతుకు పూసిన లేపనాన్ని చూపుతూ, ‘ఇలా చూడు. నొప్పి అధికరించడంతో వైద్యుడు ఎక్కువగా మాట్లాడవద్దని నిషేధించాడు’ అని చెప్పారు. అందుకు నేను, ‘అదా విషయం! ఆ రోజు మీరు పానీహాటీకి వెళ్ళారని విన్నాను. అందుకే బహుశా నొప్పి ఎక్కువై ఉంటుంది’ అని అన్నాను. ఆ మాటలకు అభిమానం దెబ్బతిన్న చిన్నపిల్లవాడిలా ‘కాని చూడు. పైన, క్రింద నీళ్ళు. పైగా వాన కురుస్తూవుంది. వీథులన్ని బురదమయం. అయినప్పటికీ రాం (రాంచంద్ర దత్త) నన్నక్కడకు తోడ్కొని వెళ్ళి రోజంతా నృత్యం చేయించాడు. అతడు ఒక పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. పైగా వైద్యుడు కూడా. వెళ్ళవద్దని గట్టిగా నిషేధించివుంటే నేనక్కడకు వెళ్ళేవాడినా?’ అని అన్నారు. ఆయన మాటలు విని నేను, ‘అవునండి. రాం పొరపాటు చేశాడు. అయినా జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పటి నుండి కొన్నిరోజులు జాగ్రత్తగా ఉండండి, నొప్పి తగ్గిపోతుంది’ అని చెప్పాను. నా జవాబు విని ఆయన ప్రసన్నులై, ఇలా అన్నారు : ‘మాటా పలుకూ లేకుండా ఎవరైనా ఊరకే ఉండగలరా? ఎంతో దూరం నుండి నువ్వు వచ్చావు కదా! మరి నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదా? ఇది సాధ్యమా?’ అన్న పిదప అందుకు నేనిలా జవాబిచ్చాను: ‘మిమ్మల్ని చూడడంతోనే నేను సంతృప్తి చెందాను. అటువంటప్పుడు మీరు మాట్లాడడం ఎందుకు? ఈ పరిస్థితుల్లో మీరు మౌనం పాటిస్తే మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీకు నయమైనాక మళ్ళీ మీ నుండి ఎన్నో గొప్ప విషయాలు తప్పక వినగలుగుతాం’ అన్నాను. కాని ఆయన నా మాటలు అసలు పట్టించు కోలేదు. వైద్యుల నిషేధాన్ని, తమ బాధను, మిగిలిన విషయాలను మరచిపోయి ఇంతకు మునుపులా నాతో మాట్లాడనారంభించారు.”
2. వైద్యుల నిషేధాన్ని శ్రీరామకృష్ణులు ఉల్లంఘించడం
ఆషాఢమాసం గడిచిపోయింది. శ్రీరామకృష్ణులు నెలరోజుల పైగా చికిత్స పొందుతున్నప్పటికీ గొంతునొప్పి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇతర సమయాలలో నొప్పి కొంచెం తగ్గినా, పౌర్ణమి అమావాస్య ఏకాదశి వంటి రోజులలో నొప్పి ప్రకోపించేది. ఆ రోజులలో ఎటువంటి కూరగాయలు లేదా ఘన ఆహారాన్ని మ్రింగడానికి ఆయనకు దాదాపు అసాధ్యమయ్యేది. కాబట్టి ఆ రోజుల్లో పాలన్నం లేదా రవ్వతో చేసిన పాయసం కాస్త పుచ్చుకొనేవారు. వైద్యులు ఆయనను మళ్ళీ పరీక్షచేసి, ఆయన వ్యాధిని ‘ఉపన్యాసకులకు వచ్చే గొంతు నొప్పి’ గా నిర్ధారణ చేశారు. అంటే రేయింబవళ్ళు ఎడతెగకుండా ధార్మిక ప్రసంగాలు చేయడం వలన ఆయన గొంతులోని స్వరపేటిక ఎంతో ఒత్తిడికి గురికావడంతో ఆ వ్యాధి సంక్రమించింది. వైద్యులు మందులు, పథ్యపానాదులు మొదలైనవి నిర్ణయించారు. శ్రీరామకృష్ణులు వైద్యుల సలహాలను తు.చ. తప్పక పాటించినప్పటికీ, రెండు విషయాలలో వారి సలహాలను ఉల్లంఘించారు. ప్రగాఢ భగవద్భక్తీ, సంసార తాపత్రయాలతో అల్లాడిపోతున్న జనుల పట్లగల అపార కారుణ్యం కారణంగా ఆయన భావపారవశ్య స్థితులలోకి ప్రవేశించడాన్ని, భక్తులతో మాట్లాడడాన్ని మాత్రం మానుకోలేకపోయారు. మాటలలో భగవంతుని గురించిన ప్రస్తావన రాగానే ఇంతకు మునుపులా ఆయన భావపారవశ్యమగ్నులై పోయేవారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ అంతులేని బాధలు అనుభవిస్తూ శాంతి పొందడమెలా అనే వ్యాకులతతో సరైన మార్గం కోసం అన్వేషిస్తూ వచ్చిన లోకుల పట్ల అపార కారుణ్యం వహించి, వైద్యుల నిషేధాలను గాలికి వదలివేసి, వారికి సదుపదేశాలు ఒసగి, ఆశీర్వదించి పంపసాగారు.
3. శ్రీరామకృష్ణుల వ్యాధికి కారణాలు
ఆ సమయంలో ఆధ్యాత్మిక పిపాసువులు అనేకులు శ్రీరామకృష్ణుల వద్దకు రాసాగారు. పాత వారే కాక, ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకోవడానికి నిత్యం భక్తులు దక్షిణేశ్వరానికి రాసాగారు. 1875 వ సం ॥ లో కేశవచంద్రసేన్ దక్షిణేశ్వరానికి వచ్చి, శ్రీరామకృష్ణుల మహత్త్వాన్ని ప్రకటింప ప్రారంభించినప్పటి నుండి రోజూ అలాగే జరుగుతూ వస్తోంది. కాబట్టి గత పదకొండు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ఆకలిదప్పికలతో అలమటించే వారికి సేదతీర్చడంలో తిండి తిప్పలు మొదలైన దైనందిన ఆవశ్యక విషయాల పట్ల గురుదేవులు ఎంతో అశ్రద్ధ వహిస్తూవచ్చారు. పైగా మహాభావ ప్రేరణ వలన ఆయనకు నిద్ర కూడా బాగా కరవయింది. మేం దక్షిణేశ్వరంలో ఆయనతో బసచేసి ఉన్న సమయంలో, అనేక సందర్భాలలో రాత్రి 11 గంటలకు పడుకొని ఒకింత సేపట్లోనే లేచి భావపారవశ్య స్థితిలో పచార్లు చేయడం మేం చూసివున్నాం. ఒకసారి పశ్చిమ ద్వారాన్ని, మరొకసారి ఉత్తర ద్వారాన్ని తెరచుకొని బయటకు వెళ్ళేవారు. మళ్ళీ మంచం మీద ప్రశాంతంగా పడుకొనివున్నా, పూర్తి మెలకువతోనే ఉండేవారు. రాత్రి మూడు నాలుగుసార్లు పడకమీద నుండి లేచేవారు. అయినప్పటికీ నిత్యం తెల్లవారుఝాము 4 గంటలకే లేచి భగవంతుణ్ణి స్మరిస్తూ, ధ్యానిస్తూ తెల్లవారడం కోసం నిరీక్షించేవారు. ఆ తరువాత మమ్మల్ని మేల్కొలిపేవారు. ఎడతెగక నిద్రలేమితో రాత్రిళ్ళు గడపడం వలనా, పగటివేళ అనేకులకు ఆధ్యాత్మికోపదేశాలు ఇవ్వడంలో అమితంగా శ్రమించడం వలనా ఆయన దేహ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదనడంలో ఆశ్చర్యం ఏముంది?
4. భావసమాధిలో జగజ్జననితో శ్రీరామకృష్ణులు తగవులాడడం
తమ శరీరం బాగా అలసిపోయి నిస్సత్తువ ఆవహిస్తుందన్న విషయం శ్రీరామకృష్ణులు ఎవరికీ వ్యక్తం చేయకపోయినా, భావావస్థలో జగజ్జననితో అప్పుడప్పుడు ప్రేమపూర్వకంగా తగవులాడడంలో పై విషయం సూచనప్రాయంగా మేం జగజ్జననితో శ్రీరామకృష్ణులు గ్రహించాం. కాని విషయం మాకు పూర్తిగా అవగతం తగవులాడడం అయ్యేది కాదు.
శ్రీరామకృష్ణులు అస్వస్థతకు గురికావడానికి ఒకింత కాలం ముందు మాలో ఒకరు దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు ఆయన తమ చిన్న మంచం మీద కూర్చుని భావావస్థలో ఎవరినో ఉద్దేశించి “నిరర్థకుల నందరినీ ఇక్కడకు తోడ్కొని వస్తున్నావు. ఒక్క సేరు పాలలో ఐదు సేర్లు నీళ్ళు కలిపినట్లుగా ఉంది! తడి కట్టెలను నోటితో ఊది ఊది నా కళ్ళు ఎఱ్ఱబారి ఉబ్బిపోయాయి, ఎముకలు నుగ్గునుగ్గు అయిపోతున్నాయి. అంత పని చేయడం నావల్ల కాదు. నీకు ప్రీతిగా ఉంటే నువ్వే చేసుకో. ఒకటి రెండు మాటల్లో ఆధ్యాత్మిక జాగృతం సంతరించుకొనే యోగ్యులను మాత్రం ఇక్కడకు తోడ్కొనిరా” అని అంటున్నారు.
మరొక సందర్భంలో తమవద్ద కూర్చున్న భక్తులతో శ్రీరామకృష్ణులు “అమ్మను నేడు, ‘విజయ్, గిరీష్, కేదార్, రాం (రాంచంద్ర), పంతులు (శ్రీరామకృష్ణ కథామృత రచయిత ‘మ’) మొదలయిన వీరికి కొంచెం శక్తిని ప్రసాదించు. దాని వల్ల కొత్తగా వచ్చేవారు ముందుగా వీరి వద్ద తమ లోపాలను చక్కబరచుకొని ఆ తరువాత ఇక్కడకు (తమ వద్దకు) వస్తారు’ అని వేడుకొన్నాను” అని అన్నారు.
లోకుల జీవితాలను, వారి ఆధ్యాత్మిక వైఖరులను తీర్చిదిద్దడం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో ఒక భక్తురాలితో, “నువ్వు నీళ్ళుపొయ్యి, నేను మట్టిని సిద్ధంచేస్తాను” అని చెప్పారు. ఆధ్యాత్మిక దప్పికతో తపించిపోతున్న జనం గుంపులు గుంపులుగా దక్షిణేశ్వరానికి రావడం చూసి, మొదటిసారిగా గొంతులో నొప్పి కలిగిన కొద్దిరోజుల తదనంతరం, భావపారవశ్యంలో జగజ్జననితో ఇలా మొరపెట్టుకొన్నారు : “ఇంతమందినా తోడ్కొని రావడం? పెద్ద గుంపునే ఉత్పన్నం చేస్తున్నావు; స్నానానికి, తినడానికి తీరికే లేకపోతున్నది. ఇది కేవలం ఒక మద్దెల, అదీ చిల్లులు పడ్డది (తమ శరీరాన్ని సూచించి). రేయింబవళ్ళు వాయిస్తూవుంటే ఇది ఎంతకాలం మన్నుతుంది?”
5. దక్షిణేశ్వరంలో భక్త ప్రవాహం
1884 వ సంవత్సరానికి దక్షిణేశ్వరంలో నివసిస్తున్న శ్రీరామకృష్ణులు యావత్తు కలకత్తా నగరంలో సుప్రసిద్ధులయ్యారు. ఆయన అనుపమాన వ్యక్తిత్వం, తరచు పొందే భావావస్థలు, అతిసరళంగా అమృతవాక్కులతో కూడిన ఆయన ఆధ్యాత్మికోపదేశాలు, సాధకులలో ఆధ్యాత్మిక అవ్యక్తతను ఇట్టే జాగృతం చేయగల ఆయన అసదృశశక్తి, కులమత విచక్షణలేని ఎల్లరి పట్లా చూపే ఆయన నిస్వార్థ ప్రేమ ఇవన్నీ కలకత్తావాసులు సామాన్యంగా ఆయన గురించి ముచ్చటించుకొనే విషయాలు. దాంతో కలకత్తా జనానీకం పెద్దసంఖ్యలో ఆయనను దర్శింప దక్షిణేశ్వరానికి రాసాగారు. ఒకసారి ఆయనను దర్శించినవారికి, పదేపదే ఆయన వద్దకు రావడం పరిపాటి అయిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. వారంతా ఒకేసారి, ఒకే రోజు వచ్చే ఆస్కారం లేదుకనుక అటువంటవారి సంఖ్యను అంచనా కట్టడం సాధ్యం కాదు. ఒక విధంగా చూస్తే ఇదీ మంచికే అనిపిస్తుంది. ఎందుకంటే నానాటికీ అధికంగా వస్తూన్న భక్తులను చూసి శ్రీరామకృష్ణుల ఆంతరంగిక భక్తుల సంతోషం ఇతోధికమైంది. వారెవరిని పూజ్యులుగా ఆరాధిస్తున్నారో వారే ఇప్పుడు ఎల్లరకూ ఆరాధనీయులైనారనీ, అందరికీ ప్రీతిపాత్రులయ్యారనీ ఆనందంతో వారు పొంగిపోయారు. కాని అదే సమయంలో అనేకులు రావడం దుఃఖానికీ, భయానికీ కూడా కారణమయ్యేది. ఎందుకంటే, “అనేకులు ఎప్పుడు దీన్ని (తమను) దేవుడని పరిగణించి భక్తి ప్రపత్తులు దీనికి (తమకు) చెల్లిస్తారో, అప్పుడు ఇది (తమ దేహం) కనుమరుగై పోతుంది” అని శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు వచించి ఉండడం వారు విని ఉన్నారు. ఆపై వారు తరచు కలుసుకొన్నప్పుడు తప్పకుండా ఈ విషయం గురించి చర్చించుకొని కచ్చితంగా విషాదభరితులయి ఉండడం తథ్యం.
6. తమ మరణకాలాన్ని శ్రీరామకృష్ణులు ముందుగానే సూచించడం
తమ మరణ కాలాన్ని గురించి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు సూచన ప్రాయంగా మాకు తెలియచేసి ఉన్నారు. కాని స్పష్టంగా ఆ మాటలు విన్నప్పటికీ ఆయన దివ్యప్రేమ మత్తులో మునిగిపోయి, అప్పట్లో మేం ఆ మాటలను పట్టించు కోలేదు. ఆ పలుకులను పైపైకి అర్థం చేసుకొన్నా వాటి అంతరార్థాన్ని అవగతం చేసుకోలేకపోయాం. వాళ్ళ మనస్సులో అప్పుడు ఒకే ఆలోచన మెదలేది; శ్రీరామకృష్ణుల అనుగ్రహం వలన తాము అనుభవిస్తున్న ప్రశాంతతను తమ మిత్రుల, బంధువులతో కూడా అనుభవించేలా చేయాలన్నదే వారి ఆ ఏకైక ఆలోచన. కాబట్టి ఆయన మరణిస్తారనే భయం వారి మనస్సులలో ఏనాడూ మెదలలేదు.
శ్రీరామకృష్ణులకు గొంతువ్యాధి సంక్రమించడానికి నాలుగైదేళ్ళ మునుపు శ్రీరామకృష్ణులు, ఒకసారి మాతృదేవితో “ఎప్పుడు నేను ఎవరంటే వారి చేతి నుండి ఆహారం పుచ్చుకొంటానో, రాత్రుళ్ళు కలకత్తాలో గడుపుతానో, నా ఆహారంలో కొంత ముందుగా ఇతరులకిచ్చి తక్కినది తింటానో అప్పుడు నా మరణకాలం త్వరలోనే సమీపిస్తున్నదని గ్రహించుకో” మని చెప్పారు. శ్రీరామకృష్ణులకు గొంతు వ్యాధి సంక్రమించడానికి మునుపు నుండే భవిష్యద్వాణి మేరకు సంఘటనలు జరగసాగాయి. అనేకుల ఆహ్వానాలను పురస్కరించుకొని కలకత్తాకు వెళ్ళి అన్నం తప్ప ఇతర ఆహారపదార్థాలన్నీ ఆయన స్వీకరించ సాగారు. అప్పుడప్పుడు అనుకోని రీతిలో బలరాం ఇంట్లో రాత్రిళ్ళు కూడా గడపసాగారు. నరేంద్రుడు అజీర్తితో బాధపడుతూ కొన్ని రోజులు ఆయన వద్దకు వెళ్ళలేకపోయాడు. అతడికి పథ్యపానాదులు సరిగా సమకూరవేమోనని తలచి ఒక రోజు ఉదయాన అతణ్ణి దక్షిణేశ్వరానికి పిలిపించుకొన్నారు. తమ కోసం వండిన చారన్నంలో కొంత ముందుగా అతడికి తినిపించి, మిగిలిన అన్నాన్ని తాము భుజించారు. అందుకు మాతృదేవి అభ్యంతరం తెల్పి, మళ్ళీ ఆయన కోసం వండుతానని చెప్పినా ఆయన వినలేదు. పైగా “ఈ అన్నంలో కొంతభాగం ముందుగా నరేంద్రుడికి ఇస్తున్నప్పుడు నా మనస్సు కుంచించుకుపోలేదు. కనుక నాకు ఏ హానీ వాటిల్లదు. మళ్ళీ నువ్వు వండనవసరం లేదు” అని అన్నారు. కాలాంతరంలో మాతృదేవి, “ఆయన అలా చెప్పినప్పటికీ, ఆయన భవిష్యద్వాణి గుర్తుకువచ్చి నేను ఎంతో ఆందోళన పడ్డాను” అని చెప్పారు.
7. శివజ్ఞానంతో శ్రీరామకృష్ణుల జీవ సేవ
లోకులకు ఉపదేశించడంలో అమితంగా శ్రమించడం వలన ఆయన దేహాన్ని నిస్సత్తువ ఆవహించింది. కాని ఆ విషయంలో మానసిక ఉత్సుకత మాత్రం కించిత్తు కూడా తగ్గలేదు. యోగ్యుడైన వ్యక్తి ఎవరైనా రాగానే తమ హృదయాంతరాళాలలో అతడి యోగ్యతను ఇట్టే పసిగట్టి దివ్యభావంలో తన్మయులై అతడికి ఉపదేశించేవారు లేదా అతణ్ణి స్పృశించేవారు. ఆ విధంగా అతడి ఆధ్యాత్మిక పురోగతికి మార్గ ద్వారం తెరిచేవారు.
అది ఇలా జరిగేది : క్రొత్తగా వచ్చిన వ్యక్తి ఆధ్యాత్మిక భావం శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రతిస్పందన కలిగించి, ఆయనలోని ఇతర భావాలన్నీ తాత్కాలికంగా వైదొలగేవి. పిదప దివ్యదృష్టితో ఆ వ్యక్తి సంపూర్ణత్వం వైపు ఎంతగా పురోగమించాడో, ఇంకా ఎందుకు ముందంజ వేయలేకపోయాడో గ్రహించేవారు. తరువాత అతడి మార్గంలోని అడ్డంకులను తొలగించి, అతణ్ణి ఉన్నత భావభూములను అధిరోహింప చేసేవారు.
ఆ విధంగా తమ జీవిత ఆఖరి క్షణం వరకు సర్వదా శివజ్ఞానంతో శ్రీరామకృష్ణులు జీవులను సేవిస్తూ, ఆబాలవృద్ధుల జన్మజన్మాంతరాల ఆధ్యాత్మిక తపనను తీర్చి, శాస్త్రాలలో ఏది ‘పరమ పద’ మని అభివర్ణింపబడిందో వారిని ఆ పరమ పదానికి అధిరోహింపచేసి బ్రహ్మానందానుభవాన్ని వారికి చవిచూపించారు.
8. లోకుల మనస్సులలో నిహితంగా ఉన్న గత సంస్కారాలను ఆయన కనుగొనడం
లోకుల మనస్సులలోని గుప్త భావాలను, సంస్కారాలను కనుగొనే శక్తి శ్రీరామకృష్ణులలో ఉండడం మేం స్పష్టంగా చూసివున్నాం. దేహారోగ్యం లేదా రోగం ఆయన మనస్సును ఎన్నడూ స్పృశించి ఎరుగదు అనడానికి ఇదే ఋజువుగా చెప్పవచ్చు. లోకుల మనస్సులలో గోప్య విషయాలను పూర్తిగా ఆయన తెలుసుకో గలిగినా, ఆయన ఆ విషయాలు బహిర్గతం చేసి తమ శక్తిని చాటుకోవడం ఎన్నడూ జరగలేదు. అయినా ఎవరికైనా మంచి కలుగుతుందని తోచినప్పుడు అవసరమైనంత మేరకు మాత్రమే తమ ఆ శక్తిని ప్రదర్శించి వారికి ఉన్నత మార్గాలను చూపెట్టేవారు. లేదా భాగ్యశాలురైన కొందరి హృదయాలలో తమ పట్ల ఉన్న విశ్వాసాన్ని పటిష్ఠం చేసే ఉద్దేశంతో ఆ శక్తిని వ్యక్తం చేసేవారు. పాఠకుల సౌకర్యార్థం దానికొక సామాన్య ఉదాహరణను ఇక్కడ పొందుపరుస్తున్నాం:
9. ఒక ఉదాహరణ
శ్రీరామకృష్ణుల గొంతునొప్పి అధికరించిందని విని, మాకు తెలిసిన ఒక స్త్రీ ఆయనను దర్శింప బయలుదేరింది. అది 1885 వ సంవత్సర శ్రావణ మాసాంతం. ఈమె వెళ్ళనున్నట్లు తెలిసి అదే పేట వాస్తవ్యురాలైన మరొక స్త్రీ, “నీ ద్వారా గురుదేవులకు పంపడానికి ఇంట్లో పాలు తప్ప ఏమీ లేవు. దయచేసి పాలను తీసుకుపోగలవా?” అని ఈమెను అడిగింది.అందుకు ఈ స్త్రీ నిరాకరించి, “దక్షిణేశ్వరంలో మంచి పాలకు ఏమీ కొదువలేదు. పాలకు చక్కని ఏర్పాటు చేసేవున్నారని నాకు తెలుసు. పైగా పాలను తీసుకుపోవడం ఎంతో ఇబ్బంది కూడా. కనుక పాలు తీసుకుపోవలసిన అవసరమేమీ లేదు” అని అంది.
దక్షిణేశ్వరం చేరిన తరువాత శ్రీరామకృష్ణులు గొంతునొప్పి కారణంగా పాలన్నం తప్ప మరే ఆహారమూ పుచ్చుకోలేకపోతున్నారని ఆమెకు తెలియవచ్చింది. పైగా ఏదో కారణం వలన రోజూ పాలు తెచ్చే పాలమ్మి ఆ రోజు పాలు తేనందున మాతృదేవి ఎంతో ఆదుర్దా చెందడం కూడా ఈమె చూసింది. కలకత్తా నుండి పాలు తీసుకురానందుకు ఈ భక్తురాలు ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపం చెందింది. దక్షిణేశ్వరం చుట్టుపట్ల పాలు ఎక్కడన్నా అమ్ముతున్నారేమోనని ఈమె వాకబు చేసింది. దేవాలయానికి కాస్త దూరంలో శ్రీమతి పాండే అనే ఉత్తరదేశ స్త్రీ వద్ద ఆవు ఉందనీ, ఆమె పాలు అమ్ముతుందనీ తెలియవచ్చింది. ఈ భక్తురాలు ఆమె ఇంటికి వెళ్ళింది. కాని అప్పటికే ఆమె ఇంట్లో పాలన్నీ నిండుకొన్నాయి. ఆమె వద్ద ఒక గ్లాసు పాలు మాత్రం మిగిలాయి; వాటినీ అప్పటికే ఆమె కాచివేసింది. ఆమెను ప్రాధేయపడి ఆ కాచిన పాలనే ఈ భక్తురాలు తీసుకొంది. ఈ భక్తురాలు అలా తెచ్చిన పాలతోనే గురుదేవులు నాడు భోజనం చేశారు. భోజనం పూర్తి చేశాక నోరు కడుక్కోవడానికి ఆయన చేతిలో ఈమె నీళ్ళు పోసింది.
ఆ తరువాత ఆయన ఈ భక్తురాలిని ప్రక్కకు పిలిచి ఆప్యాయత ఉట్టిపడే రీతిలో, “నా గొంతు చాలా నొప్పిగా ఉంది. రోగం నయం చేసే మంత్రాన్ని ఉచ్చరిస్తూ నీ చేతితో నా గొంతును నిమురు” అని అడిగారు. ఆ పలుకులు విని ఆ భక్తురాలు కొంతసేపు ఆశ్చర్యంలో మునిగిపోయింది. తరువాత గురుదేవులు కోరినట్లు తన చేతితో ఆయన గొంతును సుతిమెత్తగా నిమిరి, మాతృదేవి వద్దకు వెళ్ళింది. మాతృదేవితో ఈమె ఇలా అంది : “ఆ మంత్రం నాకు తెలుసని ఆయన ఎలా గ్రహించారు? చాలా కాలం క్రితం కొన్ని కోర్కెలను తీర్చగల మంత్రాన్ని ఘోష్పారా సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ నుండి నేర్చుకొన్నాను. భగవంతుణ్ణి ఉద్దేశరహితంగా ప్రార్థించాలని తెలుసుకొన్నప్పుడు, ఆ మంత్రాన్ని విసర్జించాను. గురుదేవులకు నా జీవితాన్నంతా పూసగుచ్చినట్లు చెప్పాను కాని ఈ మంత్రం విషయం మాత్రం దాచిపెట్టాను. ఆ మంత్రం విషయం చెబితే ఆయన నన్ను ఏవగించుకొంటారని భయపడ్డాను. అటువంటప్పుడు ఈ విషయం ఆయన ఎలా గ్రహించారు?” అన్న ఆమె మాటలు విని మాతృదేవి నవ్వుతూ, ఆప్యాయంగా ఇలా అన్నారు : “ఇతరుల ఆలోచనలు, చేతలు అన్నీ ఆయనకు తెలిసిపోతాయి. కాని అది ఇతరుల పట్ల ఉన్న ఆయన సద్భావాన్ని ఏమాత్రం చెరిపివేయదు. సదుద్దేశంతో ఎవరు ఏం చేసినా ఆయన వారి పట్ల అనిష్టత చూపరు. నువ్వేమీ భయపడనవసరం లేదు. ఇక్కడకు రాక మునుపే నేను కూడా ఆ మంత్రాన్ని పొందివున్నాను. ఆ మాట నేను చెప్పినప్పుడు ఆయన, ‘ఆ మంత్రదీక్ష పుచ్చుకొన్నా ఫరవాలేదు; ఇప్పుడు ఆ మంత్రాన్ని నీ ఇష్టదైవం పాదపద్మాలకు అర్పించు’ అని అన్నారు.”
10. వ్యాధి ప్రకోపించి గొంతు నుండి రక్తం స్రవించడం
శ్రావణం గడిచిపోయింది, భాద్రపదంలో కూడా కొన్ని రోజులు దొర్లిపోయాయి. అయినా ఎంత చికిత్సచేసినా ఆయన గొంతువ్యాధి ప్రకోపం తగ్గలేదు. భక్తులు దీనిని గురించి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నారుగాని, ఏం చేయాలో వారికి పాలుపోలేదు. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఒక సంఘటన వారు తక్షణ నిర్ణయానికి రావడానికి దోహదం చేసింది.
బాగ్బజార్‌కు చెందిన ఒక భక్తురాలు ఆ రోజు రాత్రి భోజనానికి భక్తులను తన ఇంటికి ఆహ్వానించింది. శ్రీరామకృష్ణులను కూడా తోడ్కొని వెళ్ళాలని ఆమె ఎంతో ఆశించింది. కాని ఆయన అస్వస్థులై ఉన్నారని తెలిసి, తన ఆశను పూర్తిగా వదలివేసింది. అయినప్పటికీ ఎలాగోలా వీలుచేసుకొని ఆయన రాగలరేమోనని చిరు ఆశతో ఒక భక్తుణ్ణి వేడుకొని దక్షిణేశ్వరానికి పంపింది. ఆ వెళ్ళిన వ్యక్తి రాత్రి తొమ్మిది గంటలకు కూడా తిరిగి రాకపోయేసరికి, ఇంకా ఆలస్యం చేయకుండా భక్తులనందరినీ భోజనానికి కూర్చోబెట్టింది. అప్పుడు దక్షిణేశ్వరానికి వెళ్ళిన భక్తుడు తిరిగివచ్చాడు. శ్రీరామకృష్ణుల గొంతు నుండి రక్తం స్రవించడం వలన ఆయన రాలేకున్నారనే సమాచారం తెలియచేశాడు. అప్పుడక్కడ నరేంద్రుడు, రాం, గిరీష్, దేవేంద్ర, మహేంద్ర (‘మ’) ప్రభృతులు ఉన్నారు. ఈ సమాచారం విని వారెంతో ఆందోళనపడ్డారు. వెంటనే అందరూ పరస్పరం సంప్రతించుకొని కలకత్తాలో చికిత్స నిమిత్తం ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వెంటనే శ్రీరామకృష్ణులను అక్కడకు తరలించాలని తీర్మానించారు. భోజనం చేస్తున్నప్పుడు నరేంద్రుడు ఖీన్నుడవడం గమనించిన ఒక యువకుడు దానికి కారణం ఏమిటని అడిగాడు. అందుకు నరేంద్రుడు ఇలా బాధపడ్డాడు. “ఎవరి సాంగత్య లబ్ధి వల్ల మనం ఇంత ఆనందాన్ని పొందుతున్నామో, ఆయన బహుశా ఈసారి మనలను విడిచి పోబోతున్నారు. వైద్యగ్రంథాల నుండి, మిత్రులైన వైద్యుల మాటల నుండి ఇటువంటి గొంతువ్యాధి క్రమంగా క్యాన్సర్‌గా పరిణమిస్తుందని తెలుసుకొన్నాను. రక్తం స్రవిస్తున్నదన్న విషయం ఈ రోజు విని, నేటి దాకా వైద్య శాస్త్రం ఎటువంటి చికిత్సా కనుగొనలేని ఆ వ్యాధే ఇది అని అనుమానిస్తున్నాను.”
11. చికిత్స నిమిత్తం బలరాం ఇంట్లో బసచేయడం
మర్నాడు ఉదయం వయస్సులో పెద్దవాళ్ళయిన కొద్దిమంది భక్తులు దక్షిణేశ్వరానికి వెళ్ళి, చికిత్స నిమిత్తం కలకత్తాకు వచ్చి ఉండవలసిందిగా శ్రీరామకృష్ణులను ప్రార్థించారు. అందుకు ఆయన అంగీకరించారు. గురుదేవులకు గల గంగాభక్తి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దుర్గాచరణ్ ముఖర్జీ వీథిలో ఒక చిన్న ఇంటి మేడమీద నుండి గంగానదిని చూడవచ్చునని తెలుసుకొని, భక్తులు ఆ ఇంటిని అద్దెకు తీసుకొని త్వరలోనే గురుదేవులను ఆ ఇంటికి తోడ్కొని వచ్చారు. కాని సువిశాల కాళికాలయ ప్రాంగణ వాతావరణంలో నివసించడానికి అలవాటుపడిన శ్రీరామకృష్ణులకు ఆ చిన్న ఇంట్లో నివసించడం అసాధ్యమైపోయింది. వెంటనే ఆయన రమాకాంత బసు వీథిలోని బలరాం బసు ఇంటికి వెళ్ళిపోయారు. బలరాం ఆయనను ప్రీతిపూర్వకంగా ఆహ్వానించి తగిన ఇల్లు లభించేదాకా తన ఇంట్లోనే ఉండమని ఆయనను ప్రార్థించాడు. అందుకు ఆయన అంగీకరించారు.
12. వ్యాధిని క్యాన్సర్‌గా నిర్ధారణ చేయడం
అనుకూలమైన ఇంటికోసం భక్తులు వెతకసాగారు. ఇక ఆలస్యం చేయడం ఎంతమాత్రం మంచిదికాదని ఎంచి ఈలోపు భక్తులు కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యులను రావించి శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి వారి అభిప్రాయాలను సేకరించసాగారు. గంగాప్రసాద్, గోపీ మోహన్, ద్వారకానాథ్, నవగోపాల్ ప్రభృత వైద్యులు రావింప బడ్డారు. వీరందరూ శ్రీరామకృష్ణులను పరీక్షించి రోగం నయంకాని రోహిణి (క్యాన్సర్) వ్యాధిగా నిర్ధారణచేశారు. ఒక భక్తుడు గంగాప్రసాద్‌ను ప్రక్కకుపిలిచి అడిగినప్పుడు అతడు తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు : “పాశ్చాత్యవైద్యులు క్యాన్సర్ అని పేర్కొనే వ్యాధే ఈ రోహిణి. వైద్యశాస్త్ర గ్రంథాలు ఈ వ్యాధికి చికిత్సా ప్రక్రియను సూచిస్తున్నప్పటికీ, ఈ వ్యాధిని నయంకానిదిగానే పరిగణిస్తారు” అని తెలియజేశాడు. వైద్యులు ఎటువంటి ఆశ కనబరచక పోవటంతోను, అధిక మోతాదులో ఔషధ వాడకం శ్రీరామకృష్ణుల శరీరతత్వానికి అసలు పడదని తెలిసి భక్తులు హోమియోపతి విధానంలో ఆయనకు చికిత్స జరిపించడం సబబని భావించారు. ఒక వారం రోజుల లోపుగానే శ్యాంపుకూర్ వీథిలోని గోకుల్చంద్ర భట్టాచార్య ఇంటిని భక్తులు అద్దెకు తీసుకొని శ్రీరామకృష్ణులను అక్కడకు తరలించారు. కలకత్తాలో సుప్రసిద్ధ వైద్యుడైన మహేంద్రలాల్ సర్కార్ ఆయనకు చికిత్స ప్రారంభించాడు.
శ్రీరామకృష్ణుల భక్తుల సమూహం.ముందు వరుస: తారక్ దత్త, అక్షయ్ సేన్, గిరిష్ ఘోష్, స్వామి అద్భుతానం (లాటు), మహేంద్రనాథ్ గుప్తా(మ). మధ్య వరుస: కాళీపద ఘోష్, దేవేంద్ర మజుందార్, స్వామి అద్వైతానం (పెద్ద గోపాల్). చివరి వరుస: దేవేంద్ర చక్రవర్తి, అవినాష్ ముఖోపాధ్యాయ, మహేంద్ర కవిరాజ్, విజయ్ మజుందార్.
13. బలరాం ఇంట్లో ఆధ్యాత్మిక సేవనం
శ్రీరామకృష్ణులు కలకత్తాకు వచ్చిన వార్త ఈ నోటా ఆ నోటా కలకత్తా నగరమంతా ప్రాకింది. గుంపులు గుంపులుగా తెలిసినవారు, తెలియనివారు శ్రీరామకృష్ణులను దర్శించడానికి బలరాం ఇంటికి రాసాగారు. అప్పుడు బలరాం ఇల్లు పండుగలా ఆనందంతో వెల్లివిరియ సాగింది. వైద్యుల నిర్దేశం మేరకు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు మాట్లాడకుండా ఉండగలిగినప్పటికీ, భక్తుల దీనాలాపాలు సదా ఆయనను ఆధ్యాత్మిక విషయాలు వారితో మాట్లాడడానికి ప్రేరేపించాయి. ఆయన కలకత్తాకు కేవలం ఈ ఉద్దేశంతో మాత్రమే వచ్చారన్నట్లో, దక్షిణేశ్వరం రాలేని భక్తులకు ఆధ్యాత్మిక వెలుగును ఇక్కడే ప్రసరింప చేయడానికి వచ్చారన్నట్లో కానవస్తున్నట్లుగా ఉంది గురుదేవుల కలకత్తా నివాసం. బలరాం ఇంట్లో బసచేసిన ఆ వారం రోజులు ప్రొద్దుట నుండి మధ్యాహ్నం భోజనం చేసేవరకు, ఆ తరువాత రెండు గంటలు విశ్రాంతి తీసుకొని మళ్ళీ అప్పటినుండి రాత్రి భోజనం చేసేదాకా ఎందరివో ఆధ్యాత్మిక జీవిత సమస్యలను పరిష్కరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాల మూలంగా అనేకులను ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షించారు. భక్తిగీతాలు ఆలకిస్తూ ప్రగాఢ భావసమాధ్యావస్థను పొంది, అనేకమంది ఆధ్యాత్మిక పిపాసువుల హృదయాలను శాంత్యానందాలతో ముంచెత్తివేశారు. గురుదేవులు బలరాం ఇంట్లో బసచేసిన అన్ని రోజులు అన్ని సమయాలలోను అక్కడే ఉండే అదృష్టం మాలో ఎవరికీ దక్కలేదు. అలాగే గురుదేవుల కోసం, భక్తుల కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడైన బలరాం కూడా అన్ని వేళల్లోనూ ఆయన వద్దే ఉండలేకపోయాడు. కాబట్టి ఆ వారంరోజులలో జరిగిన విషయాలను యథాతథంగా వివరించి చెప్పడం సాధ్యం కాదు. కాని ఆ వారం రోజులు ఆ ఇంట్లో గురుదేవులు ఎలా గడిపారో సూచించే ఒక సంఘటన వివరాలను మాత్రం ఇక్కడ పొందుపరుస్తున్నాం:
14. బలరాం ఇంట్లో జరిగిన ఒక సంఘటన
ఆ రోజుల్లో మేం కళాశాలలో చదువుతున్నాం. కనుక వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే శ్రీరామకృష్ణులను చూడగలిగేవారం. ఒకనాటి మధ్యాహ్నం బలరాం ఇంటికి వచ్చాం. మొదటి అంతస్తు చావడి గది జనంతో క్రిక్కిరిసి ఉంది. గిరీష్, కాళీపద ఘోష్ ఎంతో ఉత్సాహంతో పాడనారంభించారు:
“ఓ నితాయ్, నన్ను పట్టుకో!
నా హృదయం నేడు ఒక అవ్యక్తభావంతో నిండిపోయింది.”
ఎంతో కష్టపడి గదిలోకి రాగలిగాం. గదికి పశ్చిమ చివరన తూర్పు ముఖంగా కూర్చుని భావపారవశ్య స్థితిలో మగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులను చూశాం. ఆయన పెదవులపై ఆనందానుగ్రహాలను సూచిస్తూన్న చిరునవ్వు వెల్లి విరిసివుంది; కుడి కాలును ఎత్తి, చాచివున్నారు. ఆయన ముందు కూర్చున్న ఒక భక్తుడు ఆ కాలును ముద్దుగా అతిజాగ్రత్తగా తన ఛాతీమీద ఉంచుకొని ఉన్నాడు. మూసివున్న కళ్ళ నుండి అశ్రువులు ధారకట్టి అతడి చెంపలను, ఛాతీని తడిపి వేశాయి. శ్రీరామకృష్ణుల దివ్యసాన్నిధ్యంలో చేష్టలు దక్కి అందరూ కూర్చుని ఉన్నారు. పాట సాగిపోతున్నది :
నా హృదయం నేడు ఒక అవ్యక్తభావంతో నిండిపోయింది
నన్ను పట్టుకో, ఓ నితాయ్!
(ఓ నితాయ్) జీవులలో హరినామాన్ని పంచడానికి
ప్రేమ నదిలో ఏ తరంగాలు లేచాయో
ఆ తరంగాలలో నేనిప్పుడు తేలిపోతున్నాను
(ఓ నితాయ్) స్వయంగా నేనే వ్రాసిన ఋణపత్రం మీద
అష్టసఖుల* సాక్ష్యాలున్నాయ్
(ఇప్పుడు) ప్రేమ ఋణదాత అప్పును నేను తీర్చేదెలా?
(నేను) కూడబెట్టిన సంపదంతా హరించుకుపోయింది
కాని ఋణం మాత్రం తీరలేదే!
ప్రేమ అనే ఆ ఋణం కారణంగా
నే నిప్పుడు వేలం వేయబడుతున్నానే!
పాట పూర్తయింది. కాసేపటికి శ్రీరామకృష్ణులు పాక్షికంగా బాహ్య స్మృతిలోకి వచ్చారు. తమ ముందు కూర్చున్న వ్యక్తితో, ‘శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య’ అని పలుకమన్నారు. ఆ విధంగా ఆ వ్యక్తితో అలా ముమ్మార్లు ఉచ్చరింపచేసిన తరువాత ఆయన పూర్తి బాహ్యస్మృతిలోకి వచ్చి, అక్కడున్న వారితో మాట్లాడసాగారు. వాకబు చేసిన తరువాత ఆ వ్యక్తి పేరు నిత్యగోపాల్ గోస్వామి అనీ, ఢాకాలో ఏదో కళాశాలలో అధ్యాపకుడుగా పని చేస్తున్నాడనీ, శ్రీరామకృష్ణుల అస్వస్థత గురించి తెలుసుకొని ఆయనను చూడడానికి వచ్చాడనీ మాకు తెలిసింది. అతడి భక్తి ఉత్సుకత అతడి రూపసౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్నది.